* 11 కళాశాలల్లో ఏర్పాటుకు సాంకేతిక విద్యాశాఖ యోచన
* షిఫ్టు విధానంలో ఇంజినీరింగ్ తరగతులను నడపాలని ప్రతిపాదన
* ఆర్థికభారం లేకుండానే సర్కారు బీటెక్ సీట్లు పెంచుకునే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చాలని సాంకేతిక విద్యాశాఖ యోచిస్తోంది. ముఖ్యంగా పెద్దవి, పాతవైన 11 కళాశాలల్లో ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించే ప్రతిపాదనలపై ఆ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతోనూ ఆయన చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో 52 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వాటిలో తగినన్ని మౌలిక వసతులు, స్థలాలు అందుబాటులో ఉన్నాయి. తమ జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలలను నెలకొల్పాలని పలువురు మంత్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్తవి ఏర్పాటు చేయడం కంటే ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చవచ్చని సాంకేతిక విద్యాశాఖ ఆలోచన. పాత జిల్లా కేంద్రాల్లోని 11 పాలిటెక్నిక్‌లను పూర్తిగా ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చవచ్చని.. లేదా ఒక షిప్టులో ఇంజినీరింగ్ తరగతులు నిర్వహించవచ్చని ప్రతిపాదన. దానివల్ల ప్రభుత్వంపై ఆర్థికభారం లేకుండానే కొత్తగా 5 వేల బీటెక్ సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లోని రామంతాపూర్, మాసబ్‌ట్యాంక్, సికింద్రాబాద్, కులీకుతుబ్‌షా, వరంగల్, కొత్తగూడెం తదితర కళాశాలల్లో ఒక షిఫ్టులో ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించవచ్చని ప్రతిపాదిస్తున్నారు. చాలావరకు అర్హులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నందున పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందుతుందని చెబుతున్నారు. ఉదాహరణకు.. నిజామాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల లేదు. అక్కడ ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. దీనికి కనీసం 50 ఎకరాల స్థలం, రూ.300 కోట్ల నిధులు అవసరం. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అవసరమైనంత స్థలం ఉండటంతో అందులో ఇంజినీరింగ్ తరగతులు నడిపే అవకాశం ఉందని చెబుతున్నారు. పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్ కళాశాలలుగా ఉన్నతీకరించాలన్న ప్రతిపాదన నాలుగైదేళ్ల కిందట కూడా వచ్చింది. కానీ అప్పట్లో సర్కారు ఆమోదం తెలపలేదు. తాజా ప్రతిపాదనలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఉద్యోగ సంస్థల్లో ఆన్లైన్ శిక్షణ
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.