• facebook
  • whatsapp
  • telegram

ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు



ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులను కలవరపరుస్తున్న విషయమిదే. వ్యూహాత్మకంగా మెరుగైన సంసిద్ధతతో ఉంటే ఎలాంటి అవరోధాలెదురైనా తట్టుకుని కెరియర్‌లో మున్ముందుకు సాగే వీలుంటుంది. మరి అందుకు ఏ మెలకువలు పాటించాలి?  నిపుణుల సూచనలివిగో! 


ఐటీ ఆశావహులు ప్రధానంగా తమ దృక్పథాన్ని మార్చుకోవడం అవసరం. ప్రతి అవరోధాన్నీ అవకాశంగా చూసే దృష్టిని పెంచుకోవాలి. విభిన్న నైపుణ్యాలను పొందడం, వాస్తవిక దృష్టికి పదును పెట్టడం ద్వారా మరింత బలంగా మారే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు నేర్చుకోవడంలో నిమగ్నమై ఉండటం అత్యంత కీలకం. 


వాస్తవాలను అంగీకరించండి

ఉద్యోగ ఆఫర్లకు సుదీర్ఘ కాల వ్యవధి పడుతున్నా, వరుస ప్రయత్నాలు విఫలమవుతున్నా.. నిరాశపడకూడదు. వాస్తవాలను అంగీకరించే మనః స్థితిని పెంచుకోవాలి. దీని అర్థం మీకు సామర్థ్యం లేదని కాదు. మీరు అవకాశాన్ని కోల్పోయిన ప్రతిసారీ మీకు ఉద్యోగాలు పొందడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రపంచంలో మీకు తగిన ఉద్యోగమిచ్చే నియామక సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి.


ఇవి నేర్చుకుంటే మేలు

మీ కోర్‌ స్టడీస్‌కు మించి డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను పొందాలి. దీనిపై దృష్టి పెట్టండి. క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ,  ఏఐ- ఎంఎల్‌ బేసిక్స్, డేటా అనలిటిక్స్‌ గురించి నేర్చుకోండి. వివిధ సంస్థలకు ఏఐ, క్లౌడ్‌ నిపుణులు అవసరం. ఎందుకంటే చాలా కంపెనీలు తమ సాంప్రదాయిక డేటాబేస్‌ల నుంచి క్లౌడ్‌కు వస్తున్నాయి. ఫుల్‌స్టాక్, ఏఐ, బీఐ, క్లౌడ్‌ నిపుణులు ఎల్లప్పుడూ అవసరమే. మీరు వీటిని ఉచితంగా నేర్చుకోవడానికీ, నైపుణ్యం పొందటానికీ అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. కోర్స్‌ఎరా, గూగుల్‌ ఎంఎల్, మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్, యుడెమీ మొదలైన ఆన్‌లైన్‌ వేదికలు.


నెట్‌వర్కింగ్‌తో ప్రయోజనాలు

పరిశ్రమ నిపుణులతో క్రియాత్మకంగా అనుసంధానం ఏర్పరుచుకోండి. వర్చువల్‌ ఫోరమ్‌లకు హాజరవ్వండి. అలాగే ఆన్‌లైన్‌ కమ్యూనిటీల్లో పాల్గొనండి. నెట్‌వర్కింగ్‌.. తలుపులు తెరుస్తుంది, విలువైన మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ‘మీ నెట్‌వర్క్‌ మీ ఆస్తి’ అని గ్రహించాలి. ఇది వేగంగా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. మీ నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాన్ని వేగంగా పొందడంలోనూ సహాయపడుతుంది. ఈవెంట్‌లకు వెళ్లండి, సంబంధిత వ్యక్తులను కలిసి మాట్లాడండి. మీరు ఏమి చేయగలరో, మీరు దేనిలో మెరుగ్గా ఉన్నారో స్పష్టం చేయండి. 


కొలువుకు ప్రత్యామ్నాయం 

ప్రతి ఒక్కరూ ఒక కంపెనీలో 9 గంటలు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీలాన్స్‌ డెవలపర్‌/ డిజైనర్‌గా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. మాంద్యం సమయంలో కూడా అధిక ఆదాయాలు ఉంటాయి. ఇది మీరు మీ ఉద్యోగం కోసం ఎలా శోధిస్తున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు నైపుణ్యాలతో సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం.


స్టార్టప్‌ ఉద్యోగాల్లో..

