• facebook
  • whatsapp
  • telegram

AP Gvt Jobs: నిరుద్యోగంలో ఏపీ నంబర్‌ వన్‌

పట్టభద్రుల నిరుద్యోగంలో బిహార్‌ను మించిపోయిన ఏపీ
అత్యధికంగా రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగిత
కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం

ఈనాడు, అమరావతి: మన రాష్ట్రానికి మరో అగ్రస్థానం దక్కింది.. పేదరికం నిర్మూలించడంలోనో.. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలోనో.. లేక ఉపాధి కల్పించడంలోనో కాదు.. నిరుద్యోగంలో ఈ ఘనత దక్కింది! గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే 11 శాతం అధికంగా ఉంది. వెనుకబడిన బిహార్‌ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది.
జులై 2022 నుంచి జూన్‌ 2023 వరకు నిర్వహించిన సర్వే వివరాలు తాజాగా విడుదలయ్యాయి. డిగ్రీ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో 24 శాతం ఉండగా.. జాతీయ సరాసరి 13.4 శాతం. తెలంగాణ 9వ స్థానంలో.. తమిళనాడు 10వ స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రంలో జాతీయ సగటు కంటే తక్కువగా 9.4 శాతమే నిరుద్యోగిత ఉంది. మన రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తానని మాటలతో కోటలు కట్టే సీఎం జగన్‌రెడ్డి పరిశ్రమల్ని తరిమేసి యువత భవితతో ఆడుకుంటున్నారనడానికి నిరుద్యోగితే నిదర్శనం. యువతకు నైపుణ్యాలు దూరం చేసి, నిరుద్యోగులను తయారు చేయడంలో జగన్‌ సర్కారు పోటీ పడుతోంది.
మహిళల్లో మరింత ఎక్కువ..
‣ గ్రాడ్యుయేషన్‌ చేసిన మహిళల్లో 34.6 శాతం నిరుద్యోగిత ఉండగా.. పురుషుల్లో 20.3 శాతం. మహిళల జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 20.6 శాతం కంటే ఏపీలో 14 శాతం అధికంగా ఉంది. పురుషుల్లో జాతీయ సగటు 11.2 శాతం కాగా.. రాష్ట్రంలో నిరుద్యోగిత 9 శాతం ఎక్కువగా ఉంది.
‣ రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగం అధికంగా ఉన్నట్లు ప్రతి సర్వే బహిర్గతం చేస్తున్నాయి. పట్టభద్రుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ (సీఎంఐఈ) గతేడాది విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహ సర్వేలోనూ బహిర్గతమైంది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్లో ఉపాధి లేనివారు 3.03 శాతంగా ఉంటే పట్టభద్రుల్లో 35.14 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
నైపుణ్యం అటకెక్కించి..
యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ నాలుగున్నరేళ్లపాటు మాటలు చెప్పిన సీఎం జగన్‌ ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. ఇంజినీరింగ్‌ వారికి హైఎండ్‌ వర్సిటీని విశాఖపట్నం ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి దానినీ అటకెక్కించారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం సీమెన్స్‌లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు. శిక్షణ, పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగిత పెరుగుతోంది. ఏటా డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతరత్రా కోర్సులు పూర్తి చేస్తున్న వారు 2.30 లక్షల మంది బయటకు వస్తున్నా తగినంతగా నైపుణ్య శిక్షణ దొరకడంలేదు. జగన్‌ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు శిక్షణ కోసం రూ. వేలల్లో ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది.
ఇక్కడ చదువు.. కొలువు ఎక్కడో..
రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ఇక్కడ ఉద్యోగం, ఉపాధి అంటే పొరుగుసేవల ఉద్యోగం, లేదంటే చిన్నచిన్న పనులే చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో పెద్ద నగరమంటూ లేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిగా లేవు. చాలామంది వలస వెళ్లిపోతుండడంతో ఇక్కడ సంపాదించే యువత సంఖ్య తగ్గిపోతుంది. బీటెక్‌, సాధారణ డిగ్రీ చదివిన వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్‌లైన్‌ కోర్సులు, అదనపు అర్హతలు పెంచుకునేందుకు భారీగా వ్యయం చేస్తున్నారు. 
అంతా రివర్సే..
ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. కొత్తవి రాకపోగా.. ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. విశాఖపట్నం, విజయవాడతో సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావడం లేదు. ఈసారి బీటెక్‌ వారికి లభించే ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి. సాధారణ డిగ్రీ చదువుకున్న వారి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు.
టీచర్‌ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల ర్యాలీ, ధర్నా
అవనిగడ్డ, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ డీఎస్సీ శిక్షణ కేంద్రాల విద్యార్థులు మంగళవారం కదం తొక్కారు. వివిధ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో సుమారు 2 వేల మంది భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవనిగడ్డ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క డీఎస్సీని నిర్వహించలేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి పంపిస్తున్న డబ్బుతో అవనిగడ్డలో శిక్షణ తీసుకుంటున్నామని, జగన్‌మోహన్‌రెడ్డి మాట నమ్మినందుకు తమ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ తహసీల్దార్‌ రామకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసనలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన డీఎస్సీ శిక్షణ కేంద్రాల విద్యార్థులు పాల్గొన్నారు. తెదేపా, జనసేన నాయకులు వారికి మద్దతు తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.