• facebook
  • whatsapp
  • telegram

AP Students: సామర్థ్యం లేకపోయినా ఉదారంగా మార్కులు

* సమ్మెటివ్‌-1 పరీక్షలతో బయటపడిన డొల్లతనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్న బోధనలో శాస్త్రీయత కొరవడుతోంది. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించే ప్రయత్నం చేయకపోవడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిస్తే.. అసలా పరిస్థితే వచ్చేది కాదనే మాటలు వినిపిస్తున్నాయి. పిల్లల్లో సరైన సామర్థ్యం లేకపోయినా మార్కులు వేసేస్తున్నారు. అవి చూసి.. తమ పిల్లలు బాగా చదువుతున్నారనుకుంటూ తల్లిదండ్రులు మోసపోతున్నారు. దేశవ్యాప్తంగా ర్యాంకు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యావ్యవస్థను మసిపూసి మారేడుకాయ చందంగా చూపుతోంది. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఎంత నష్టపోతారోననే విషయం తెలిసినా.. ‘అవన్నీ మాకెందుకు.. సర్కారుకు ఉత్తమ ర్యాంకు వస్తే చాలు’ అన్నట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం.

కోటలు దాటే మాటలు..

రాష్ట్రంలో మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు యూనిట్‌ పరీక్షలను 87శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే రాశారు. ఇటీవల జాతీయ సాధన సర్వేలో దేశవ్యాప్తంగా సగటున 37.03శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలకు హాజరైతే, వారిలో ఏపీ వారే 84.11శాతం మంది ఉన్నారు.
డిసెంబరు 1న సమీక్షలో సీఎంతో అధికారులు చెప్పిన మాటలివి..
 

‘టూ డేస్‌’కి వచ్చిన తిప్పలు..  

డిసెంబరు 2న జరిగిన సమ్మెటివ్‌-1 ఏడో తరగతి ఆంగ్ల పరీక్షలో ఏడో ప్రశ్నగా ‘జంతువులు, వాటి ప్రాముఖ్యతపై మీ స్నేహితుడికి లేఖ రాయండి’ అని ప్రశ్న ఇస్తే.. జవాబుగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని ఓ విద్యార్థి అనేక తప్పులతో సెలవు చీటీని జవాబుగా రాశాడు. అయినా, ఉపాధ్యాయులు 10కి 7మార్కులు వేశారు. విచిత్రమేంటంటే.. తన ఊరి పేరును తెలుగులో రాయడం. అధికారుల లెక్కల ప్రకారం మాత్రం వీరందరూ బ్రహ్మాండంగా ఆంగ్లంలో పరీక్షలు రాస్తున్నట్లే. ‘టూ డేస్‌’కు బదులుగా ‘టీఓ డేస్‌’ అని రాశాడా విద్యార్థి. పిల్లలకు ప్రాథమికంగా భాషపై పట్టు కల్పించకుండా.. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, ఐబీ, ఫ్యూచర్‌ స్కిల్స్‌, జర్మన్‌, స్పానిష్‌ నేర్పిస్తామంటూ చేసే హడావిడితో వారిలో సామర్థ్యాలు ఏమైనా మెరుగుపడతాయా? ఆంగ్లంలో ఇంత మంది పరీక్ష రాశారంటూ గొప్పలు చెప్పేముందు.. వారు రాసిన జవాబు పత్రాలను మరోసారి పరిశీలిస్తే, భాషపై వారికున్న పట్టు ఎంతో తెలుస్తుంది.

వాళ్లు ఆదేశిస్తున్నారు.. వీళ్లు ఆచరిస్తున్నారు

‘ఆంగ్ల మాధ్యమం కోసం ఇంత చేస్తున్నా, విద్యార్థులు ఆ భాషలో పరీక్షలు రాయలేకపోతే బోధనలో లోపం ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. విద్యార్థులందరూ కచ్చితంగా ఆంగ్లంలోనే పరీక్షలు రాయాలి’ ఇటీవల సమ్మెటివ్‌ పరీక్షల ముందు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఇచ్చిన ఆదేశాలివీ. దీంతో భాషపై పట్టులేని పిల్లలు సైతం వారికి వచ్చిందే ఆంగ్లంలో రాసేస్తున్నారు. పిల్లలకు మార్కులు తగ్గితే తమకు ఇబ్బందులు వస్తాయనే భయంతో కొందరు ఉపాధ్యాయులు ఉదారంగా మార్కులు వేసేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోవడమే కాకుండా తమ పిల్లలు బాగా చదువుతున్నట్లు తల్లిదండ్రులు పొరపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ఉన్నతాధికారులు..  తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులూ పాటించాల్సి వస్తోంది.

సన్నద్ధతకు సమయమేది?


