• facebook
  • whatsapp
  • telegram

AIDED: ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఆపలేదు!

హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వ న్యాయవాది

ఈనాడు, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలను తాము నిలువరించలేదని విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) రఘువీర్‌ హైకోర్టుకు నివేదించారు. విద్యార్థుల ప్రవేశాలు, విద్యాభ్యాసంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఎలాంటి ప్రభావం చూపబోవని అన్నారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులనిచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశించింది. ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు (పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు) ఆర్థికసాయం నిలిపేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదంటే తమకు అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యాచట్టానికి సవరణ చేస్తూ ఆగస్టు 6న ఆర్డినెన్స్‌ 12/2021 తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై యాజమాన్యాల సమ్మతిని తెలుసుకోవాలని కళాశాల విద్య కమిషనర్‌ను ఆదేశిస్తూ ఆగస్టు 10న జీవో 42ను జారీ చేసింది. ఆర్డినెన్సు, జీవో 42ను సవాలుచేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు షేక్‌ నాగూర్‌బీ మరో ఆరుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదువుకొని ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారు. అలాంటి విద్యాసంస్థలకు ఆర్థికసాయం నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఏకపక్షం. ప్రభుత్వ చర్య విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎయిడ్‌ నిలిపేస్తే ప్రైవేటు విద్యాసంస్థలు అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తాయి. విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. విద్యాసంస్థల యాజమాన్యాల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆర్డినెన్సు తీసుకొచ్చారు’ అని అన్నారు. విద్యాశాఖ ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వం గ్రాంటు ఇస్తున్నా కొన్ని ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రవేశాలు లేవు. విద్యాసంస్థలను నిర్వహించలేని యాజమాన్యాలనుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకునేందుకు సమ్మతిని తెలుసుకుంటున్నాం. ఏ యాజమాన్యాన్ని బలవంతం చేయడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులతో విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకం కలగదు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయమివ్వండి’ అని కోరారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.