• facebook
  • whatsapp
  • telegram

సముద్రమంత ఉద్యోగావకాశాలు!

వివిధ మెరైన్‌ కొలువుల వివరాలుసముద్రమంటే అందరికీ ఇష్టమే.. కానీ దానికి సంబంధించిన కెరియర్లలోకి వెళ్లడం కొందరికి కల! పైకి ప్రశాంతంగా కనిపిస్తూ లోపల మరో ప్రపంచాన్నే దాచుకున్న సాగరానికి సంబంధించి ఎన్నో వినూత్నమైన ఉద్యోగాలు అభ్యర్థుల కోసం ఉన్నాయి. వాటిలో ప్రవేశించడం ద్వారా కడలికి దగ్గరగా ఉంటూనే చక్కని కెరియర్‌ను అందిపుచ్చుకోవచ్చు.


సముద్రాలతో అనుసంధానమై ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య, పరిశోధన వంటి వివిధ రంగాలతో మమేకమై ఉద్యోగాలున్నాయి. వీటిలో కొన్ని ప్రాథమిక స్థాయివైతే.. మరికొన్ని లోతైన అధ్యయనం అవసరం అయ్యే కొలువులు. అవేంటంటే..


మెరైన్‌ బయాలజిస్ట్‌

బయాలజీ సబ్జెక్టును ఇష్టపడే వారికి ఇది సరైన ఎంపిక. వీరు సముద్రపు వాతావరణాన్ని అన్ని విధాలుగానూ పరిశీలిస్తారు. వివిధ జీవరాశుల వివరాలు సేకరిస్తారు. నీళ్లలో నివసించే విభిన్న జాతుల గురించి తెలుసుకుని అవి జీవవ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలిస్తారు. చిన్న ఆల్గే వద్ద నుంచి పెద్ద కోరల్‌ రీఫ్స్‌ వరకూ అన్నింటి గురించి పరిశోధిస్తారు. సముద్ర జీవరాశులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, ఎలా జీవిస్తున్నాయి, వాటికొచ్చే వ్యాధులు, వాటిపై ప్రభావం చూపే వివిధ వాతావరణ పరిస్థితులు, మనుషుల వల్ల కలిగే మార్పులు.. ఇలా అన్నీ గమనిస్తారు. ఈ ప్రక్రియలో అద్భుతమైన సముద్ర అంతర్భాగాలను, సుందరమైన తీరాలను చూసే అవకాశం దక్కుతుంది. సైన్స్, బయాలజీ విద్యార్థులు దీన్ని ఎంచుకునే వీలుంది. ప్రాథమిక స్థాయి ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ సరిపోతుంది. పరిశోధకులు, బోధకులు కావాలంటే డాక్టరేట్‌ ఉండాలి.


మెరైన్‌ టెక్నీషియన్‌

సముద్రాల్లో ప్రయాణించే నౌకల, పడవల తయారీలో మెరైన్‌ టెక్నీషియన్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. వివిధ ఉపకరణాలను వినియోగించి తయారీ, బాగుచేయడం వీరి ప్రధాన విధి. ప్రొపెల్లర్స్, హల్స్, ఇంజిన్స్, నావిగేషన్‌ సామగ్రి, సెయిల్స్, రిగ్గింగ్‌ వంటివి తయారీలో వీరిది ముఖ్యపాత్ర. రిఫ్రిజిరేషన్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ - క్యాబినెట్రీ, స్టీరింగ్‌ గేర్, యాక్సెసరీస్, శానిటేషన్‌ ఎక్విప్‌మెంట్‌ వంటివి ఏర్పాటుచేస్తారు. ఈ ఉద్యోగాలకు మెకానికల్‌ పరిజ్ఞానం అవసరం. మెరైన్, ఆటోమోటివ్, మోటార్‌స్పోర్ట్స్, హెవీ ఎక్విప్‌మెంట్‌ రిపేర్‌లో అనుభవం ఉండాలి.


