• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

* కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు


దాదాపు సంస్థలన్నింటికీ దిక్సూచిలా బిజినెస్‌ అనలిటిక్స్‌ ఆవిర్భవిస్తోంది. మనుషులకు ఆక్సిజన్‌ మాదిరిగా ఇది వ్యాపార సంస్థలకు ఊపిరి పోస్తోంది. సమాచారం (డేటా) ఉపయోగించి.. విశ్లేషణ, నిర్ణయాలు తీసుకోవడం, మేటి వ్యూహాలు అమలు చేయడంలోనూ అనలిటిక్స్‌ అస్త్రంగా మారింది. ఇప్పుడిది ఆధునిక కాలంలో శక్తిమంతమైన ఉద్యోగాల్లో ఒకటిగా పరివర్తనం చెందుతోంది. అందువల్ల ఈ సాంకేతికతపై పట్టున్నవారు మేటి కొలువుల బాట పట్టడం సులువే. పేరున్న సంస్థలెన్నో బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సును యూజీ, పీజీ స్థాయుల్లో ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లోనూ అందిస్తున్నాయి. 


సంస్థల రోజువారీ వ్యాపార కార్యకలాపాలు మెరుగుపరచడం, వినియోగదారులను మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడం, ప్రస్తుతం జరుగుతోన్న వర్తకం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం, అందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించుకోవడం, సంస్థ పనితీరు, వృద్ధిని తెలుసుకోవడం, ట్రెండ్స్‌ పసిగట్టడం, వాటిద్వారా కొత్త వ్యూహాలు రచించడం.. ఇవన్నీ బిజినెస్‌ అనలిటిక్స్‌తో సులువవుతున్నాయి. వినియోగదారుల అవసరాలు, అభిరుచులను విశ్లేషించి, కాచి వడపోసి సంస్థల ముందు ఉంచుతోంది బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రావీణ్యం. పెద్దమొత్తంలో ఉన్న సమాచారం నుంచి.. సారాన్ని గ్రహించి, వ్యాపార వ్యూహాలకు దశనూ, దిశనూ అనలిటిక్స్‌ నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో సమర్థులకు మేటి అవకాశాలు దక్కుతున్నాయి. భవిష్యత్తులోనూ అనలిటిక్స్‌లో పట్టున్నవారికి గిరాకీ పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ప్రావీణ్యాన్ని పొందితే ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు. భారతదేశం ఈ విభాగంలో ప్రపంచ హబ్‌గా మారుతోంది. 


బిజినెస్‌ అనలిటిక్స్‌ని ముఖ్యంగా 4 రకాలుగా    వర్గీకరించవచ్చు. 


డిస్క్రిప్టివ్‌ అనలిటిక్స్‌: సంస్థలకు సంబంధించి గత, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు. 


డయాగ్నోస్టిక్‌ అనలిటిక్స్‌: గతంలో, ప్రస్తుతం సాధించిన ప్రగతికి కారణాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.


ప్రెడిక్టివ్‌ అనలిటిక్స్‌: టూల్స్‌ సాయంతో, ఫలితాలు అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.


పర్‌స్పెక్టివ్‌ అనలిటిక్స్‌: వర్తకం ప్రగతి పథంలో దూసుకుపోవడానికి సరైన సొల్యూషన్లను అందిస్తుంది. 


 
ఈ నైపుణ్యాలతో..


అనలిటిక్స్‌లో పట్టు పెంచుకోవడానికి.. క్వాంటిటేటివ్, అనలిటికల్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ప్రోగ్రామింగ్, స్టాటిస్టికల్, మ్యాథ్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా విజువలైజింగ్‌ నైపుణ్యాల అవసరం. ఆసక్తి, సమస్యను అర్థం చేసుకునే పరిజ్ఞానం, సాంఖ్యకశాస్త్రంపై పట్టుండాలి. విశ్లేషణ సామర్థ్యం తప్పనిసరి. లాజిక్‌ (తర్కం), ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ పనికొస్తాయి. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం అనలిస్ట్‌ ప్రధాన విధి. వాటి ఆధారంగా నివేదికలు తయారుచేయాలి. ఇందులో గ్రాఫ్‌లు, చార్టులు, డ్యాష్‌బోర్డులు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ ఉపయోగించాలి. వీటిని చూసేవాళ్లు సులువుగా అర్థంచేసుకునేలా, ఒక అభిప్రాయానికి వచ్చేలా చేయగలగాలి. ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌పై అవగాహన ఉండాలి. హడూప్, పైతాన్, ఆర్, ఎస్‌ఏఎస్, శ్వాట్, రేషనల్‌ రిక్వజిట్‌ ప్రొ.. మొదలైన టూల్స్‌పై పట్టుంటే బాగా రాణించగలరు.


