• facebook
  • whatsapp
  • telegram

EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల‌కు టాప్ ర్యాంకులు

తొలి 10 ర్యాంకర్లలో ఆరుగురు ఏపీ విద్యార్థులే

‘అగ్రికల్చర్‌’ టాప్‌-10లోనూ నలుగురు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ మొదటి 10 ర్యాంకర్లలో ఆరుగురు ఏపీ విద్యార్థులే. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలోనూ టాప్‌టెన్‌లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉండటం విశేషం. ఇంజినీరింగ్‌లో 1, 2 ర్యాంకులను ఏపీకి చెందిన సత్తి కార్తికేయ, దుగ్గినేని వెంకట పణీష్‌ సాధించారు. అగ్రికల్చర్‌లో తెలంగాణకు చెందిన మండవ కార్తికేయ, ఈమని శ్రీనిజ సాధించారు. ఎంసెట్‌ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 82.08 శాతం, అగ్రికల్చర్‌లో 92.48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌లో 160కి 158, అగ్రికల్చర్‌లో 151 అత్యధిక స్కోరుగా నమోదయ్యాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన పోతంశెట్టి చేతన్‌ మనోజ్ఞ సాయి 6వ ర్యాంకు, విజయనగరానికి చెందిన ఎం.ప్రణయ్‌ 7, నెల్లూరు విద్యార్థి దేశాయ్‌ సాయి ప్రణవ్‌ 8, విజయనగరం వాసి సవరం దివాకర్‌ సాయి 9వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ 4వ ర్యాంకు తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ విద్యార్థి చందం విష్ణు వివేక్‌ 5వ ర్యాంకు, కాకినాడకు చెందిన కోలా పవన్‌రాజు 6, విజయవాడ వాసి పల్లి వెంకట కౌశిక్‌రెడ్డి 8వ ర్యాంకు సాధించారు.  

16,777 మంది ‘ఈడబ్ల్యూఎస్‌’ అభ్యర్థుల ఉత్తీర్ణత

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు సుమారు 52 వేల మంది వరకు ఓసీలు (జనరల్‌ కేటగిరీ) దరఖాస్తు చేశారు. అందులో దాదాపు 20 వేల మందికి పైగా ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 16,777 మంది ఉత్తీర్ణులైనట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో మరో 4,452 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యాశాఖ జీవో జారీ చేస్తే సూపర్‌ న్యూమరరీ కింద 10 శాతం సీట్లను పెంచి వారికి కేటాయిస్తారు.

రోజుకు 14 గంటల సాధన: సత్తి కార్తికేయ, ఇంజినీరింగ్‌ మొదటి ర్యాంకర్‌

జేఈఈ మెయిన్స్‌లో 99.993 పర్సంటైల్‌ వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో కంప్యూటర్స్‌ సైన్స్‌ చదవడమే లక్ష్యం. మా నాన్న త్రినాథరావు చిరు వ్యాపారి. తల్లి మోహన కృష్ణకుమారి. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌లో 977 మార్కులు సాధించా. రోజుకు 14 గంటలు సాధన చేయడం ఉపయోగపడింది. 

శ్రమించా.. సాధించా: దుగ్గినేని వెంకట పణీష్, రెండో ర్యాంకర్‌

మంచి ర్యాంకు సాధించేందుకు బాగా శ్రమించాను. నాన్న యుగంధర్‌నాయుడు, అమ్మ లక్ష్మీదేవి. అక్టోబరు 3న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై దృష్టి పెట్టాను. అందులో మంచి ర్యాంకు సాధిస్తా. బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌ చేయాలన్నదే నా లక్ష్యం.

Posted Date : 26-08-2021