• facebook
  • whatsapp
  • telegram

ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్‌’ కోర్సులు

* జెస్ట్‌ ప్రకటన విడుదల


మేటి భవిష్యత్తును అందించే సబ్జెక్టుల్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్‌) ముఖ్యమైంది. శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటితోనూ ఇది ముడిపడి ఉండడమే దీనికి కారణం. ఈ సబ్జెక్టుకున్న ప్రాధాన్యంతో జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సంస్థలు ఇందులో కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశానికి ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఫిజిక్స్‌లో ఆసక్తి ఉండి, రాణించాలనుకునేవారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో నడుస్తోన్న సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌)తో అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో ప్రతిభతో మెరిసినవాళ్లు పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిపోవచ్చు. అలాగే ప్రతినెలా స్టైపెండ్‌నూ అందుకోవచ్చు. అధునాతన ల్యాబ్‌ సౌకర్యాలు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఈ సంస్థల ప్రత్యేకత. ఇటీవల వెలువడిన జెస్ట్‌-2024 ప్రకటన వివరాలు చూద్దాం.


నేల నుంచి నింగిలోకి దూసుకుపోవడం... అంతరిక్షంలో విహరించడం... ఇలా అన్నింటికీ మూలం భౌతికశాస్త్ర సిద్ధాంతాలే. దేశ సాంకేతిక ప్రగతికి ఫిజికల్‌ సైన్సే ప్రధాన ప్రమాణం. ఇందుకోసం కేంద్రం ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) ఏర్పాటుచేశారు. దీని పరిధిలో దేశవ్యాప్తంగా పలు సంస్థలున్నాయి. విద్యార్థులను పరిశోధన దిశగా ప్రోత్సహించడానికి వీటిని నెలకొల్పారు. ఇవన్నీ జెస్ట్‌తో ఫిజిక్స్, అనుబంధ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. చదువుతోపాటు ప్రతి నెలా స్టైపెండ్‌నూ అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీలో చేరినవారికి నెలకు రూ.12,000 చొప్పున రెండేళ్లు స్టైపెండ్‌ అందుతుంది. అనంతరం జేఆర్‌ఎఫ్‌లో భాగంగా నెలకు రూ.37,000 చెల్లిస్తారు. ఎస్‌ఆర్‌ఎఫ్‌లో రూ.42,000 చొప్పున చెల్లిస్తారు. నేరుగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవాళ్లు మొదటి రెండేళ్లు రూ.37,000 తర్వాత రెండేళ్లు రూ.42,000 పొందవచ్చు. వీటితోపాటు ఉచితంగా వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అందిస్తారు. 


 ఇవీ కోర్సులు

ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, అట్మాస్ఫిరిక్‌ ఫిజిక్స్, స్పేస్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ సైన్సెస్, బయో ఫిజిక్స్, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌వర్క్స్, కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్, క్వాంటమ్‌ ఫిజిక్స్‌ అండ్‌ క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్, న్యూక్లియర్‌ అండ్‌ రేడియేషన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్‌ అండ్‌ అటామిక్‌ ఫిజిక్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, బయో ఫిజిక్స్, ఇలా పలు ఫిజిక్స్‌ స్పెషలైజేషన్లతో సంస్థలు వీటిని అందిస్తున్నాయి. 


 ఏయే అర్హతలు? 

ఫిజిక్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు: ఎమ్మెస్సీలో ఫిజిక్స్‌ చదివుండాలి. లేదా ఫిజిక్స్‌ సంబంధిత విభాగాల్లో ఏదైనా పీజీ, ఎంటెక్‌ చదివినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు బీఈ/ బీటెక్‌ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. 

ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌- ఎమ్మెస్సీ/ఎంటెక్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ ఫిజిక్స్‌తో ఈ కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని సంస్థల్లోకి డిగ్రీలో మ్యాథ్స్, ఇంజినీరింగ్‌ కోర్సులు చదివినవాళ్లకూ అవకాశం ఉంది. 

థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌: కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌ లేదా ఎంసీఏ చదివుండాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. 

అన్ని కోర్సులకూ చివరి ఏడాది కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థలవారీ అర్హతల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. 


 ప్రశ్నపత్రం 

వంద మార్కులకు నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. మూడు విభాగాల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక విభాగంలో 15 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు జవాబు గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు. మరో విభాగంలో 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. ఇంకో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి మార్కులో మూడోవంతు చొప్పున తగ్గిస్తారు. ఫిజిక్స్‌ లేదా థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ రెండింటిలో ఏదో ఒక పేపరే రాయడానికి అవకాశం ఉంది. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలకు ఒకటే ప్రశ్నపత్రం. 