 మేటి విద్యా సంస్థలు


ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), కోల్‌కతా; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్‌; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), కోల్‌కతా ఈ మూడు సంస్థలూ కలిసి పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ప్రపంచ స్థాయి మేటి బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సుల్లో ఇదొకటి. ఒక్కో సంస్థలో 6 నెలలు చదువుకుంటారు. చివరి 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. అనలిటిక్స్‌ సంబంధిత సాంకేతికాంశాలు ఐఐటీలోనూ, అనలిటిక్స్‌ సంబంధిత స్టాటిస్టిక్స్, మెషిన్‌ లెర్నింగ్‌ థియరీని ఐఎస్‌ఐలో, అనలిటిక్స్‌ అనువర్తనాలను ఐఐఎంలో నేర్పుతారు. 


60 శాతం మార్కులతో బీటెక్‌/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంకాం/ ఎంబీఏ పూర్తిచేసుకున్నవారు అర్హులు. ప్రస్తుతం వీటిలో చివరి ఏడాది కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ప్రతిభ, ఇంటర్వ్యూ, ఇంటర్మీడియట్‌/ప్లస్‌2లో సాధించిన మార్కులు, పని అనుభవం.. వీటికి కొన్నేసి పాయింట్లు కేటాయించి కోర్సులోకి ఎంపిక చేస్తారు. 


ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 6 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మాక్‌ టెస్టు మార్చి 9, 10 తేదీల్లో రాసుకోవచ్చు. మార్చి 17న కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి. మే 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. 60 మందికి అవకాశం కల్పిస్తారు. గత ఏడాది కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు గరిష్ఠంగా రూ.50 లక్షలు, సగటున రూ.30 లక్షల వార్షిక వేతనం దక్కింది. 


పరీక్ష ఎలా? 


150 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 15, లాజికల్‌ రీజనింగ్‌ 5, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌ 5, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. సిలబస్, పూర్తి వివరాలకు http://www.pgdba.iitkgp.ac.in/ చూడవచ్చు.

బిట్స్, పిలానీ ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 19లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తారు. 

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు అందిస్తోంది.  

యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, దేహ్రాదూన్‌లో ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చదువుకోవచ్చు. 

అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీస్‌ ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు రెండేళ్ల వ్యవధితో నడుపుతోంది.  

 పలు ఐఐఎంలు ప్రత్యేకంగా ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. క్యాట్‌ స్కోరు లేదా సంస్థ నిర్వహించే పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి. 

 సింబయాసిస్, మణిపాల్, గ్రేట్‌ లేక్స్, ఐటీఎం, ఎక్స్‌ఐఎంఈ, గీతం.. ఇలా ఎన్నో సంస్థలు బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో వీటిలో చేరవచ్చు. దాదాపు సంస్థలన్నీ పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూలతో ప్రవేశం కల్పిస్తున్నాయి. 

 ఐండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, హైదరాబాద్‌లోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది.

 బిట్స్‌ పిలానీ, శాస్త్ర - తంజావూర్, మణిపాల్‌ అకాడెమీ.. తదితర సంస్థలు ఎమ్మెస్సీ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సునూ అందిస్తున్నాయి. 


యూజీలోనూ..

ఎన్నో సంస్థలు యూజీ స్థాయిలోనే బిజినెస్‌ అనలిటిక్స్‌ చదువుకునే అవకాశం కల్పిస్తున్నాయి. బీబీఏలో భాగంగా దీన్ని అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్‌ స్కూళ్లు, ప్రైవేటు విద్యా సంస్థలు యూజీ కోర్సులకు పేరొందాయి. గీతం, కేఎల్‌యూ, విశ్వవిశ్వాని, నార్సీమెంజీ, సింబయాసిస్, విట్, సెయింట్‌ జోసెఫ్‌.. తదితర సంస్థల్లో చదువుకోవచ్చు.  


