• facebook
  • whatsapp
  • telegram

Education: నాలుగేళ్లు గడిచినా అక్షరాస్యత ప్రత్యేక కార్యక్రమాల అమలే లేదు

కేంద్రం ఇచ్చిన నిధులనూ సకాలంలో విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న డ్రాపౌట్లు, వలసల సంఖ్య

2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో నిరక్షరాస్యత 33%. అదే జాతీయ సగటు చూస్తే 27%. ప్రజల్లో చదువుకోవాలనే ఆరాటం లేక కాదు..చదివించాలనే తపన ఉన్నా పరిస్థితులు సరిగా లేవు. వచ్చే అయిదేళ్లలో నిరక్షరాస్యతను సున్నాకు తీసుకురావాలి: 2019లో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మాటలివి..
వాస్తవమిది..
గొప్పగా మాటలు చెప్పిన సీఎం జగన్‌ అక్షరాస్యత కార్యక్రమానికి ప్రత్యేకంగా నిధులివ్వక పోగా.. కేంద్రం ఇచ్చిన వాటినీ వాడేసుకుని ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట పరిస్థితులు సరిగా లేవని సెలవిచ్చిన ఆయన ఇప్పటి వరకు ఎందుకు మార్పు చేయలేకపోయారు? కేంద్రం నిధులిచ్చిన ఒకేఒక్క కార్యక్రమం ‘పఢ్‌నా-లిఖ్‌నా అభియాన్‌’ను అమలు చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎలాంటి అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టలేదు. వయోజనుల్లో నిరక్షరాస్యులు ఉండగా..పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే చదువు మానేస్తున్న వారితో ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. వయోజన విద్య లెక్కల ప్రకారం ఇప్పటికీ 40.50 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు.
ఈనాడు, అమరావతి: నిరక్షరాస్యతను రూపుమాపాలంటే అక్షరాస్యత కార్యక్రమాలను ఒక దీక్షలా చేపట్టాలి. కానీ సీఎం జగన్‌కు మాత్రం ఇదేమీ పట్టదు. నాలుగేళ్ల కిందట 100 శాతం అక్షరాస్యత సాధించాలని ఊదరగొట్టారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా దీనిపై సమీక్షించిన దాఖలాలు లేవు. అక్షరాస్యత కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులివ్వకపోగా..కేంద్రం మంజూరు చేసినవి నిధులను సైతం సకాలంలో ఈ కార్యక్రమానికి వినియోగించడం లేదు. 2022 నుంచి 27 వరకు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నవభారత అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం ఈ ఏడాది మే నెలలో రాష్ట్రానికి 60 శాతం వాటాగా రూ.5.10 కోట్లు విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మ్యాచింగ్‌ గ్రాంటుతో కలిపి రూ.8.50 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. నాలుగు నెలల తర్వాత ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవంగా 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చిలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఇప్పటికీ ఈ కార్యక్రమం అమలుకు చెందిన దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంది.  వయోజనులకు చదువు చెప్పే వారికి ప్రభుత్వం ఎలాంటి గౌరవ వేతనం ఇవ్వదు. దీంతో గ్రామ, వార్డు వాలంటీర్లు, డ్వాక్రా సంఘాల మహిళలతో పాఠాల బోధన, నిరక్షరాస్యులను గుర్తించేందుకు వాలంటీర్లతో సర్వే చేసేందుకు ప్రతిపాదనలతో వయోజన విద్యా శాఖ ప్రభుత్వానికి దస్త్రాన్ని  పంపింది. దీనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021లో కేంద్రం తీసుకొచ్చిన ‘పఢ్‌నా-లిఖ్‌నా’ కార్యక్రమం ఒక్కటే అమలు చేశారు. ఆ తర్వాత రెండేళ్లుగా వయోజన విద్యా శాఖలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. 2019 నుంచి 2021 వరకు అసలు అక్షరాస్యత కార్యక్రమాల ఊసే లేదు.  
