• facebook
  • whatsapp
  • telegram

CM KCR: జోనల్‌ విధానంపై త్వరలో సీఎం సమీక్ష 

ఉద్యోగ నియామకాలపై నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త విధానం మేరకు ఇతర జోన్లలో పనిచేస్తున్న వారిని సొంత జోన్లకు పంపించడం, అర్డర్‌ టు సర్వ్‌ ఉద్యోగుల కేటాయింపులు, సీనియారిటీ, జిల్లాలవారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల జారీ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. సీఎం సమీక్ష సమాచారంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 21 లేదా 22 నుంచి శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జోనల్‌ విధానానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ముందే తీసుకునే వీలున్నట్లు తెలిసింది. 
మరో 12 మందికి పదోన్నతులు 
సచివాలయంలో సెప్టెంబ‌రు 9న‌ మరో 12 మంది సహాయ విభాగాధికారులకు ఎస్‌వోలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. దీనిపై టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌ సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డర్‌ టు సర్వ్‌ ఉద్యోగులకు సీనియారిటీ నష్టం కాకుండా చూడాలని కోరారు.

Posted Date : 11-09-2021