• facebook
  • whatsapp
  • telegram

AP SI Results: ఎస్సై ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేత

* కోర్టు హాలులో ముగ్గురు ఎస్సై అభ్యర్థుల ఎత్తు కొలతలు

* స్వయంగా పరిశీలించి అనర్హులని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు

* ప్రభుత్వ వైద్యులిచ్చిన ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చాలని ఆదేశం

* విచారణ డిసెంబ‌రు 13కు వాయిదా
 

ఈనాడు, అమరావతి: న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎస్సై అభ్యర్థుల ఎత్తు కొలత ప్రక్రియ హైకోర్టులో మలుపు తిరిగింది. ఎత్తు విషయంలో పిటిషనర్లు అర్హులేనంటూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చాలంటూ గుంటూరు ఐజీని న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో వైద్యులు ముగ్గురు అభ్యర్థుల ఎత్తును కొలవగా అనర్హులని తేలింది. దీంతో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా? లేక షరతు ప్రకారం రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లిస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సొమ్ము చెల్లించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.


* అభ్యర్థుల తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ స్పందిస్తూ.. పిటిషనర్లు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించారన్నారు. ముగ్గురు అభ్యర్థులతో కొలత ప్రక్రియను ఆపేయవద్దని, మిగిలిన వారికీ నిర్వహించాలని కోరారు. మరోవైపు పిటిషనర్లు ఎత్తు విషయంలో అర్హులేనని ప్రభుత్వ వైద్యులు తాజాగా ధ్రువపత్రాలు ఇచ్చారన్నారు. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మా ముందే నిర్వహించిన పరీక్షలో అర్హత లేదని తేలినా ఎవరో ధ్రువపత్రాలు ఇచ్చిన సంగతి చెబుతారా అని ప్రశ్నించింది. కోర్టుపైనే నింద మోపేందుకు యత్నిస్తున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలపై విచారణ జరపాలని గుంటూరు ఐజీని ఆదేశించింది. విచారణను డిసెంబ‌రు 13కు వాయిదా వేసింది. ఫలితాల ప్రకటనను నిలువరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం డిసెంబ‌రు 5న‌ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

విచారణకు హాజరైన 19 మంది

హైకోర్టుకు మంగళవారం 19 మంది అభ్యర్థులు ఎత్తు కొలత కోసం హాజరయ్యారు. కోర్టు హాలులోనే ముగ్గురు అభ్యర్థుల ఎత్తు కొలిచారు. న్యాయమూర్తులిద్దరూ స్వయంగా దీనిని పరిశీలించారు. బోర్డు చెబుతున్న ఎత్తు, ప్రస్తుతం తీసిన ఎత్తు ఒకే విధంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా లేక కోర్టు షరతుకు కట్టుబడి రూ.లక్ష చొప్పున ఖర్చులు చెల్లిస్తారా? నేరుగా జైలుకు వెళతారా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ గతంలో అర్హత సాధించారన్నారు. తాజాగా ప్రభుత్వ వైద్యులు ధ్రువపత్రాలిచ్చారన్నారు. అందుకే ఎత్తు విషయంలో అర్హులనే విశ్వాసంతో ఉన్నామని నవ్వుతూ బదులిచ్చారు.

హైకోర్టు విచారణ ప్రక్రియ అంటే నవ్వులాటగా ఉందా?

ధర్మాసనం స్పందిస్తూ.. ఇది నవ్వే వ్యవహారమా? ఎంత మంది సమయం వృథా చేశారో చూడండి   అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ధ్రువపత్రాలిచ్చిన వైద్యుల వివరాలను సేకరించి విచారణ జరపాలని,  ఆ పత్రాల వాస్తవికతను తేల్చాలని గుంటూరు ఐజీని ఆదేశించింది. ‘హైకోర్టు అంటే జోక్‌ అనుకుంటున్నారా? హైకోర్టు విచారణ ప్రక్రియ అంటే నవ్వులాటగా ఉందా’ అని మండిపడింది. ఎంపిక ప్రక్రియను జాప్యం చేసినందుకు పిటిషనర్లు ఖర్చులు చెల్లించేందుకు అర్హులని పేర్కొంది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. పోలీసు నియామక బోర్డు తరఫున ప్రభుత్వ న్యాయవాది కిశోర్‌కుమార్‌ వాదనలు వినిపించారు.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.