వలసలపై దృష్టి ఏదీ?
సంపూర్ణ అక్షరాస్యతను 1990-91 ప్రాంతంలో ఉద్యమంలా చేపట్టారు. తర్వాత పట్టించుకోలేదు. ఏ వర్గాలు చదువుకు దూరంగా ఉంటున్నాయో గుర్తించి వారిపై  ప్రత్యేకంగా దృష్టిసారించడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి కోసం వలస పోతున్నారు. వీరు పనులకు వెళ్లే ప్రాంతంలో పిల్లలను బడులకు పంపడం లేదు. కానీ పాఠశాల విద్యా శాఖ మాత్రం ఇలాంటి వారందరూ సొంతంగా గ్రామంలోనే బడులకు వస్తున్నట్లు  100 శాతం ప్రవేశాలు చూపుతోంది.
మూడు, నాలుగు తరగతుల వరకు చదివి బడి మానేసిన వారిలోనూ కొందరు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ అక్షరాలు కూడా చదవలేకపోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో 1.73 లక్షల మంది మధ్యలోనే చదువు మానేశారు. ఈ గణాంకాలను పాఠశాల విద్యా శాఖ అధికారులే ప్రకటించారు. 1-5 తరగతులు చదివే వారిలో 66,205 మంది బడి మానేయగా..ఉన్నత పాఠశాలల్లో 1,07,211 మంది చదువుకు దూరమయ్యారు. వలసల కారణంగా 16,857 మంది తల్లిదండ్రులతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. సీజనల్‌ వలసల కారణంగా 38,951 మంది బడి మానేశారు.
‣ కొత్తగా చదువు మానేస్తున్న వారి సంఖ్య పెరిగితే భవిష్యత్తులో నిరక్షరాస్యత ఆందోళనకరంగా మారుతుంది.  
ఆన్‌లైన్‌లో చదువు..!
నిరక్షరాస్యులకు ఆన్‌లైన్‌లో చదువు చెప్పించాలని విద్యా శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని ఫోన్ల ద్వారా చదువు చెప్పించాలని ఆయన సూచించారు. అసలే అక్షరాలు రాని వారికి ఈ విధానం ఎంత వరకు పనికొస్తుందో అధికారులకే తెలియాలి.
కరోనాలోనూ అక్షరాలు నేర్పారట..!
వయోజన విద్యా శాఖ లెక్కల ప్రకారం చదవడం, రాయడంతో పాటు చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వచ్చినవారు అక్షరాస్యులే. నిరక్షరాస్యులకు పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలిచ్చారు. ఈ పరీక్షల నిర్వహణ బోగస్‌గా సాగిందన్న ఆరోపణలున్నాయి. 2021 ఏప్రిల్‌ చివరి వారం నుంచి జూన్‌ వరకు కరోనా కాలంలోనూ ‘పఢ్‌నా-లిఖ్‌నా’ కార్యక్రమం ద్వారా 2.50 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు నివేదికలు రూపొందించారు. వయోజన విద్యా శాఖ ఏకంగా ఈ రెండున్నర లక్షల మందిని అక్షరాస్యుల జాబితాలో కలిపేసింది. 90 గంటల బోధనతో అక్షరాస్యులుగా మార్చేసినట్లు లెక్కలు రాసేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టక ముందు 43 లక్షల మంది నిరక్షరాస్యులు ఉండగా.. ఆ తర్వాత దీన్ని 40.50 లక్షలకు తగ్గించేశారు.
ఇదీ దుస్థితి..
అక్షరాస్యతకు జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటారు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా జన గణనను చేపట్టలేదు. 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యతలో రాష్ట్రం పరిస్థితి అధ్వానంగా ఉంది.

మరింత సమాచారం... మీ కోసం!

ఎల్‌బీఎస్‌ఐఎమ్‌లో పీజీ డిప్లొమా కోర్సులు 

ఆరోగ్య శాఖలో 487 కొలువులు

వైజాగ్‌ నావల్ డాక్‌యార్డులో 275 అప్రెంటిస్ ఖాళీలు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.