• facebook
  • whatsapp
  • telegram

Education: నాణ్యమైన విద్యనందించే అంకుర సంస్థలు

* విద్యార్థుల ప్రగతికి యువత సాయం

 


ఒక దేశ ప్రగతి అక్కడి విద్యావ్యవస్థపైనే ఆధార పడుతుంది. కానీ మన భారతీయ విద్యావ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు. వాటిని దాటి అందరికీ నాణ్యమైన విద్యని అందించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ అంకుర సంస్థలు.


డాక్టర్ల సోషల్‌ నెట్‌వర్క్‌...



కేరళకు చెందిన డాక్టర్‌ దీపు సెబిన్‌... ఎండీ జనరల్‌ మెడిసిన్‌ పూర్తిచేశాడు. వైద్యరంగంలో అంకుర సంస్థ ప్రారంభించాలన్నది తన లక్ష్యం. అతడికి ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్న ప్రియాంక్‌ చౌబే, నిమ్మీ చెరియన్‌ తోడయ్యారు. వైద్యవృత్తి చాలా క్లిష్టమైంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయం వస్తుంది. కొన్నిసార్లు పాత రోగాలు మళ్లీ వెలుగులోకి వస్తాయి. అందుకే వైద్యులు తమ అనుభవ పాఠాల్నీ, విజ్ఞానాన్నీ పంచుకునే ఓ వేదికని ప్రారంభించాలనుకున్నారీ  మిత్రులు. అలా మొదలైందే ‘డైలీ రౌండ్స్‌’. ఇదో వైద్యుల అకడమిక్‌ నెట్‌వర్క్‌. 2014లో ప్రారంభించిన ఈ సంస్థలో ప్రస్తుతం అయిదు లక్షల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు. దీన్లో వైద్యులు కొన్ని కేస్‌స్టడీస్‌ని పంచుకుంటారు. ఆయా విభాగాల వాళ్లు వాటిని చదువుతుంటారు. ఈ ఆప్‌లో రోజూ పది ప్రశ్నలతో ఒక క్విజ్‌ని ఇచ్చేవారు. దానికి మంచి స్పందన ఉండేది. వాళ్లలో నీట్‌ పీజీకి సిద్ధమయ్యేవాళ్లు అలాంటి క్విజ్‌లు ఇంకా కావాలని అడిగేవారు. దాంతో ‘మారో’ అనే ఆప్‌ని తెచ్చి నీట్‌-పీజీ కోసం సిద్ధమయ్యేవారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. వీటికి తోడు వీడియో పాఠాల్ని పెడతారు. ఇవి ఎంబీబీఎస్‌ విద్యార్థులకే కాదు, ప్రాక్టీసు చేసే వైద్యులకూ ఉపయోగపడేలా ఉంటాయి. ‘మారో’కి ప్రస్తుతం ఆరు లక్షల మంది వినియోగదారులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.500 కోట్లు. ఈ సంస్థని ప్రస్తుతం జపాన్‌కు చెందిన ‘ఎమ్‌3’ చేజిక్కించుకుంది.


డిజిటల్‌ చదువు ఉచితం...
 