ఓషన్‌ ఇంపోర్ట్‌ మేనేజర్‌

ఓషన్‌ ఇంపోర్ట్‌ మేనేజర్‌ దేశవిదేశాల సరకు ఇంపోర్ట్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తారు. రోజువారీగా జరిగే వివిధ రకాల వస్తువుల దిగుమతి సజావుగా సాగేలా చూస్తారు. కస్టమర్లకు ప్రణాళిక, సలహాలు ఇవ్వడంలో సహాయపడతారు. వస్తువులను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానానికి చేరేలా ప్రణాళికలు రచిస్తారు. లాజిస్టిక్స్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఈ నిపుణులకు మంచి డిమాండ్‌ ఉంది. మేనేజ్‌మెంట్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత ఈ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.కమర్షియల్‌ డైవర్‌

నేలపై ఉండే మనుషులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సముద్ర అంతర్భాగాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇలా వెళ్లేందుకు ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. వాటిని సాధన చేసేవారే కమర్షియల్‌ డైవర్‌. సరదాగా స్కూబా డైవింగ్‌ చేసినట్లు.. వీరు ప్రత్యేక కారణాల కోసం డైవింగ్‌ చేస్తారు. అందులో భాగంగా సముద్ర అంతర్భాగంలో ఉండే వస్తువులను/జీవులను పరిశీలించడం, అవసరమైన వాటిని అక్కడ ఉంచడం, ఏవైనా మరమ్మతులు చేయడం, అవసరం లేని వాటిని తీసివేయడం చేస్తుంటారు. ఫొటోగ్రఫీ కోసం, సినిమా షూటింగ్‌ల కోసం కూడా ఇలా డైవింగ్‌ అవసరం అవుతుంది. వీరు తరచూ పోలీసులు, నిర్మాణ సంస్థలు, షిప్‌యార్డుల కోసం పనిచేస్తుంటారు. దీనికి కనీస విద్యార్హత సరిపోతున్నా.. నైపుణ్యం మాత్రం ఉన్నత స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా నీటి అడుగున చీకటి, ఒత్తిడిలో మసలగలిగే శిక్షణ తర్వాతే ఇందులోకి ప్రవేశించగలరు.


మెరైన్‌ సైంటిస్ట్‌

వీరు సముద్ర అంతర్భాగ పరిశోధకులు. ప్రభుత్వ సంస్థలు, యూనివర్శిటీలు, ప్రైవేటు రిసెర్చ్‌ సంస్థలు, ఆయిల్, వాటర్, గ్యాస్‌ కంపెనీలతో కలిసి పనిచేస్తారు. నీటిలో ఉండే వివిధ రసాయనాలను, జియోలాజికల్‌ అంశాలను పరిశోధిస్తారు. మెరైన్, మెరైన్‌ జియోసైంటిస్టులు సముద్ర అంతర్భాగాలను పరిశీలించి సహజంగా వచ్చే మార్పులను అంచనా వేస్తారు. నీటి నుంచి శాంపిళ్లను సేకరించడం, ల్యాబ్‌లో వాటిని పరిశోధించడం, ఇన్‌సైట్స్‌ తయారీ.. ఇలా పనితీరు సాగుతుంది. ఇందులో ప్రవేశించదలచిన అభ్యర్థులకు ఉన్నత విద్యార్హతతోపాటు బలమైన అనలిటికల్, రీజనింగ్‌ నైపుణ్యాలు అవసరం. వివిధ సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించే సాంకేతిక సామర్థ్యంతో పాటు ఫీల్డ్‌లో పనిచేసే ప్రాక్టికల్‌ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.


