• facebook
  • whatsapp
  • telegram

Education: వివిధ సమస్యలపై కాళోజీ వర్సిటీ చుట్టూ విద్యార్థుల ప్రదక్షిణలు

* పనిచేయని విశ్వవిద్యాలయం టోల్‌ఫ్రీ నంబర్లు

* హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యవిద్యార్థిని ధ్రువపత్రంలో పొరపాట్లు దొర్లాయి. మూణ్నెల్లుగా తాను చదువుకున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీకి, విశ్వవిద్యాలయానికి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఓపిక నశించి ఆమె తన తండ్రితో కలిసి విశ్వవిద్యాలయానికి రాగా, రెండుగంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. మూణ్నెల్లుగా హైదరాబాద్‌ నుంచి వచ్చిపోతున్నామని, ఇక్కడ సరైన సమాధానమిచ్చేవారు లేరని విద్యార్థిని తండ్రి వాపోయారు.

* మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వైద్యవిద్యార్థిని విదేశాల్లో చదువు కోసం దరఖాస్తు చేసుకోగా, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లపై అటెస్టెడ్‌ చేసి సీల్డ్‌ కవర్‌లో పంపాలని సదరు విదేశీ విశ్వవిద్యాలయం సూచించింది. అందుకోసం వర్సిటీని సంప్రదించగా సర్టిఫికెట్లపై అటెస్టెడ్‌ చేయడానికి ఒక కాపీకి రూ.1,500 చెల్లించాలన్నారు. అలా చెల్లించి నెల గడిచినా సర్టిఫికెట్లపై అటెస్టేషన్‌ పూర్తి కాలేదు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసినా ఫలితంలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన చెందారు.

ఈనాడు- వరంగల్‌, ఎంజీఎం ఆసుపత్రి- న్యూస్‌టుడే: వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో జవాబుదారీతనం కరవైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలు వర్సిటీ కింద ఉన్న విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయం సేవలతో ముడిపడి ఉన్న ఏ సందేహం నివృత్తి చేసుకోవాలన్నా, సమాచారం తెలుసుకోవాలన్నా ఫోన్‌ ద్వారా సాధ్యపడడం లేదు. నేరుగా విశ్వవిద్యాలయానికి వచ్చినా విద్యార్థులకు సమాధానమిచ్చేవారు ఉండటం లేదు. విభాగాల వారీగా ఉన్న హెల్ప్‌డెస్క్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు పనిచేయడంలేదు.

కాళోజీ వర్సిటీ పరిధిలో 54 ప్రభుత్వ, ప్రయివేటు ఎంబీబీఎస్‌, పీజీ కళాశాలలు కొనసాగుతున్నాయి. అల్లోపతి మెడికల్‌ కాలేజీలు 27, డెంటల్‌ సర్జరీ 12, హోమియో 5, ఆయుర్వేదం 2, ప్రకృతివైద్యం 1, యునాని 3, నర్సింగ్‌ 77, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ 20, ఫిజియోథెరపీ 16 ఉన్నాయి. ఆయా కళాశాలల అకడమిక్‌ నిర్వహణ, వివిధ కోర్సుల ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ విశ్వవిద్యాలయమే పర్యవేక్షిస్తుంది. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 84 మందికి 35 మంది మాత్రమే రెగ్యులర్‌ స్టాఫ్‌ ఉన్నారు. వర్సిటీలో శాశ్వత భవనం నిర్మించినా సిబ్బంది కొరత వల్ల సేవల్లో జాప్యం జరుగుతోంది.

కళాశాలల జాప్యం వల్లే..

* వర్సిటీ కింద పనిచేసే కళాశాలల నుంచి సమాచారం వచ్చాక మేం పరిశీలిస్తాం. విద్యార్థులు కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్నా మాకు పంపడానికి యాజమాన్యాలు జాప్యం చేస్తున్నాయి. ఈ విషయం విద్యార్థులకు తెలియడం లేదు. టోల్‌ఫ్రీ నంబర్లు పనిచేయనపుడు.. విద్యార్థులు మెయిల్‌కు ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం. ధ్రువపత్రాల ముద్రణకు 45 రోజులు పడుతుంది. అందుకే దరఖాస్తు చేసిన వెంటనే ఇవ్వడానికి సాధ్యం కాదు.


                                                                                                                                                                                                      - డాక్టర్‌ సంధ్య, రిజిస్ట్రార్‌, కాళోజీ వర్సిటీ

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.