• facebook
  • whatsapp
  • telegram

TG Job Calendar: జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత

* యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ

* అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం

* ఈ ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు లేకుండా చూస్తాం

* సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌:  న్యూస్‌టుడే, కూకట్‌పల్లి: త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్‌ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు. శనివారం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ‘నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య’ అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ 2024’ లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ...ఏటా లక్ష మంది ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని తెలిపారు.

కళాశాలలు మేధావుల్ని తయారు చేయాలి  

‘‘పేదవాడికి విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆనాడు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చింది. గత సర్కారులో కొన్ని పరిణామాలు, దాని ప్రాధాన్యాల వల్ల కళాశాలలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. చార్మినార్, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, ఈఫిల్‌ టవర్, న్యూయార్క్‌ సిటీ, హైటెక్‌ సిటీ ఇలా అభివృద్ధికి చిహ్నంగా ఏవి చూపించినా అవి ఇంజినీర్లు చేసిన అద్భుతాలే. ఇంజినీరింగ్‌ కళాశాలలు కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి మేధావులను తయారుచేసే విధంగా ఉండాలి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు నాలుగు ఉంటే అందులో మూడు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. దీనికి కారణం 1965-1970 కాలంలో ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేయడం. అక్కడి సిబ్బంది, ఉద్యోగులు పరిశోధనల్లో నైపుణ్యాలు పొంది వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ప్రతి పది మంది ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారు ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అటానమస్‌ హోదాతో స్కిల్‌ యూనివర్సిటీ 

గత సీఎంలు చేపట్టిన విధానాలతో మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులు ఉండాలి. టీసీఎస్‌తో చర్చించి రూ.2,400 కోట్లతో (86శాతం టాటా సంస్థ, 14శాతం ప్రభుత్వ ఖర్చుతో) 65 ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చబోతున్నాం. తొలుత పైలట్‌ ప్రాజెక్టును మల్లెపల్లిలో ప్రారంభించాం. అక్కడి నిపుణులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఫార్మా, ఐటీ తర్వాత కృత్రిమ మేధ ప్రపంచాన్ని నడిపించబోతోంది. ఈ కోర్సులు విరివిగా రావాలి. త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ ఏర్పాటు చేసి అటానమస్‌ హోదా ఇస్తాం.  మా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది.  కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయి. పదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇప్పుడు పక్కాగా డీఎస్సీ, గ్రూప్‌ 2, 3 నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటున్నారు. ఏ పరీక్షలూ రాయనివారు దీక్షలు చేస్తున్నారు’’ అని సీఎం మండిపడ్డారు.   

కొత్త కోర్సుల రూపకల్పన: మంత్రి శ్రీధర్‌బాబు  

‘‘జేఎన్టీయూ వేదికగా సాంకేతిక విద్యను ప్రపంచస్థాయిలో పోటీపడేలా తయారు చేయాలనే ఆలోచనా విధానంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పరిశోధనలు, కెమికల్‌ ఇంజినీరింగ్, సివిల్‌ ఇంజినీరింగ్‌లో ప్రపంచస్థాయి అవసరాలను తీర్చేలా కొత్త కోర్సులు రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో  హైదరాబాద్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించేందుకు అవసరమైన కృత్రిమ మేధలాంటి సాంకేతికతలో ముందుండాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వం నగరంలో 200 ఎకరాల్లో ఏఐ సీటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించేందుకు సెప్టెంబరులో అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతున్నాం’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.


 

బోధనా రుసుంల బకాయిలకు ఓటీఎస్‌ విధానం! 

 ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.వేల కోట్ల బోధనా రుసుం (ఫీజు రీయింబర్స్‌మెంట్‌)లను చెల్లించేందుకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) విధానం అమలు చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా కళాశాలలకు రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వీటిలో ఇంజినీరింగ్‌ కళాశాలలకు 70% వరకు చెల్లించాలి. తమకు పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు చాలారోజులుగా కోరుతున్నాయి. అయితే, బకాయిలపై ఎవరూ ఊహించని విధంగా ఓటీఎస్‌ గురించి జేఎన్‌టీయూహెచ్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మొండి బకాయిలకు సంబంధించి కళాశాలల యాజమాన్యాలు ఓటీఎస్‌ విధానాన్ని ప్రతిపాదిస్తూ ముందుకొస్తే మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబులు సమస్యకు పరిష్కారం చూపే అవకాశముందని ఆయన సూచించారు. అంటే బకాయిపడిన మొత్తంలో కొంత తగ్గించి చెల్లించే అవకాశమున్నట్లు యాజమాన్యాలు భావిస్తున్నాయి. తమ కోసం ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు కళాశాలల ప్రతినిధులు మాట్లాడితే ఆలస్యమవుతుందని, అందుకే వారిని 5-10 మందితో ఒక బృందంగా వచ్చే వారం సచివాలయానికి పిలవాలని, అప్పుడు తాను, ఆర్థిక, ఐటీ శాఖల మంత్రులు కూర్చొని సమస్యలను వింటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి సీఎం సూచించారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.