డబ్బు కొద్దీ చదువు... అనే విధానాన్ని పోగొడుతున్నారు ‘కాన్వేజీనియస్‌’ వ్యవస్థాపకులు జైరాజ్‌ భట్టాచార్య, శశాంక్‌ పాండే. వీరిద్దరూ ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ పూర్వ విద్యార్థులు. బీటెక్‌ తర్వాత భట్టాచార్య సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీలో, పాండే హైదరాబాద్‌లో ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’లోనూ ఉద్యోగులుగా చేరారు. మన విద్యావ్యవస్థలో పట్టణ-గ్రామీణ, ధనిక-పేద... లాంటి అంతరాల కారణంగా గ్రామీణ, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని గమనించి దాన్ని సరిదిద్దాలనుకున్నారు. 2014లో ప్రారంభించిన ‘కాన్వేజీనియస్‌’ ద్వారా ఉచితంగా విద్యని అందించాలనుకున్నారు. పదో తరగతి వరకూ పాఠ్యాంశాల్ని కథలూ, పజిల్స్‌, పాటలుగా డిజైన్‌ చేసి ట్యాబ్లెట్‌ ద్వారా అందిస్తున్నారు. క్లిష్టమైన సైన్స్‌ పాఠాల్నీ గ్రాఫిక్స్‌ సాయంతో సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులూ తీసుకోకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, స్వచ్ఛంద సంస్థలూ, ఫౌండేషన్‌లతో కలిసి పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ ట్యాబ్లెట్లలోనే పరీక్షలూ నిర్వహించి విద్యార్థి అవగాహన స్థాయిని ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చు. ‘స్విఫ్ట్‌చాట్‌’ పేరుతో ఆప్‌నీ వీరు తెచ్చారు. అందులో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులకు పాఠశాలల్లో రోజుకు సగటున ఓ గంట ఈ ట్యాబ్‌ ఇస్తారు. కాన్వేజీనియస్‌... అమూల్యమైన ప్రయత్నానికి మైఖేల్‌-సుశాన్‌ డెల్‌ ఫౌండేషన్‌, గ్రే మేటర్స్‌ లాంటి సంస్థలు నిధులు అందిస్తున్నాయి. తొమ్మిది భాషల్లో సేవలందిస్తూ ఇప్పటికే సుమారు ఏడు కోట్ల మంది విద్యార్థుల్ని చేరిందీ సంస్థ.  


ఆన్‌లైన్‌ ప్రవేశ ద్వారం...
 


 

భాస్వత్‌ అగర్వాల్‌, ముకుల్‌ రస్తోగి... 2013లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. అగర్వాల్‌ టెక్‌ స్ట్రాటజిస్ట్‌గా మైక్రోసాఫ్ట్‌లో, రస్తోగి..  డెరివేటివ్స్‌ అనలిస్ట్‌గా ఫ్యూచర్స్‌ ఫస్ట్‌లో చేరారు. రెండేళ్లకు ఉద్యోగాలు మానేసి ఆన్‌లైన్‌లో ఓ శిక్షణ సంస్థని ప్రారంభించగా  విజయం సాధించలేకపోయారు. ఆ సమయంలోనే ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థలవల్ల పట్టణాలూ, నగరాల్లో స్థానికంగా పేరున్న కాలేజీలూ, కోచింగ్‌ కేంద్రాల నిర్వాహకులు ఇబ్బంది పడటం చూశారు. తమ టెక్‌ నైపుణ్యాలు ఉపయోగించి అలాంటి వారికి అవసరమైన సాంకేతికతను అందించేందుకు ‘క్లాస్‌ప్లస్‌’ని మొదలుపెట్టారు. లైవ్‌ క్లాసులకి జూమ్‌, డేటా స్టోరేజీకి గూగుల్‌ డ్రైవ్‌, చెల్లింపులకు పేమెంట్‌ సంస్థలూ, చాట్‌ సపోర్ట్‌... ఇలా వేర్వేరుగా కాకుండా అన్నీ ‘క్లాస్‌ప్లస్‌’ వేదికమీద ఉంటాయి. వస్తువుల అమ్మకందార్లకు అమెజాన్‌ మాదిరిగా... ఆన్‌లైన్‌ శిక్షకులూ, బోధకులకు నోయిడా కేంద్రంగా పనిచేసే క్లాస్‌ప్లస్‌ పనిచేస్తుంది. మాదిరి పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ప్రగతి నివేదిక పరిశీలన లాంటివీ క్లాస్‌ప్లస్‌ద్వారా సాధ్యమే. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలూ, చిన్న పట్టణాల వాళ్లకి క్లాస్‌ప్లస్‌ ఓ అద్భుతమైన వేదిక. మూడు వేల నగరాలూ, పట్టణాలకు చెందిన లక్షకుపైచిలుకు సంస్థలూ, వ్యక్తులూ వీరి సేవల్ని ఉపయోగించుకోవడం విశేషం. టైగర్‌ గ్లోబల్‌, బ్లూమ్‌ వెంచర్స్‌ లాంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!

‣ విశ్వమంతా సూక్ష్మరూపం!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.