ఆన్‌లైన్‌లోనూ..

కోర్స్‌ఎరా, సింప్లీ లెర్న్, అప్‌గ్రేడ్, గ్రేట్‌ లెర్నింగ్‌...ఇలా పలు బోధన సంస్థలు వివిధ విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి ఆన్‌లైన్‌ కోర్సులు నడుపుతున్నాయి. ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్లు వీటిలో చేరవచ్చు.


హోదాలెన్నో..

బిజినెస్‌ అనలిస్ట్‌: డేటా అనలిస్ట్‌ నుంచి సమాచారాన్ని స్వీకరించి, దానికి అనుగుణంగా వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. మార్పులు చేపడతారు. 

కస్టమర్‌ బిహేవియర్‌ అనలిస్ట్‌/ మార్కెట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌: సంస్థ వద్ద ఉన్న వినియోగదారుల సమాచారం ఆధారంగా వీరు కొనుగోళ్లను పరిశీలిస్తారు. ఏ ఉత్పత్తికి డిమాండ్‌ ఎక్కువగా ఉందో తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడం, దుకాణాలకు చేరవేయడం, నిల్వ చేయడం మొదలైన పనులు వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి.

ఆపరేషన్స్‌ అనలిస్ట్‌: సంస్థలో వివిధ విభాగాల్లో జరుగుతోన్న పనులు గమినిస్తారు. రోజువారీ సమస్యలను పరిశీలిస్తారు. శాఖలవారీ మెరుగైన పనితీరు కోసం సూచనలు అందించి, సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటారు.  

సప్లై చెయిన్‌ అనలిస్ట్‌: ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉండేలా చూస్తారు. వినియోగదారులు కోరుకున్న వెంటనే వారికి ఉత్పత్తి లభించేలా చేస్తారు. 

రిసెర్చ్‌ అనలిస్ట్‌: సమస్యలను విశ్లేషిస్తారు. వినియోగదారులు, స్టేక్‌ హోల్డర్ల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు చూపుతారు. డొమైన్‌ నిపుణులుగా సంస్థలో గుర్తింపు పొందుతారు.

రిస్క్‌ అనలిస్ట్‌: సమాచారాన్ని విశ్లేషించి, కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏమైనా ఉంటే గమనిస్తారు. నష్టం జరగకుండా తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. సంస్థ ఆర్థిక పుష్టికి తోడ్పడతారు. 

ఇవే కాకుండా...పోర్ట్‌ పోలియో అనలిస్ట్, క్యాంపెయిన్‌ అనలిస్ట్, హెచ్‌ఆర్‌ / పీపుల్‌ అనలిస్ట్, ప్రైసింగ్‌ అనలిస్ట్, ఫైనాన్సియల్‌ అనలిస్ట్, సెక్యూరిటీ అనలిస్ట్, వెబ్‌ అనలిస్ట్, స్టాటిస్టికల్‌ అనలిస్ట్, సీఆర్‌ఎం అనలిస్ట్, ఎస్‌క్యూఎల్‌ అనలిస్ట్‌.. తదితర హోదాలతో సంస్థల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించవచ్చు.


 కెరియర్‌ గ్రాఫ్‌

ప్రారంభంలో అనలిస్ట్‌ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. నాలుగేళ్ల అనుభవంతో సీనియర్‌ అనలిస్ట్‌ కావచ్చు. ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారు లీడ్‌ అనలిస్ట్, పన్నెండేళ్ల అనుభవంతో మేనేజర్‌ హోదాతో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ నైపుణ్యాలు ఉన్నవారికి తక్కువ వ్యవధిలోనే పదోన్నతులు సాధ్యమవుతాయి. ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో బిజినెస్‌ అనలిస్ట్‌ హోదాతో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రంగాల్లో వేతనాలు సైతం పెద్ద మొత్తంలో దక్కుతాయి.  మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్‌’ కోర్సులు

‣ ఎన్‌సీఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టులు

‣ ‘సాయ్‌’లో కోచ్‌ కొలువులు

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ సైన్యంలో స్పెషల్‌ ఎంట్రీ

‣ ‘నిక్మార్‌’ నిర్మాణ రంగ కోర్సులు

Posted Date: 18-01-2024


 

కోర్సులు

మరిన్ని