ప్రభుత్వం చేస్తున్న ఈ మతిలేని ప్రయోగాలు పిల్లల అభ్యాసన సామర్థ్యాలను దెబ్బతిస్తున్నాయి. 2020-21లో ఉపాధ్యాయుల సన్నద్ధత, విద్యార్థుల సంగ్రహణ శక్తిని పట్టించుకోకుండా 1-6 తరగతులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చారు. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారు ఒక్కసారిగా ఆంగ్లంలోకి మారాల్సి వచ్చింది. ద్విభాష పుస్తకాలు ఇవ్వడంతో పేరుకు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నా, చాలా మంది ప్రధాన సబ్జెక్టుల పరీక్షలను తెలుగులోనే రాస్తూ వచ్చారు. కానీ, ఈ ఏడాది తప్పనిసరిగా ఆంగ్లంలోనే రాయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీనికితోడు ఆంగ్ల భాషకు రెండో ప్రశ్నపత్రంగా టోఫెల్‌ పేపర్‌ ఇస్తున్నారు. దీనికి విద్యార్థులను సన్నద్ధం చేయడం ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా మారింది. కనీసం మెటీరియల్‌ కూడా ఇవ్వకుండా ఈ పరీక్షలేంటని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ర్యాంకు సాధించేందుకు కుయుక్తులు


దేశవ్యాప్తంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ సాధన సర్వే నిర్వహించింది. ఇందులో ర్యాంకు సాధించేందుకు అధికారులు వేయని విన్యాసం లేదు. సర్వేలో భాగంగా 3, 6, 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. ఈ పరీక్షలకు ప్రతిభ ఉన్న వారే హాజరయ్యేలా ఎంపిక చేశారు. తద్వారా రాష్ట్రంలోని పిల్లలందరికీ ఆంగ్లంపైన మంచి పట్టు ఉందని సొంత డబ్బా కొట్టుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ఏపీకి మంచి ర్యాంకు వచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్క రెండు నెలల ముందు నుంచే ప్రత్యేకంగా నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించి, సదరు విద్యార్థులతో ప్రాక్టీస్‌ చేయించారు. ర్యాంకు సాధించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అనేక గిమ్మిక్కులు చేసింది.


* రాష్ట్రంలో మైనర్‌ మాధ్యమాలు మినహా ఆంగ్ల మాధ్యమం ఒక్కటే అమలు చేస్తున్నారు. దీంతో సాధన సర్వేకు హాజరైన వారందరూ ఆంగ్ల మాధ్యమం విద్యార్థులే ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాతృభాషల్లోనూ బోధన సాగిస్తూ.. పాఠశాలలను నిర్వహిస్తున్నారు. దీంతో సాధన సర్వేకు ఇతర రాష్ట్రాల్లో ఆంగ్లం, మాతృభాష మాధ్యమాల బడుల నుంచి విద్యార్థులు హాజరు కావడంతో సాధారణంగా ఆంగ్ల మాధ్యమం సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ అంకెలను చూపుతూ.. ఆంగ్లంలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఏపీ వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని, ఇది తమ ఘనతేనని సర్కారు ప్రచారం చేసుకుంటోంది.

బేస్‌లైన్‌ ఫలితాలు దాచేసి..

విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ్‌ సంస్థతో కలిసి బేస్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో విద్యార్థులు చదువులో ఎంత వెనకబడి ఉన్నారో బహిర్గతమైంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ సర్వే ఫలితాలను దాచేసింది. వాటిని బయటకు విడుదల చేస్తే పరువు పోతుందని రహస్యంగా ఉంచేసింది. విద్యార్థుల తల్లిదండ్రులకూ చెప్పలేదు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58 శాతం మంది తెలుగులో ఒక పేరానూ చదవలేకపోయారు. ఆంగ్లంలో చిన్న వాక్యం కూడా చెప్పలేని వారు 4, 5 తరగతుల్లో 83.9 శాతం.. 6, 7, 8 తరగతుల్లో 65.24 శాతం ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ జిల్లా బెండపూడి పాఠశాల విద్యార్థులు ఆంగ్లంలో బాగా మాట్లాడుతున్నారని, ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనుకున్నారు. కానీ, బెండపూడిలోనూ ఆంగ్లంలో కొందరి పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు బయటపడింది. ఈ పాఠశాలలో 511 మంది ఉండగా.. 485 మంది బేస్‌లైన్‌ పరీక్ష రాశారు. 6, 7, 8 తరగతుల్లో 290 మందికి 58.27 శాతం ఆంగ్లంలో చిన్న వాక్యాన్నీ చదవలేకపోయారు. గణితంలో 99కన్నా ఎక్కువ విలువ గల సంఖ్యలను గుర్తించలేని వారు నాలుగు, అయిదు తరగతుల్లో 38.04 శాతం ఉండగా.. 6, 7, 8 తరగతుల్లో 22.64 శాతం ఉన్నారు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.