* ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపికలో పార్ట్-2 దరఖాస్తుల నమోదు పూర్తి
* తప్పుల సవరణకు ఆన్లైన్లో ఎడిట్ సదుపాయం
ఈనాడు, హైదరాబాద్: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఎంపిక ప్రక్రియలో కీలకమైన పార్ట్-2 దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్ 11వ తేదీతో ముగిసింది. తదుపరి అంకమైన శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణపై మండలి దృష్టి సారించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ)లను రాష్ట్రవ్యాప్తంగా 11-12 కేంద్రాల్లో నిర్వహించనుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు అదనంగా ఒకట్రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ప్రారంభమైన 25 పనిదినాల్లో ఈ పరీక్షలు పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచి వీటిని ప్రారంభిస్తామనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. పీఈటీ/ పీఎంటీ అడ్మిట్‌కార్డులను వెబ్సైట్ ద్వారా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు అభ్యర్థులు తమవెంట అడ్మిట్‌కార్డుతో పాటు తీసుకురావాల్సిన సర్టిఫికేట్ల గురించి మండలి స్పష్టత ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే కులధ్రువీకరణపత్రం.. మాజీ సైనికులైతే ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/సర్వీసులో ఉంటే నిరభ్యంతర పత్రం.. ఎస్టీలైతే ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి.
2,37,862 మంది అభ్యర్థుల దరఖాస్తు
ప్రాథమిక రాతపరీక్ష(పీడబ్ల్యూటీ)లో ఉత్తీర్ణులైన 2,37,862 మంది అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 1,91,363 మంది పురుషులు కాగా.. 46,499 మంది మహిళలున్నారు. పలువురు అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడుతుండటంతో దాదాపు రెట్టింపుకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,07,890 రావాల్సి ఉండగా.. గడువులోపు 4,63,970 నమోదయ్యాయి. సాంకేతికేతర పోస్టుల్లో 96శాతం.. సాంకేతిక పోస్టుల్లో 91శాతం దరఖాస్తులొచ్చాయి. ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు అత్యధికంగా.. పోలీస్ రవాణా సంస్థ డ్రైవర్ పోస్టులకు అత్యల్పమంది నమోదు చేసుకున్నారు.
* హైరానా వద్దు.. అవకాశమిస్తాం: వి.వి.శ్రీనివాసరావు, టీఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్
అభ్యర్థులు సమర్పించిన పార్ట్-2 దరఖాస్తుల్లో తప్పిదాలు దొర్లాయంటూ పలువురు అభ్యర్థులు మండలి కార్యాలయాన్ని సంప్రదించి వినతులు ఇస్తున్నారు. మెయిల్స్, సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి హైరానా అవసరం లేదు. పలు దరఖాస్తుల్లో తప్పులు దొర్లినట్లు ఇప్పటికే గుర్తించాం. అలాంటి వారికి ఎడిట్ ఆప్షన్ ద్వారా సవరణకు తగిన సమయంలో లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా అవకాశం ఇస్తాం. అందుకే అభ్యర్థులు ఈవిషయంలో గందరగోళానికి గురికావొద్దు.
ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఎంపిక ప్రక్రియలో పార్ట్-2 దరఖాస్తుల స్వీకరణ వివరాలు..
* నాన్-టెక్నికల్(సాంకేతికేతర) పోస్టుల్లో..
పోస్టులు | అర్హత పొందిన దరఖాస్తులు | నమోదైనవి | శాతం |
సివిల్ ఎస్సై స్థాయి | 1,05,601 | 1,01,052 | 96 |
సివిల్ కానిస్టేబుల్ స్థాయి | 1,84,847 | 1,76,370 | 95 |
ఆబ్కారీశాఖ కానిస్టేబుల్ | 1,09,516 | 1,06,272 | 97 |
రవాణాశాఖ కానిస్టేబుల్ | 18,758 | 17,172 | 92 |
మొత్తం | 4,18,722 | 4,00,866 | 96 |
* టెక్నికల్(సాంకేతిక) పోస్టుల్లో...
పోస్టులు | అర్హత పొందిన దరఖాస్తులు | నమోదైనవి | శాతం |
ఐటీ కమ్యూనికేషన్స్ ఎస్సై | 14,474 | 11,151 | 77 |
ఎస్సై పోలీస్ రవాణా సంస్థ | 3,525 | 2,762 | 78 |
ఏఎస్సై ఫింగర్ ప్రింట్ బ్యూరో | 6,000 | 4,820 | 80 |
ఐటీ కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్ | 22,000 | 16,816 | 76 |
డ్రైవర్(పోలీస్ రవాణా సంస్థ) | 26,988 | 16,891 | 63 |
అగ్నిమాపకశాఖ డ్రైవర్ ఆపరేటర్ | 10,963 | 7,118 | 65 |
మెకానిక్(పోలీస్ రవాణా సంస్థ) | 5,218 | 3,546 | 68 |
మొత్తం | 89,168 | 63,104 | 71 |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.