అందరూ బహుళాజాతి సంస్థల్లో (ఎంఎన్‌సీలు) పనిచేయాలనే నియమం లేదు. మీరు మీ పనికి విలువనిచ్చే కంపెనీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకానీ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యకో, సంస్థ అందించే ఆకర్షణీయమైన సౌకర్యాలకో ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అసలు ప్రతి ఎంఎన్‌సీ ఒకప్పుడు స్టార్టప్‌ సంస్థేనని గుర్తుంచుకోండి. వాస్తవానికి స్టార్టప్‌లలో సబ్జెక్టులను సులభంగానూ, వేగంగానూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడైతే ప్రతి ఒక్కరూ మీ పనికి విలువ ఇస్తారు. ప్రతి చిన్న విజయం ఒక వేడుక మాదిరి ఉంటుంది.


రెజ్యూమె ఏం చెప్తోంది? 

మీకు నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటిని ఎలా ప్రదర్శించాలనేది కూడా ప్రధానం. మీరు పాల్గొన్న హ్యాకథాన్‌లు, చేసిన ప్రాజెక్ట్‌లు, ఇంటర్న్‌షిప్‌లను మీ రెజ్యూమే స్పష్టంగా ప్రతిబింబించాలి. ఇది ఇతరుల రెజ్యూమె కంటే ఎలా ఉత్తమమైనది అనేదానిపై పూర్తి సమాచారంతో ఉండాలి. మీ రెజ్యూమే ఎంపికయితే అది మాంద్యంలో కూడా విజయానికి మొదటి మెట్టు అవుతుంది.


సముచిత నైపుణ్యాలపై దృష్టి

ఏఐ క్లౌడ్‌తో పాటు- ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ, గేమింగ్‌ టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి మీ సృజనాత్మకతను చూపించగల నైపుణ్యాలపై దృష్టి పెట్టండి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలోని గొప్పతనం ఏమిటంటే... ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలకు దీనితో సంబంధం ఉంటుంది. 


ఉత్తమ ప్రాజెక్టులు

వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించిన బలమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించండి. లేకుంటే ఓపెన్‌ సోర్స్‌ కార్యక్రమాలకు సహకరించండి. మీ సమస్యా పరిష్కార నైపుణ్యాలనూ, ప్రయోగాత్మక అనుభవాన్నీ ప్రదర్శించండి. ప్రాజెక్టుల్లో ఉత్తమమైన వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. మీ ఉద్యోగ విజయం మీరు నిర్మించే ఉత్తమ ప్రాజెక్టులపై ఆధారపడి ఉంటుంది.

చేసే ప్రాజెక్టులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బ్లాక్‌ చెయిన్, సైబర్‌ సెక్యూరిటీల నైపుణ్యాలతో ఉన్న కాన్సెప్టులను ఎంచుకోండి. దీనివల్ల టెక్నాలజీకి మీరు దగ్గరగా ఉన్నారని కంపెనీలు భావిస్తాయి. ఇలా చేయడంవల్ల ఫ్రీలాన్సింగ్, స్వల్పకాలిక ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతాయి. ప్రాజెక్టులో కచ్చితంగా రోజూ చేసే పని సామర్ధ్యాన్ని పెంచే ఒక పద్ధతీ, దాని విశిష్టతా ఉండేలా చూడాలి. ఎందుకంటే ఏ ఉత్పత్తిని తయారుచేసినా వినియోగదారుల కోణం ముఖ్యం. అలాగే.. ఎల్లప్పుడూ సానుకూలతతో ఉండటం, నిపుణుల నుంచి నిరంతరం నేర్చుకోవడం ముఖ్యం.


గిట్‌ హబ్‌ వేదికలో..

మీరు గిట్‌ హబ్‌ వేదికలో సొంత రిపోజిటరీని సృష్టించడం కూడా ముఖ్యం. గిట్‌ హబ్‌ విద్యార్థులకూ, ప్రొఫెషనల్స్‌కూ ఒక ఆధార్‌ కార్డ్‌ డిపాజిటరీలా పనిచేస్తుంది. చేసే ఏ ప్రాజెక్టు అయినా సరే, దీనిలో భద్రపరచడం వల్ల మీరు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, వాటిలో మీ నైపుణ్యం, కోడింగ్‌ ఎలా వాడారు అనేవి కంపెనీలకు అర్థం అవుతాయి. ఈ సాంకేతిక యుగంలో ఈ వేదిక ఎంతగా ఉపయోగపడుతుందంటే అసలు రెజ్యూమెతో అవసరం ఉండదు. అలాగే ఫోరమ్‌లలో కథనాలను అందించడం, ప్రశ్నలకు మేటి సమాధానాలివ్వడం లాంటివి చేయవచ్చు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 23-01-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం