• facebook
  • whatsapp
  • telegram

APPSC : మార్కుల వెల్లడిలో గోప్యత ఏల?

* యూపీఎస్సీ అలా.. ఏపీపీఎస్సీ ఇలా.. 

APPSC: ఉద్యోగ నియామకాల రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ గోప్యత పాటిస్తుండగా యూపీఎస్సీ మాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఎవరికెన్ని మార్కులు వచ్చాయో బహిర్గతం చేయకుండా.. నియామకాలు మాత్రం పారదర్శకంగానే జరిపామంటూ ఏపీపీఎస్సీ డప్పు కొట్టుకుంటోంది. మార్కులను బహిర్గతం చేయాలన్న విజ్ఞప్తులను పట్టించుకోవడంలేదు. దీనిపై విమర్శలు రావడంతో గ్రూపు-1 అభ్యర్థులకు వ్యక్తిగతంగా మాత్రమే తెలుసుకునే అవకాశం ఇస్తోంది. అయితే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఇలాంటి మెలికలేవీ పెట్టకుండా అభ్యర్థులకు ప్రధాన పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను వెబ్‌సైట్‌ ద్వారా బహిర్గతం చేసింది. సబెక్టులవారీగా వచ్చిన మార్కులను వ్యక్తిగతంగా కూడా పంపుతోంది. దీనివల్ల అభ్యర్థులకు తమ సన్నద్ధతపై అవగాహన పెరుగుతుంది. నియామకాలు పారదర్శకంగా జరిగాయా.. లేదా అనే అంచనాకు కూడా వీలుంటుంది.

2018 నోటిఫికేషన్‌ నుంచి

ఏపీపీఎస్సీ 36/2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను అనుసరించి ప్రధాన పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు ఒక్కో సబ్జెక్టులో 150కి వచ్చిన మార్కుల వివరాలను వెల్లడించింది. 2018 నోటిఫికేషన్‌పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. 2022 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జరిగిన నెలరోజుల తర్వాత.. కోరినవారికి మార్కులు అందిస్తామని పేర్కొన్నా, అదీ చేయలేదు. విమర్శలు రావడంతో గతనెల 19న జారీ చేసిన ప్రకటనలో నిర్దేశిత తేదీల్లో దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ విధానంలో మార్కులు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించింది. ఆ తరువాత రెండు రోజులకు దరఖాస్తు చేయనక్కర్లేదని, ఓటీపీ విధానంలో మార్కులు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించింది. అంతేకానీ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అందరూ తెలుసుకునే అవకాశాన్ని మాత్రం ఇప్పటివరకు కల్పించలేదు.

1,016 మంది మార్కుల వెల్లడి

యూపీఎస్సీ శుక్రవారం సివిల్స్‌ నోటిఫికేషన్‌ అనుసరించి ఎంపిక చేసిన 1,016 మంది అభ్యర్థులకు ప్రధాన పరీక్ష, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను ర్యాంకులవారీగా వెల్లడించింది. అలాగే సబ్జెక్టులవారీగా వచ్చిన మార్కుల వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా పంపింది. మౌఖిక పరీక్షలకు ఎంపిక కాని వారికి కూడా మార్కులు తెలిపింది. ఏపీపీఎస్సీ మాత్రం ఈ విషయంలో కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సివిల్స్‌ ర్యాంకర్లకు ప్రధాన పరీక్షల్లో ఎక్కువ మార్కులు.. ఇంటర్వ్యూలో తక్కువ!

యూపీఎస్సీ సివిల్స్‌లో తొలి ర్యాంకర్‌ ఆదిత్య శ్రీవాస్తవకు ప్రధాన పరీక్షల్లో 1,750కు 899 మార్కులు వచ్చాయి. మౌఖిక పరీక్షలో 225కు 200 మార్కులు వచ్చాయి. 12వ ర్యాంకర్‌ ఎ.శాండిల్యకు ప్రధాన పరీక్షల్లో 826 రాగా, మౌఖిక పరీక్షల్లో అందరికంటే అత్యధికంగా 215 మార్కులు రావడం గమనార్హం. రెండో ర్యాంకర్‌ అనిమేష్‌ ప్రధాన్‌కు ప్రధాన పరీక్షల్లో 892, మౌఖిక పరీక్షలో 175 చొప్పున మార్కులు వచ్చాయి. మూడో ర్యాంకర్‌ అనన్యరెడ్డి (ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి)కి ప్రధాన పరీక్షల్లో 875, మౌఖిక పరీక్షలో 190 చొప్పున మార్కులు వచ్చినట్లు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. యూపీఎస్సీ 21 కేటగిరిల కింద ఎంపిక చేసిన 1,016 మందికి ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌.తోపాటు ఐ.ఆర్‌.ఎస్‌., ఇండియన్‌ డిఫెన్స్‌ ఆడిట్‌, ఇతర కేటగిరిల్లోనూ ఉద్యోగాలు లభించాయి.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.