• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్రంలో భళా! 

‘జస్ట్‌’ స్కోరుతో విశిష్ట విద్యాసంస్థల్లో ప్రవేశం 

పరిశోధనలే ప్రగతికి సోపానాలు. ముఖ్యంగా సైన్స్‌.. అందులోనూ ఫిజిక్స్‌లో పరిశోధనలు ఎంతో విలువైనవి. శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటితోనూ ఈ సైన్స్‌ సబ్జెక్టు ముడిపడి ఉండడమే ఇందుకు కారణం. దీంతో మానవాళికి భౌతికశాస్త్రం అస్త్రంలా మారింది. 

ఈ సబ్జెక్టులో ఆసక్తి ఉండి, రాణించాలనుకునేవారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జస్ట్‌)తో వీటిలో అవకాశం లభిస్తుంది. ఇందులో మెరుగైన ప్రతిభ చూపినవారు పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిపోవచ్చు. అలాగే ప్రతినెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు. అధునాతన ల్యాబ్‌ సౌకర్యాలు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఈ సంస్థల ప్రత్యేకత. ఇటీవల ప్రకటన వెలువడిన నేపథ్యంలో జస్ట్‌-2022 వివరాలు..

నేల నుంచి నింగిలోకి దూసుకుపోవడం... అంతరిక్షంలో విహరించడం... ఇలా అన్నింటికీ మూలాలు భౌతికశాస్త్ర సిద్ధాంతాలే. దేశ సాంకేతిక ప్రగతికి ఫిజికల్‌ సైన్సే ప్రధాన ప్రమాణం. ఇందుకోసం కేంద్రం ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) ఏర్పాటుచేశారు. దీని పరిధిలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలున్నాయి. విద్యార్థులను పరిశోధన దిశగా ప్రోత్సహించడానికి వీటిని నెలకొల్పారు. ఇవన్నీ జస్ట్‌తో ఫిజిక్స్‌ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నాయి. ఈ సంస్థలు ప్రతి నెలా స్టైపెండ్‌ అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీలో చేరినవారికి నెలకు రూ.12,000 చొప్పున రెండేళ్లు స్టైపెండ్‌ అందుతుంది. జేఆర్‌ఎఫ్‌లో భాగంగా నెలకు  రూ.31,000 చెల్లిస్తారు. ఎస్‌ఆర్‌ఎఫ్‌లో రూ.35,000 చొప్పున చెల్లిస్తారు. నేరుగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు  రూ.31,000 తర్వాత రెండేళ్లు రూ.35,000 పొందవచ్చు. వీటితోపాటు ఉచితంగా వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. 

ఇవీ అర్హతలు: 

ఫిజిక్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు: ఎమ్మెస్సీలో ఫిజిక్స్‌ చదివుండాలి. లేదా ఫిజిక్స్‌ సంబంధిత విభాగాల్లో ఏదైనా పీజీ, ఎంటెక్‌ చదివినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు బీఈ/ బీటెక్‌ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. 

ఇంటిగ్రేటెడ్‌- ఎమ్మెస్సీ/ఎంటెక్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ ఫిజిక్స్‌తో ఈ కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని సంస్థల్లో డిగ్రీలో మ్యాథ్స్, ఇంజినీరింగ్‌ కోర్సులు చదివినవాళ్లకూ అవకాశం ఉంది. 

థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌: కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌ లేదా ఎంసీఏ చదివుండాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. 

పై వాటిలో అభ్యర్థులు ఏదో ఒక కోర్సులో ప్రవేశానికే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం విద్యార్థులకూ అవకాశం ఉంది.   

ప్రశ్నపత్రం ఇలా...

ఇది వంద మార్కులకు ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు మూడు విభాగాల నుంచి అడుగుతారు. ఒక విభాగంలో 15 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు జవాబు గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు. మరో విభాగంలో 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. ఇంకో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. సరికాని జవాబు గుర్తిస్తే మార్కులో మూడోవంతు చొప్పున తగ్గిస్తారు. 

ఈ అంశాల్లో...

