• facebook
  • whatsapp
  • telegram

Entrepreneurship: బడిలోనే భవిష్యత్తు ఆవిష్కరణలు

* ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో ఇన్నోవేషన్‌ సెంటర్లు

* టీహబ్‌ తరహాలో ఏర్పాటుకు యాజమాన్యాలు సమాయత్తం

పాఠశాలల స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఇవి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిశోధన సంస్థల్లో ఏర్పాటయ్యాయి. తర్వాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు విస్తరించాయి. ఇప్పుడు స్కూళ్లలోనే ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచే ఔత్సాహికవేత్తలుగా మారేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి.  


ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలకు వచ్చిన ఆలోచనలకు పదును పెట్టేందుకు, ఈ దిశగా విద్యార్థులు ఆలోచించేలా కొన్ని పాఠశాలల్లో ఎంటర్‌ప్రైజ్‌ క్లబ్‌లు ఉన్నాయి. పిల్లలు సైన్స్‌ ఫెయిర్‌, ప్రొటోటైప్‌ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా తర్వాత దశకు తీసుకెళ్లేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అకడమిక్‌ ప్రాజెక్ట్‌లు కాకుండా విద్యార్థులకు వచ్చిన ఆలోచలను ఆవిష్కరణల దశకు తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించేందుకు, మెంటర్‌షిప్‌ అందించేందుకు ఇన్నోవేషన్‌ సెంటర్లు ఉపయోగపడుతాయి. ఇప్పటికే ఉన్న టీహబ్‌, విహబ్‌, టీవర్క్స్‌ను ఉపయోగించుకొని కొందరు చిన్నారులు అద్భుత ఆవిష్కరణలు చేశారు. వీటికి పరిమితులు ఉండడంతో పాఠశాలల్లోనే ఏర్పాటుకు యాజమాన్యాలు మొగ్గుచూపుతున్నాయి. భారత్‌ నుంచి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ఆవిష్కరణలు మున్ముందు రావాలంటే బాల్యంలోనే వ్యవస్థాపకతకు సంబంధించిన పునాది పడాలని నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న సాంకేతికతలు కృత్రిమ మేధ, మెటావర్క్స్‌, రోబోటిక్స్‌, గ్రీన్‌, సైబర్‌ టెక్నాలజీల వరకు అవగాహన ఉండాలి. వీటిపై పట్టుతో మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సుస్థిర పరిష్కారాలు కనుగొనడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఇందు కోసమే పాఠశాల స్థాయిలోనే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారు.

రూ.10 కోట్లతో..


పాఠశాల స్థాయిలో వ్యవస్థాపకత, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు టీహబ్‌ మాదిరి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రూ.10 కోట్లతో ఇన్నోవేషన్‌ సెంటర్‌ నిర్మించబోతున్నారు. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ఏర్పాటు చేయబోతున్నారు. రోబోటిక్స్‌, కృత్రిమ మేధ వరకు అభ్యాస అనుభవాలను పిల్లలు నేర్చుకుంటారు. పూర్వ విద్యార్థులు, ఇతరుల నుంచి నిధుల సమీకరణ ద్వారా ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.


యువ ఔత్సాహికవేత్తలుగా..


పుట్టి.. పెరిగిన పరిస్థితులు, చుట్టుపక్కల వాతావరణం కారణంగా చదువు అంటే ఉద్యోగానికే అనే భావనతోనే ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. దీన్ని పోగొట్టేందుకు ఎంతోకాలంగా వేర్వేరు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు టై హైదరాబాద్‌ ఎంతోకాలంగా పనిచేస్తోంది. ఇందులో విద్యార్థి చాప్టర్లు ఉన్నాయి. వీరు అవగాహన శిబిరాలు, కార్యశాలలు నిర్వహిస్తూ పిల్లల ఆవిష్కరణలను వెన్ను తడుతుంటారు. పదేళ్లకే పుస్తకాలు రాయడం, గేమింగ్‌, ఇతరత్రా యాప్‌లను రూపకల్పన చేస్తున్నవారు ఉన్నారు. వీటిని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుభవజ్ఞ్ఞులతో మెంటర్‌షిప్‌ చేయడం, నెట్‌వర్కింగ్‌, ఇంక్యుబేటింగ్‌ సదుపాయం కల్పిస్తుంటారు. పాఠశాల్లో ఏర్పాటు చేస్తే మరింత ఎక్కువ మంది విద్యార్థులను ఔత్సాహికవేత్తలుగా తీర్చిదిద్దవచ్చు.


 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.