• facebook
  • whatsapp
  • telegram

Education: డిగ్రీ విద్యలో ‘మేజర్‌ సబ్జెక్టు’ కల్లోలం

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యలో సంస్కరణల పేరుతో  పూర్వాపరాలు ఆలోచించకుండా అమలు చేస్తున్న ‘సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం’.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఉనికికే ఎసరుతెచ్చింది. ఈ విధానంలో అన్నిరకాల సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే ఎందరు అధ్యాపకులు, ఎంతమంది గ్రామీణ కళాశాలల్లో సిబ్బంది అవసరం? అన్నవి పట్టించుకోకుండా ఉన్నత విద్యామండలి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని సబ్జెక్టులు, మరికొన్నింట్లో ఇతర సబ్జెక్టులు పెట్టడంతో విద్యార్థులు సమీపంలోని ప్రైవేటు కళాశాలలకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. కొన్నిచోట్ల కోరుకున్న సబ్జెక్టుల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 54 మేజర్‌, 53 మైనర్‌ సబ్జెక్టులను ఉన్నత విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఒక్కో మేజర్‌ సబ్జెక్టు నిర్వహించాలంటే కనీసం 20 మంది విద్యార్థులు చేరాలి. అయితే, డిమాండ్‌ లేని కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. ఇచ్ఛాపురం ప్రభుత్వ కళాశాలలో బీఏ రాజనీతిశాస్త్రం సబ్జెక్టులో 9 మంది చేరారు. ఇలా ప్రవేశాలు తక్కువగా ఉండటంతో ఆ కళాశాలల్లో కోర్సులను తీసేసి, విద్యార్థులను సర్దుబాటు చేస్తున్నారు.

* పేదలకు ఉన్నత చదువు దూరం..

రాష్ట్రంలోని 168 ప్రభుత్వ కళాశాలల్లో స్వయం ప్రతిపత్తి గలవి 18 ఉన్నాయి. మహిళలకు ప్రత్యేకంగా 24 డిగ్రీ కళాశాలలున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ప్రవేశపెట్టిన సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం ప్రకారం.. ఒక సబ్జెక్టును మేజర్‌గా, మరోటి మైనర్‌గా చదవొచ్చు. ఉదాహరణకు బీఎస్సీలో గణితం మేజర్‌ సబ్జెక్టుగా ఎంచుకుంటే.. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌ ఇలా నచ్చిన సబ్జెక్టును మైనర్‌గా చదువుకోవచ్చు. మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులు నచ్చినవి ఎంచుకునేందుకు ఎక్కువ ఆప్షన్లు లేవు. అధ్యాపకుల సర్దుబాటులో భాగంగా కళాశాలలకు సబ్జెక్టుల వారీగా పంచేశారు. ఇది ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలను భారీగా దెబ్బతీసింది. కొన్ని సబ్జెక్టుల్లో 10 మంది విద్యార్థులైనా చేరలేదు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కాలేజీలో బీఏలో కేవలం రాజనీతిశాస్త్రం, బీకాం జనరల్‌ మాత్రమే మేజర్‌ సబ్జెక్టులుగా ఉన్నాయి. వీటిపై ఆసక్తి లేని విద్యార్థులు మరో కళాశాలకు వెళ్లడమో, లేదంటే ప్రైవేటులో చేరి, నచ్చిన కోర్సు చదవడమో తప్ప గత్యంతరం లేదు. ఇక్కడ ఈ రెండు కోర్సుల్లో కలిపి 100 సీట్లు ఉంటే 2023-24లో 47 మంది చేరారు.

 విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(ఎంఆర్‌)లో సంస్కృతం మేజర్‌లో కేవలం ఇద్దరు విద్యార్థులు చేరగా, నక్కపల్లిలో బీకాం జనరల్‌, బీఎస్సీ కెమిస్ట్రీలో 11 మంది చొప్పున ప్రవేశాలు పొందారు. చాలాచోట్లా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల విద్యార్థులసంఖ్య తక్కువగా ఉంటే ఆ కోర్సును ఎత్తేసి, మరో మేజర్‌ సబ్జెక్టులో సర్దుబాటు చేస్తున్నారు.

సున్నా ప్రవేశాలా?

ప్రస్తుతం మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల్లో పీజీ చేయాల్సి ఉంటుంది. దీనికితోడు నాలుగేళ్ల ఆనర్స్‌ను ప్రవేశపెట్టారు. మూడేళ్ల తర్వాత బయటకు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రైవేటు కళాశాలలు మూడేళ్ల డిగ్రీనే నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని మాత్రమే నాలుగేళ్ల ఆనర్స్‌ను అమలు చేస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ చదవడం ఎందుకని, బీటెక్‌ వైపు మొగ్గు చూపుతున్న వారూ ఉన్నారు. ఈ కారణంగానూ డిగ్రీలో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. 2021-22లో డిగ్రీ కోర్సుల్లో 41 వేల మంది విద్యార్థులు చేరగా, 2022-23లో ఈ సంఖ్య 26 వేలకు పడిపోయింది. 2023-24లో 25 వేల మందిలోపు విద్యార్థులు మాత్రమే చేరారు.

రాష్ట్రవ్యాప్తంగా 69 మేజర్‌ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. చోడవరం ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్‌లో ఒక్కరూ చేరలేదు. తుని కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో బీఏ ఆర్థికశాస్త్రం, బీఎస్సీ గణితం, భౌతికశాస్త్రాల్లో ప్రవేశాలు సున్నా. కాకినాడ మహిళా కళాశాలలో బీకాం డిజిటల్‌ మార్కెటింగ్‌ సబ్జెక్టును పెట్టగా ఎవరూ చేరలేదు. ప్రైవేటు యాజమాన్యాలు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ కోర్సులను కొనసాగిస్తూ, చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి సబ్జెక్టులను ఎత్తేశాయి.

బోధనేతర పనులే ఎక్కువ..

డిగ్రీ ఆధ్యాపకులకు బోధనేతర పనులు అప్పగించడంతో పాఠాలు చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ టీచింగ్‌, లెర్నింగ్‌ ప్రాసెస్‌(ఓటీఎల్‌పీ) యాప్‌లో ప్రతి సబ్జెక్టు టీచర్‌.. విద్యార్థుల హాజరు, చెప్పే పాఠం, సబ్జెక్టు గురించి నమోదు చేయాలి. 50 నిమిషాల పీరియడ్‌లో ఈ ప్రక్రియకే 5-10 నిమిషాలు పోతుంది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.