డీఎస్పీల సర్వీస్ అంశాలపై హోంశాఖ స్పష్టత
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్పీల సర్వీస్ అంశాలకు సంబంధించి హోంశాఖ స్పష్టత ఇచ్చింది. ఎంపిక సమయంలో వీరిని మల్టీజోనల్ కేడర్‌గా.. పోస్టింగ్ అప్పుడు మాత్రం రాష్ట్రస్థాయి కేడర్‌గా పరిగణించాలని నిర్ణయించింది. అపాయింటింగ్ అథారిటీలను నియమిస్తూ ఇటీవలే జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు నిబంధనల్ని రూపొందించింది. ఈ క్రమంలో ఇకపై రాష్ట్రంలో జరిగే డీఎస్పీల నియామక సమయంలో మల్టీజోనల్ స్థాయిలో ఉన్న ఖాళీలనే పరిగణనలోకి తీసుకొని పోస్టుల సంఖ్యను నిర్ణయించనున్నారు. అంతకుముందు రాష్ట్రస్థాయిలోని ఖాళీలను పరిగణనలోకి తీసుకునేవారు. అలాగే, కానిస్టేబుళ్ల నుంచి డీఎస్పీల వరకు అపాయింటింగ్ అథారిటీల గురించి ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. వీరికి సంబంధించి పదోన్నతులు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు.. ఇలా అన్ని అంశాలనూ సంబంధిత అపాయింటింగ్ అథారిటీలే పర్యవేక్షిస్తాయి. అన్ని విభాగాల హెచ్వోడీలు.. రాష్ట్రస్థాయి ప్రత్యేక అధికారుల నియామకాలు, పోస్టింగ్‌లు యథావిధిగానే ఉంటాయి.
వివిధ పోస్టులకు అపాయింటింగ్ అథారిటీలు..
‣ సివిల్ విభాగంలో కానిస్టేబుళ్లకు సంబంధించి ఎస్పీలు లేదా కమిషనర్లు.. హెడ్‌కానిస్టేబుళ్ల నుంచి ఎస్సైల వరకు జోన్ డీఐజీలు.. ఇన్స్పెక్టర్లకు మల్టీజోన్ ఐజీలు.. డీఎస్పీలకు డీజీపీ(హెచ్‌వోపీఎఫ్) అపాయింటింగ్ అథారిటీగా ఉంటారు.
‣ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సైల వరకు డీఐజీ(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్).. ఇన్స్పెక్టర్లకు ఐజీ/ఏడీజీ(టెక్నికల్ సర్వీసెస్).. డీఎస్పీలకు డీజీపీ అథారిటీగా ఉంటారు.
‣ టీఎస్ఎస్పీలో కానిస్టేబుళ్లకు సంబంధిత బెటాలియన్ కమాండెంట్లు.. హెడ్‌కానిస్టేబుళ్ల నుంచి ఏఆర్ఎస్సైల వరకు బెటాలియన్స్ డీఐజీ/ఐజీ.. ఆర్‌ఎస్సైలకు బెటాలియన్స్ ఐజీపీ/అదనపు డీజీపీ.. అసిస్టెంట్ కమాండెంట్లకు డీజీపీ అపాయింటింగ్ అథారిటీలు.
‣ ఏఆర్ విభాగంలో కానిస్టేబుళ్లకు సంబంధిత ఎస్పీలు/కమిషనర్లు.. హెడ్‌కానిస్టేబుళ్ల నుంచి ఆర్‌ఎస్‌ఐల వరకు జోన్ డీఐజీలు.. ఆర్ఐల నుంచి డీఎస్పీల వరకు డీజీపీ అపాయింటింగ్ అథారిటీ.
‣ ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో కంటిగ్యుయెస్ జోనల్ కేడర్‌లోని ఏఎస్ఐ, ఎస్సైలకు సంబంధించి సీఐడీ డీజీపీ, మల్టీజోనల్ కేడర్‌లోని ఇన్స్పెక్టర్, డీఎస్పీలకు సంబంధించి డీజీపీ అపాయింటింగ్ అథారిటీగా ఉంటారు.
‣ మినిస్టీరియల్ స్టాఫ్‌కు సంబంధించి అఫీస్ సబార్డినేట్ నుంచి రికార్డు అసిస్టెంట్ స్థాయి వరకు ఎస్పీ/కమిషనర్.. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు సంబంధిత బెటాలియన్ల కమాండెంట్లు.. సీనియర్ అసిస్టెంట్ల నుంచి సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులకు డీఐజీలు.. జేఏవోలకు డీజీపీ అపాయింటింగ్ అథారిటీ.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.