• facebook
  • whatsapp
  • telegram

Education: విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలెన్నో..!

* ఇంటర్‌తో ఉద్యోగాలు సైతం..

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, కాజీపేట, న్యూస్‌టుడే: ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఎప్‌సెట్‌ 2024 ఫలితాల్లో గతంతో పోలిస్తే చాలా తక్కువ మంది అర్హత సాధించారు. వీరి సంఖ్య 30 శాతానికిపైగా ఉంటుంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్వాత ఏమిటి అనే ఆందోళనలో ఉన్నారు. 

 సంప్రదాయ కోర్సులు అనేకం.. 

ఇంజినీరింగ్‌కు సమాన అవకాశాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లోనూ ఇప్పుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి. బీఎస్సీ, బీకాంలే కాకుండా ప్రస్తుతం అవసరమైన ఆధునిక కోర్సులు కంప్యూటర్‌ సైన్స్‌ లాంటివి జతచేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌తో సంబంధం లేకుండా కోచింగ్‌ సెంటర్లలో పైథాన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్‌ తదితర కోర్సులు నేర్చుకుని నేరుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.

* డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. బీఎస్సీలో డేటా సైన్స్, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి కోర్సులనూ ఎంచుకోవచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీలో చేరవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌కు ఏ డిగ్రీ చదివినా అర్హులే. ఇవేకాక చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆంగ్లం, సోషియాలజీ, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌లో కూడా ఏదేని డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

నర్సింగ్‌లో అనేక  మార్గాలు..

ఎప్‌సెట్‌లో అనుకున్నంత ర్యాంకులు సాధించని వారు నర్సింగ్, ఫార్మసీ, పిజియోథెరఫీ, అనెస్థీషియా లాంటి కోర్సులను ప్రైవేటుగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మేనేజ్‌మెంట్‌ కోటాలో పొందవచ్చు. 

ప్రస్తుతం వరంగల్‌ లాంటి నగరాల్లోనూ అనేక కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు వస్తున్నాయి. వీటిలో విషయ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రసాయన, భౌతిక శాస్త్రం, గణిత అధ్యాపకులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఎప్‌సెట్‌లో ర్యాంకులు సాధించని విద్యార్థులు ఇంటిగ్రెటెడ్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఐదు సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. నేరుగా మాస్టర్‌ డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. కళాశాలల్లో లెక్చరర్లుగా లేదా ల్యాబ్‌లలో ఉద్యోగాలు సంపాదించవచ్చు. విదేశాలల్లో కూడా అధ్యాపకులుగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

చదువు.. కొలువు..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షను ఇంటర్‌ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులను చదివిస్తారు. శిక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో తీసుకుంటారు. 

ప్రవేశ పరీక్షలతోనూ..

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్డీ, కోస్టుగార్డు, పోస్టల్, రైల్వేస్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ రంగాల్లో  ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్‌ లోకోపైలట్, జూనియర్‌ క్లర్క్, టికెట్‌ క్లర్క్, డివిజనల్‌ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి ఉద్యోగాలకు అర్హులే. వాటికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పోలీస్, అటవీ, ఎక్సైజ్‌ శాఖల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Published Date : 23-05-2024 12:18:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం