దిల్లీ: అధికారం కోసం జరిగే క్రీడలో యువ వైద్యులతో ఫుట్బాల్ ఆడుకోవద్దని సోమవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. నీట్-సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షల సిలబస్లో చివరి నిమిషంలో చేసిన మార్పులపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయమై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే తీవ్ర ఆక్షేపణ తెలుపుతామని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. వారం రోజుల్లోగా సమావేశమయి తొలుత ఇంటిని చక్కదిద్దుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ), జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ)లను సూచించింది. ‘‘యువ వైద్యుల జీవితాలను కొందరు సున్నితత్వంలేని అధికారుల చేతుల్లో పెట్టడాన్ని అనుమతించం’’ అని వ్యాఖ్యానించింది. ఎన్ఎంసీ తరఫు న్యాయవాది గౌరవ్ శర్మ కల్పించుకొని సమాధానం చెప్పడానికి వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ఎన్ఎంసీ ఏం చేస్తోంది? ఇది యువ వైద్యుల జీవితానికి సంబంధించిన వ్యవహారం. జులై 23న పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 31న సిలబస్లో మార్పులు చేశారు. నవంబరు 13, 14న పరీక్షలు నిర్వహిస్తారు. ఏమిటిఇదంతా?’’ అని ప్రశ్నించింది. ఎన్బీఈ తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ స్పందిస్తూ సమాధానం ఇచ్చేందుకు వచ్చే సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ ‘‘మీ వాదన వింటాం. చివరి నిమిషంలో మార్పులు చేసిన తీరుపై అసంతృప్తితో ఉన్నామని అధికారులకు చెప్పండి. మీరు వివరించే కారణాలు న్యాయబద్ధంగా లేకపోతే తీవ్ర ఆక్షేపణ తెలుపుతాం. దానిని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు. విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ చిక్కులు ఎదురైతే... చెక్ పెట్టేది ఇలా!
‣ విశిష్ట సంస్థలో... విభిన్న భాషలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.