• facebook
  • whatsapp
  • telegram

TET Exam: టెట్‌ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో

చాలామందికి ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసే నిరుద్యోగ అభ్యర్థులనే కాదు... పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులనూ కష్టాలు చుట్టుముట్టాయి. దరఖాస్తు రుసుంను ఒకేసారి రూ.400 నుంచి రూ.వెయ్యికి పెంచి అభ్యర్థులపై ఆర్థిక భారం మోపిన అధికారులు...పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ముప్పుతిప్పలు పెడుతున్నారు. మే 20 నుంచి మొదలయ్యే ఆన్‌లైన్‌ పరీక్షలు అభ్యర్థులకు చుక్కలు చూపించనున్నాయి. చాలామందికి కనీసం పక్క జిల్లాలో కాకుండా దూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించారు. టెట్‌కు దాదాపు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఈసారి ఉపాధ్యాయులు 48 వేల మంది వరకు ఉన్నారు. పదోన్నతులకు టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి అని హైకోర్టు కొద్ది నెలల క్రితం పేర్కొన్నందున టీచర్లు సైతం దరఖాస్తు చేశారు. ఇప్పుడు వారికి పరీక్షా కేంద్రాల దూరం కలవరపెడుతోంది. వేల మందికి ఇతర జిల్లాల్లో...అదీ దూరంగా ఉన్న ప్రాంతాల్లో సెంటర్లను కేటాయించారు. దాంతో బస్సు ఛార్జీల భారం పడనుంది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ముందురోజే ఆయా జిల్లాలకు చేరుకొంటే వసతి, భోజన ఖర్చులు తప్పవు. ఆర్థిక భారం ఎవరు మోయాలని వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం పాత 9 జిల్లా కేంద్రాలు, సిద్దిపేట, సంగారెడ్డిలలోనే పరీక్షలు జరుపుతుండటం వల్లే ఈ కష్టాలు వచ్చాయని అభ్యర్థులు వాపోతున్నారు. పరీక్ష ఫీజు రూ.వెయ్యి తీసుకొని... దూరపు జిల్లాల్లో పరీక్షలు జరపడం సరికాదని డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇతర జిల్లాల్లో పరీక్ష రాయాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు అనేక మంది గైర్హాజరు కావొచ్చని తెలుస్తోంది.


సుమాంజలిది ఆదిలాబాద్‌ జిల్లా. ఆమె టెట్‌ పేపర్‌-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్‌ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్‌ ఇచ్చారు. హాల్‌టికెట్‌ చూస్తే పేపర్‌-1కు ఆదిలాబాద్‌లో, పేపర్‌-2కు సిద్దిపేటలో పరీక్షా కేంద్రాలను కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  కరీంనగర్‌కు చెందిన లింగారావు టెట్‌ పేపర్‌-2కు దరఖాస్తు చేశారు. మే 20న పరీక్ష ఉంది.  హైదరాబాద్‌ మేడ్చల్‌లో పరీక్ష కేంద్రం ఇచ్చారు. తాను కరీంనగర్, నిజామాబాద్‌ ఆప్షన్లుగా ఇచ్చానని, ఆన్‌లైన్‌ విధానంతో ఫలితాలు త్వరగా వస్తాయని అనుకున్నాగానీ...ఇన్ని తిప్పలు పెడతారని అనుకోలేదని ఆవేదన చెందారు.
ములుగు జిల్లాకు చెందిన ఇర్ఫాన్‌ టెట్‌ పేపర్‌-1కు దరఖాస్తు చేశారు. దగ్గరలో ఉంటాయని వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు వరుసగా ఆప్షన్లు ఇచ్చారు. హాల్‌టికెట్‌ చూస్తే హైదరాబాద్‌ మల్లాపూర్‌లో కేంద్రాన్ని కేటాయించారు. ఉదయం 9 గంటలకే పరీక్ష ఉంది. మొత్తం 230 కిలోమీటర్ల దూరం వెళ్లి పరీక్ష రాయాలి. అదే రోజు తెల్లవారుజామున బయలుదేరితే చేరుకుంటానో లేదో అన్న ఆందోళన ఉందని, ఒక రోజు ముందే వెళితే వసతి, భోజన ఖర్చులు భారమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

Published Date : 18-05-2024 12:32:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం