• facebook
  • whatsapp
  • telegram

Study: ఇరుకు గదిలో చదువు.. కటిక నేలపై నిద్ర

కేజీబీవీల్లో బాలికల నరకయాతన
చలికి వణుకుతున్నా దుప్పట్లు ఇవ్వని జగన్‌ సర్కారు
నాలుగున్నరేళ్లుగా ట్రంకు పెట్టెల సరఫరా నిలిపివేత
ఈనాడు, అమరావతి

వసతి గృహాల్లో విద్యార్థులు కింద పడుకోవాల్సిన పరిస్థితి వస్తే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా? పడుకోవడానికి మంచం, పరుపు ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా? ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం?

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, వసతిగృహంలో అసౌకర్యాలపై విచారణ సందర్భంగా నవంబరు 10న హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలివి.

కళ్లు మూసేసుకున్నారు!

పేద పిల్లల కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్‌కు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లోని (కేజీబీవీ) అమ్మాయిలు కటిక నేలపై నిద్రిస్తున్న సంగతి తెలుసా? మంచాలను సమకూర్చేందుకు ఎందుకు చేతులు రావటం లేదు? పేదల పక్షపాతినంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే ఆయన.. కౌమార దశలో ఉన్న బాలికల సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదు? రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా... ఒక్కచోటా మంచాలు లేనేలేవు. కనీసం చదువుకోవడానికి, నిద్రించడానికి వేర్వేరుగా గదులు లేని పరిస్థితి. ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడైనా వారి ఇబ్బందులపై దృష్టి పెట్టారా?

రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) వైకాపా సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. పిల్లలు నిద్రించేందుకు మంచాల్లేవు. వస్తువులను భద్రపరచుకునేందుకు ట్రంకు పెట్టెలను ఇవ్వడం లేదు. సబ్బులు, తల నూనె కొనుగోలు చేసేందుకు కాస్మెటిక్‌ ఛార్జీలను ఇవ్వాలన్న ఆలోచనే లేదు. పైగా ఇరుకిరుకు గదులు.. నేలపైనే చదువులు. అయినా జగన్‌ మనసు కరగడం లేదు. సొంతవాళ్లకైతే ఎలాంటి నిబంధనలనైనా పక్కన పెట్టి బిల్లులు చెల్లించేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. పేదల పిల్లల చదువులకొచ్చేసరికి కనీసస్థాయిలో కూడా కనికరం చూపడం లేదు. కేజీబీవీల్లోని నిరుపేద కౌమార బాలికల దుస్థితిని పట్టించుకునే తీరిక లేకుండా ఉన్నారు.

బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం కేజీబీవీ విధానాన్ని తీసుకొచ్చింది. నిర్వహణ కోసం ఏటా సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)కు నిధులిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీలు ఉండగా.. వీటిల్లో ఒక్కోచోట ఆరో తరగతి నుంచి ఇంటరు వరకు దాదాపుగా 280 మంది చొప్పున విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే ఉన్నవారు, మధ్యలో బడి మానేసిన బాలికలే ఎక్కువ. వీరిని అక్కున చేర్చుకుని, అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైకాపా సర్కారు తీరే వేరు. మాటలతోనే పబ్బం గడిపేయడంలో రికార్డు సృష్టించిన సీఎం.. కౌమార బాలికలు పడుతున్న ఇబ్బందులను ఇంతవరకు పట్టించుకోలేదు. చలి తీవ్రత పెరుగుతున్నా.. ఇంతవరకు వారికి దుప్పట్లను ఇవ్వలేదు. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఇచ్చినవి చిరిగిపోయాయి. వాటినే చాలాచోట్ల పిల్లలు సర్దుకుంటున్నారు. ఏటా ఆరో తరగతిలో విద్యార్థినులు కొత్తగా చేరతారు. వీరికి దుప్పట్లు, ట్రంకు పెట్టెలను ఇవ్వాలి. మూడేళ్లుగా దుప్పట్ల పంపిణీ నిలిచిపోగా.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అసలు ట్రంకు పెట్టెలనే ఇవ్వలేదు.

బాలికలపై ఇదేనా శ్రద్ధ..?

అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మండలానికో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలంటూ సీఎం జగన్‌ హడావుడి చేశారు. అధికారులు ఎలాంటి అదనపు సదుపాయాలు కల్పించకుండానే 352 కేజీబీవీల్లోనూ ఇంటరు తరగతులు ప్రారంభించేశారు. కేవలం 35 చోట్లే రేకుల షెడ్లను ఏర్పాటు  చేశారు. మిగిలినచోట్ల ఇప్పటికీ అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు.

‣ 6 నుంచి 10 తరగతుల్లో 200 మంది అమ్మాయిలు ఉండేలా మొదట భవనాలను నిర్మించారు. ఇందులోనే అదనంగా ఇంటరు తరగతులు ప్రారంభించి 80 మందికి చొప్పున ప్రవేశాలు కల్పించారు. సరిపడా గదుల్లేక తరగతులు, వసతి ఒకేచోట నిర్వహించాల్సిన పరిస్థితి. అదనపు భవనాలను నిర్మించకుండానే ఇంటరు తరగతులను ప్రారంభించేయడంతో ఇబ్బందులెదురవుతున్నాయి.

‣ గదుల్లేక డార్మిటరీల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పగలంతా చదువుకున్న తర్వాత విద్యార్థినులు రాత్రిపూట బెంచీలను పక్కకు జరిపి, నేలపై నిద్రిస్తున్నారు. ఎక్కువమంది ఉండడంతో ఇరుకిరుకుగా సర్దుకోవాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల వారికి సరిపడా మరుగుదొడ్లూ లేవు.

‣ ఇంకొన్నిచోట్ల కంప్యూటర్‌, సైన్సు ల్యాబ్‌ల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారు.

‣ చాలా కేజీబీవీలకు ప్రహరీల్లేవు. బాలికల భద్రత పరిస్థితేమిటో వైకాపా ప్రభుత్వం ఏనాడూ ఆలోచించిన పాపాన పోలేదు. ‘నాడు-నేడు’లో సదుపాయాలను కల్పిస్తున్నామని చెబుతూ కాలం గడిపేయడం తప్ప అమ్మాయిల భద్రతకు చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. 

‣ పిల్లల సామగ్రిని భద్రపరచుకునేందుకు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ట్రంకు పెట్టెనూ ఇవ్వలేదు. డబ్బుల్లేక ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది.

కాస్మెటిక్‌ ఛార్జీలకు దిక్కులేదు..

కాస్మెటిక్‌ ఛార్జీల కింద ఒక్కో విద్యార్థినికి నెలకు ఇచ్చేది కేవలం వంద రూపాయలు. డబ్బుల్లేక ఇవ్వటం లేదని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. కేజీబీవీల నిర్వహణ కోసం కేంద్రం సరిపడా నిధులిస్తున్నా.. వీటిని ఇతర కార్యక్రమాలకు మళ్లించేస్తోంది. ఒక్కో విద్యార్థినికి ఏడాదికి రూ. 1200 చొప్పున ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ సలహాదారులు, పెద్దలకు కావాల్సిన వారికి మాత్రం రూ. లక్షల్లో జీతాలిస్తూ.. సదుపాయాలకు భారీగా ఖర్చు చేస్తున్న జగన్‌ సర్కారుకు పేద పిల్లలు భారంగా మారారా? గత ప్రభుత్వ హయాంలో డబ్బులకు బదులు సబ్బులు, బ్రష్‌, ఇతర వస్తువులతో కిట్లను ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకొచ్చాక ఈ విధానాన్ని నిలిపేసింది. డబ్బులూ ఇవ్వటం లేదు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ పరిశోధనలతో వెలుగులు పంచుతూ..!

‣ కొలువుల జాతర.. రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.