• facebook
  • whatsapp
  • telegram

 Jobs: ఉద్యోగాలంటారు.. ఉసూరుమనిపిస్తారు!

* జాబ్‌ క్యాలెండర్‌ను పట్టించుకోని ప్రభుత్వం

* సీఎం చెప్పిన మాటలన్నీ నీటిమీద రాతలే

* నోటిఫికేషన్లంటూ మళ్లీ ఏపీపీఎస్సీ ప్రకటన

* ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడి!


ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం... నేడే 2021-22 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల ... ప్రతి నెలా నోటిఫికేషన్ల ద్వారా పారదర్శకంగా నియామకాలు ... ఇదీ జూన్‌ 18, 2021న సీఎం జగన్‌ అన్నమాట. నాడు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పి నిరుద్యోగ యువత ఆకాంక్షలను జగన్‌ తొక్కేశారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి రెండేళ్లు దాటినప్పటికీ  అందులో పేర్కొన్న గ్రూపు-2, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికీ జారీ కాలేదు. తాజాగా ఈ నెలలో నోటిఫికేషన్లు ఇస్తామంటూ ఏపీపీఎస్సీ ప్రకటించినా అది కార్యరూపం దాలుస్తుందా అని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండటం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

2021లో జారీచేసిన ‘క్యాలెండర్‌’లో పేర్కొన్న ప్రకారం ఆ ఏడాది ఆగస్టులో గ్రూపు-2 నోటిఫికేషన్‌, 2022 జనవరిలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడాలి. ఆశావహులు ఎంతగా వేచిచూసినా ఫలితం లేకపోయింది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు లో నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇన్నిరోజులు జాప్యం చేసినా పోస్టుల పెంపు అంతంత మాత్రమే. గ్రూపు-1, గ్రూపు-2 కింద 36 పోస్టులను భర్తీ చేస్తామని 2021లో ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉన్నందున నిరుద్యోగులు గగ్గోలు పెట్టారు. దీంతో 2022 సెప్టెంబరులో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీ(110)కి మాత్రమే నోటిఫికేషన్‌ వెలువడగా నియామకాలు జరిగాయి. గ్రూపు-2 పోస్టుల్ని పెంచేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. నిరుద్యోగుల తీవ్ర నిరసనల మధ్య  2023, మే 25న గ్రూపు-1 కింద 100, గ్రూపు-2 కింద 900 చొప్పున పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన వెలువడినప్పటికీ ఇప్పటికీ నోటిఫికేషన్లు రాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీపై ఏపీపీఎస్సీ మళ్లీ ప్రకటన చేసింది.

ఖాళీలు ఎక్కువ.. భర్తీ తక్కువ

ప్రభుత్వ శాఖల్లో సుమారు 66,309 ఖాళీలున్నాయి. పాఠశాల విద్యాశాఖలో 2,20,266 పోస్టులకు 1,73,713 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖలో 15,818 పోస్టులకు 5,193 మందే ఉన్నారు. వ్యవసాయ సహకార శాఖలో 11,329కి 6,906, సాంఘిక సంక్షేమ శాఖలో 16,598కి 10,160 మంది చొప్పున ఉన్నారు. ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్‌ వెలువడితే మళ్లీ కొత్తది వచ్చేందుకు ఏళ్ల తరబడి ఆలస్యమవుతోంది. ‘నోటిఫికేషన్ల జారీలో ఇకపై జాప్యం ఉండదు. మా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల ఎదురుచూపులు ఉండవు. ధైర్యం కోల్పోతున్న యువతలో మార్పు తెస్తాం’ అని 2021లో సీఎం జగన్‌ చేసిన ప్రకటన తప్పని రుజువైంది. డిగ్రీ కళాశాలల్లో 240 అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తామని ఆ ఏడాది ప్రకటించినా నోటిఫికేషన్‌ రానేలేదు. ఈ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామంటున్నారు. అప్పటికీ  ఇప్పటికీ అదనంగా పెరిగిన పోస్టులు 27 మాత్రమే. తాజాగా 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇందులో గ్రూపు-1 కింద 89, గ్రూపు-2 కింద 900 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ కొందరు నిరుద్యోగులు వయసు రీత్యా అనర్హులవుతున్నారు. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2023 సెప్టెంబరు 30తో ఆ గడువు ముగిసింది. ఆ వెసులుబాటును వచ్చే 2024 సెప్టెంబరు దాకా పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ‘క్యాలెండర్‌’లో పేర్కొన్న ప్రకారం నోటిఫికేషన్ల జారీ లేనందున వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా‌ (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ గేట్‌ తుది సన్నద్ధత

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.