• facebook
  • whatsapp
  • telegram

సామాజిక సేవకు విద్యామండలి అవసరం

* వెబినార్‌లో నిపుణుల అభిప్రాయం

ఈనాడు, హైదరాబాద్‌: సామాజిక సేవ విద్యా ప్రమాణాల పెంపు, సామాజిక సేవ నిపుణుల నమోదుకు జాతీయ స్థాయిలో సోషల్‌వర్క్‌ విద్యామండలి అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశంలో చిరకాలంగా ఈ విద్యకు మండలి ఏర్పాటు కాలేదని, ఏళ్ల తరబడి జరిగిన కృషి అనంతరం ముసాయిదా బిల్లు సిద్ధమైందన్నారు. జులై 07న తెలంగాణ రాష్ట్ర జాతీయ సామాజిక సేవా విద్యామండలి పోరాట కమిటీ ఆధ్వర్యంలో వెబినార్‌ జరిగింది. దేశంలో వృత్తి విద్య, నిపుణుల నమోదు, ప్రమాణాల పెంపునకు 15 రకాల మండళ్లు ఉన్నాయని, సోషల్‌వర్క్‌కు మాత్రం నేటికీ అలాంటిది ఏర్పాటు కాలేదని నిర్మల్‌ నికేతన్‌ కళాశాల పూర్వ ఆచార్యులు హెలెన్‌ జోసెఫ్‌ తెలిపారు. సామాజికవేత్తల సహకారంతో చైల్డ్‌లైన్‌ అందుబాటులోకి వచ్చిందని.. ఫలితంగా ఆహార భద్రత, విద్య, మహిళలు, చిన్నారుల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. సోషల్‌వర్క్‌ అంతర్జాతీయ వృత్తి అయినా.. దేశంలో ఆ విద్యకు మండలి లేనందున గుర్తింపు లభించలేదని ముంబయి టిస్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌సైన్సెస్‌)కు చెందిన మాజీ ప్రొఫెసర్‌ మురళీ దేశాయ్‌ అన్నారు. మండలి ఏర్పాటుతో సామాజిక సేవ విద్యలో ప్రమాణాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కళాశాలల అక్రిడిటేషన్‌తో పాటు పాఠ్యప్రణాళికలో మార్పులతో పాటు పరిశోధన మరింత విస్తృతం చేయవచ్చని రోడామిస్త్రీ కళాశాల మాజీ డైరెక్టర్‌ డీకే లాల్‌దాస్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 600కు పైగా కళాశాలల్లో ఏటా సుమారు లక్ష మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ స్థాయుల్లో సామాజికసేవలో ప్రవేశాలు పొందుతున్నారని ఆయన చెప్పారు. వెబినార్‌లో తెలంగాణ వర్సిటీ సహాయ ప్రొఫెసర్‌ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Posted Date : 07-07-2021