ఫిజిక్స్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి మ్యాథమేటికల్‌ మెథడ్స్, క్లాసికల్‌ మెకానిక్స్, ఎల్రక్టో మాగ్నటిజం అండ్‌ ఆప్టిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్‌ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సన్నద్ధత ఎలా

జస్ట్‌ ప్రశ్నపత్రం డిగ్రీ ఫిజిక్స్‌ సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అంశాలకు సంబంధించి మూడేళ్ల డిగ్రీ భౌతికశాస్త్రం పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రాథమికాంశాలపై పట్టు కోసం ఇంటర్‌ ఫిజిక్స్‌ పాఠ్యపుస్తకాలు చదవాలి. వీటిని పూర్తిచేసిన తర్వాతే డిగ్రీ పుస్తకాలపై దృష్టి సారించాలి. 

ఐఐటీలు నిర్వహించే జామ్, పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రశ్నపత్రాలను సాధన చేయడమూ మంచిదే. ఎన్‌టీఏ నిర్వహిస్తోన్న సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫిజిక్స్‌ పాతప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి.

మాదిరి ప్రశ్నలను జెస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష స్థాయి, ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. 

ఎక్కువ ప్రశ్నలు... సూత్రాలు, గణితంతో ముడిపడి ఉంటాయి. వేగంగా సమాధానం రాబట్టడానికి ముందస్తు సాధనే కీలకం. 

రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలు వదిలేయడమే మంచిది. అలాగే జవాబు పొందడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను ఆఖరులో ప్రయత్నించడమే మెరుగు. 

ప్రాథమికాంశాలపై పట్టు తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు. అలాగే భావనల, సూత్రాల అనువర్తనకూ ప్రాధాన్యం ఉంది. అందువల్ల వీటిపై దృష్టి సారించాలి. సూత్రాలూ భావనలను సమస్యల సాధనలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి.  

జస్ట్‌ సన్నద్ధత ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ ఫిజిక్స్‌ కోర్సుల్లో చేరడానికి ఉపయోగపడుతుంది.

ఇవీ విద్యాసంస్థలు

ఆర్యభట్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, నైనిటాల్‌

బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా

హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబై

హరీష్‌ చంద్ర రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్‌

ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరీటికల్‌ సైన్సెస్‌ (ఐసీటీఆర్‌-టీఐఎఫ్‌ఆర్‌), బెంగళూరు

ఇందిరా గాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్, కల్పక్కం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐఐఎ), బెంగళూరు

ఐఐఎస్సీ, బెంగళూరు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)- భోపాల్, బరంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి. 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), తిరువనంతపురం

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ), చెన్నై 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ (ఐఓపీ), భువనేశ్వర్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌ (ఐపీఆర్‌), గాంధీనగర్‌

ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐయూసీఏఏ), పుణె

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌), బెంగళూరు

నేషనల్‌ బ్రెయిన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎన్‌బీఆర్‌సీ), మానేసర్‌

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఎన్‌సీఆర్‌ఎ-టీఐఎఫ్‌ఆర్‌) పుణె

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌

ఫిజికల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌), అహ్మదాబాద్‌

రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ), ఇండోర్‌

రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ), బెంగళూరు

సహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ (ఎస్‌ఐఎన్‌పీ), కోల్‌కతా 

సత్యేంద్ర నాథ్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌ (ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌), కోల్‌కతా

టీఐఎఫ్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్‌ (టీఐఎఫ్‌ఆర్‌- టీసీఐఎస్‌), హైదరాబాద్‌

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌), ముంబై

కన్సార్టియమ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (యూజీసీ డీఏఈ- సీఎస్‌ఆర్‌), ఇండోర్‌

వేరిబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌ (వీఈసీసీ), కోల్‌కతా

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 18 వరకు స్వీకరిస్తారు. 

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.400. మిగిలిన అందరికీ రూ.800.

పరీక్ష తేదీ: మార్చి 13 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://www.jest.org.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి.. స్వాగతం!

‣ ఇంజినీరింగ్‌తో పాటు.. ఇవి నేర్చుకోవాలి!

‣ ప్రిపరేషన్‌కు కొన్ని పద్ధతులు!

‣ ఏ సంవత్సరంలో ఏం చేయాలి?

Posted Date: 20-12-2021


 

ప్రవేశ పరీక్షలు