• facebook
  • whatsapp
  • telegram

TS Job Notification: త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

* మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్‌ గ్రామీణం, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురుపూజోత్సవానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక లక్షా 32వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రాష్ట్రంలో 50 నుంచి 62వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే నేపథ్యంలో కొత్త జిల్లా, జోనల్‌ వ్యవస్థలను తీసుకొచ్చామన్నారు. నూతన జిల్లాలు, జోనల్‌ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సవరణ కూడా జరిగిందన్నారు. దీని ఆధారంగా అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయిందన్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా నోటిఫై చేసి ఆ జిల్లా కేంద్రంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందన్నారు. కేంద్రంలో ఏడేళ్ల భాజపా పరిపాలనలో భారతదేశం జీడీపీ మైనస్‌ 2 శాతానికి చేరిందన్నారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం జీడీపీలో ప్రథమ స్థానంలో నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు.

 

Posted Date : 06-09-2021