• facebook
  • whatsapp
  • telegram

Medical colleges: గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య కళాశాలలు

* నాణ్యతపై మరింత దృష్టి.. పరిశోధనలకు ప్రోత్సాహం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచానికి నైపుణ్యం కలిగిన వైద్యులను భారత్‌ అందిస్తున్నా వైద్యవిద్యలో అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. నాణ్యమైన వైద్యవిద్య కోసం అనేకమంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని తెలిపింది. దేశంలో 702 వైద్య కళాశాలలున్నా పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని.. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల ఏర్పాటుతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడింది. వైద్యవిద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాణ్యతను పెంచుకోవాలని.. ఇందుకోసం పాఠ్యాంశాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందంది. దేశంలో వైద్యవిద్య తీరును విశ్లేషించిన స్థాయీసంఘం ఇటీవల రాజ్యసభకు తన నివేదికను సమర్పించింది. అందులో పలు సూచనలు చేసింది.

వైద్యవిద్య నాణ్యత మెరుగుపర్చాలి

దేశంలో వైద్యవిద్య నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధ్యయనం చేపట్టాలి. వాటిలో అత్యుత్తమమైనవి గుర్తించి.. మన దేశ వైద్యవిద్యలో వాటిని అందుబాటులోకి తేవాలి. పరిశోధనలను ప్రోత్సహించాలి. బోధనా సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. వైద్యుల జాతీయ డేటాబేస్‌ నిర్వహించాలి. వైద్యులందరికీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు ఇవ్వాలి. తద్వారా కొత్త వైద్య విద్యాసంస్థల్లోని రెసిడెంట్‌ వైద్యులకు అనుభవజ్ఞులు తమ విజ్ఞానం పంచేందుకు వేదికగా పనిచేస్తుంది.

డిమాండ్‌, సీట్ల లభ్యత మధ్య అంతరం తగ్గించాలి..

దేశంలో ఏటా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు వైద్యవిద్య అభ్యసించడానికి ఆసక్తి కనబరుస్తుండగా.. 20వ వంతు మందికే అవకాశం లభిస్తోంది. డిమాండ్‌, సీట్ల లభ్యత మధ్య అంతరం ఎక్కువగా ఉంది. పీజీ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వైద్యవిద్యలో నాణ్యత కొనసాగిస్తూనే సీట్లను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. జిల్లా లేదా రిఫరల్‌ ఆసుపత్రులకు అనుబంధంగా కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వైద్య కళాశాలల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ప్రైవేట్‌ సంస్థలకు తోడ్పాటు అందించడం ద్వారా సీట్ల లభ్యత పెరగడమే కాకుండా వైద్యవిద్యలో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి.. ఆవిష్కరణలను దారితీస్తుంది. ఇందుకు రాబోయే 20-25 ఏళ్లలో దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం జనరల్‌ సర్జరీ, ఫార్మా, అనాటమీ సీట్ల పెంపుదలకే పరిమితం కాకూడదు. పీడియాట్రీషియన్లు, నేత్ర వైద్యులు, న్యూరోసర్జన్లు, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌లు, ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ స్పెషలిస్టుల ఆవశ్యకతను గుర్తించాలి.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.