ఫిజిక్స్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి మ్యాథమెటికల్‌ మెథడ్స్, క్లాసికల్‌ మెకానిక్స్, ఎల్రక్టో మ్యాగ్నటిజం అండ్‌ ఆప్టిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్‌ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 


 సన్నద్ధత

సిలబస్‌లో పేర్కొన్న అధ్యాయాలు, అందులోని అంశాలను శ్రద్ధగా గమనించాలి. పాఠ్యపుస్తకాలు మొత్తం కాకుండా సిలబస్‌ ప్రకారం చదువుకోవాలి. 

‣ జెస్ట్‌ ప్రశ్నపత్రం డిగ్రీ ఫిజిక్స్‌ సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అంశాలకు సంబంధించి మూడేళ్ల డిగ్రీ భౌతికశాస్త్రం పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. సిలబస్‌లో పేర్కొన్న మ్యాథమెటికల్‌ మెథడ్స్‌ కోసం ఇంటర్‌ మాథ్స్‌ అంశాలు సాధన చేయాలి. 

ప్రాథమికాంశాలపై పట్టు కోసం ముందు ఇంటర్‌ ఫిజిక్స్‌ పాఠ్యపుస్తకాలు చదవాలి. వీటిని పూర్తిచేసిన తర్వాతే డిగ్రీ పుస్తకాలపై దృష్టి సారించాలి. 

ఐఐటీలు నిర్వహించే జామ్, సీయూఈటీ పీజీ, పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన గత ప్రశ్నపత్రాలను సాధన చేయడమూ మంచిదే. 

ఎన్‌టీఏ నిర్వహిస్తోన్న సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫిజిక్స్‌ పాత ప్రశ్న పత్రాలూ ఉపయోగపడతాయి.

మాదిరి ప్రశ్నలను జెస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష స్థాయి, ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. సన్నద్ధతను వాటికి తగ్గట్టుగా మలచుకోవాలి. 

‣ ఎక్కువ ప్రశ్నలు... సూత్రాలు, గణితంతో ముడిపడి ఉంటాయి. వీటికి వేగంగా సమాధానం రాబట్టడానికి ముందస్తు సాధనే కీలకం. 

రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలను వదిలేయాలి. అలాగే జవాబు పొందడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరిలో సమయం మిగిలితేనే ప్రయత్నించాలి.  

ప్రాథమికాంశాలపై పట్టు తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు. అలాగే భావనలు, సూత్రాల అనువర్తనకూ ప్రాధాన్యం ఉంది. వీటిపై దృష్టి సారించాలి. సూత్రాలు, భావనలను సమస్యల సాధనలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి.  

పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. 

జెస్ట్‌ సన్నద్ధత ఐఐటీ-జామ్, సీయూఈటీ(పీజీ).. ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ ఫిజిక్స్‌ కోర్సుల్లో చేరడానికి ఉపయోగపడుతుంది.


 కోర్సులు అందించే విద్యాసంస్థలు

ఆర్యభట్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, నైనిటాల్‌

బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా

హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబయి

హరీష్‌ చంద్ర రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్‌

ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ సైన్సెస్‌ (ఐసీటీఆర్‌-టీఐఎఫ్‌ఆర్‌), బెంగళూరు

‣ ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్, కల్పక్కం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐఐఎ), బెంగళూరు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)- భోపాల్, బరంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి. 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), తిరువనంతపురం

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ), చెన్నై 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ (ఐఓపీ), భువనేశ్వర్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌ (ఐపీఆర్‌), గాంధీనగర్‌

ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐయూసీఏఏ), పుణె

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌), బెంగళూరు

నేషనల్‌ బ్రెయిన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎన్‌బీఆర్‌సీ), మానేసర్‌

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఎన్‌సీఆర్‌ఎ-టీఐఎఫ్‌ఆర్‌) పుణె

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌

ఫిజికల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌),  అహ్మదాబాద్‌

రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌   టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ), ఇందౌర్‌

రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ), బెంగళూరు

సహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ (ఎస్‌ఐఎన్‌పీ), కోల్‌కతా 

సత్యేంద్రనాథ్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌ (ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌), కోల్‌కతా

టీఐఎఫ్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్‌ (టీఐఎఫ్‌ఆర్‌- టీసీఐఎస్‌), హైదరాబాద్‌

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌), ముంబయి  

కన్సార్టియమ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (యూజీసీ డీఏఈ- సీఎస్‌ఆర్‌), ఇందౌర్‌

వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌   (వీఈసీసీ), కోల్‌కతా


ముఖ్య వివరాలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 24 వరకు స్వీకరిస్తారు. 

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.400.   మిగిలిన అందరికీ  రూ.800.

పరీక్ష తేదీ: మార్చి 3 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://www.jest.org.in/



మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Posted Date: 17-01-2024


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