మెరైన్‌ మేనేజర్‌

వివిధ పనుల మీద నెలల తరబడి సముద్రం మీద ఉండే ఓడల్లో ఎన్నో విభాగాలు కలిసి పనిచేస్తుంటాయి. అందులో అందరినీ సమన్వయం చేసుకుంటూ పని సజావుగా సాగేలా చూడటం వీరి ప్రధాన విధి. ఒక షిప్‌లో రోజువారీ జరిగే ఆపరేషన్స్‌ను వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. స్టాఫ్‌కు విధులను కేటాయించడం, క్రూలో ఉన్న ప్రతి సభ్యుడినీ పట్టించుకోవడం, ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం.. ఇటువంటి విధులుంటాయి. మారిటైమ్‌ బిజినెస్‌ విభాగంలో కనీస డిగ్రీ తర్వాత ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.


మెరైన్‌ ఎకాలజిస్ట్‌

జీవ రాశులకూ, వాతావరణానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసేవారే ఎకాలజిస్ట్‌. వీరు మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశులకు సంబంధించిన పరిశోధనలు జరుపుతారు. జీవం ఉన్న చోట ఎక్కడైనా వీరు పని చేస్తారు, సముద్రంలో కూడా ఇదే విధంగా చేయవచ్చు. వారే మెరైన్‌ ఎకాలజిస్టులు. ఆక్వాటిక్‌ సిస్టమ్స్,  నీటిలో ఉండే జీవం వాతావరణంతో అనుసంధానమయ్యే తీరు.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తారు. ఉన్నత స్థాయిలో పరిశోధనలు జరిపేందుకు పీజీ, డాక్టరేట్‌తోపాటుగా స్కూబా డైవింగ్‌ సర్టిఫికేషన్‌ అవసరం అవుతుంది.


మెరైన్‌ ఇంజినీర్‌

బోట్లు, ట్యాంకర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు, సబ్‌మెరైన్లు, నౌకలు, ఆఫ్‌షోర్‌ ప్లాట్‌ఫామ్స్, డ్రిల్లింగ్‌ ఎక్విప్‌మెంట్, ఇతర బేసిక్‌ స్ట్రక్చర్స్‌ తయారీలో వీరే కీలకంగా వ్యవహరిస్తారు. డ్రిల్లింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వీరు సముద్ర తీరానికి దూరంగా కూడా పనిచేయవచ్చు. బోట్లు, షిప్పుల అవసరానికి తగిన విధంగా మెషినరీ, వెంటిలేషన్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్, ప్రొపల్షన్, స్టీరింగ్‌ సిస్టమ్‌ తయారీలో పాల్గొంటారు. మెరైన్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, నేవల్‌ ఆర్కిటెక్చర్‌.. వంటి కోర్సుల ద్వారా ఈ కెరియర్‌లోకి ప్రవేశించవచ్చు.


ఆప్టికల్‌ ఇంజినీర్‌ 

ఆప్టికల్‌ ఇంజినీర్లు నౌకల్లో ఉండే కెమెరాలు, టెలిస్కోప్‌ల వంటి వాటికి లెన్సులను, అవసరమైన ఇతర విడిభాగాలను అభివృద్ధి చేస్తారు. ఆప్టికల్‌ సిస్టమ్స్‌ తయారీలో వీరిది ముఖ్యపాత్ర. సముద్రాలు, ఇతర నీటి ఉపరితలాలపై పనిచేసే సమర్థమైన ఆప్టికల్‌ సిస్టమ్స్‌ను ఆవిష్కరిస్తారు.

హైటెక్‌ టెలిస్కోప్స్, పెరిస్కోప్స్, ఓడపై ఉండేవారు చూసేందుకు ఉపయోగపడే ఇతర వస్తువుల తయారీకి ఆప్టికల్‌ ఇంజినీర్లు అవసరం. ఇంజినీరింగ్‌లో ఈ విభాగాన్ని ఎంచుకోవడం, ఇంటర్న్‌షిప్స్‌ ద్వారా కనీస అనుభవం సంపాదించి ఈ కెరియర్‌లోకి వెళ్లొచ్చు.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 23-01-2024


 

కోర్సులు