• facebook
  • whatsapp
  • telegram

దూరవిద్యకు తగ్గిన ప్రవేశాలు

* ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చదువులు వాయిదా
* ఈనెలాఖరు వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: దూరవిద్య ప్రవేశాలపై కరోనా ప్రభావం పడింది. నగరంలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ఇంటర్‌ ఫలితాల ప్రభావంతోపాటు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు, గృహిణులు చదువు వాయిదా వేసుకునేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏటా దూరవిద్య కోర్సుల్లో 9 వేల మందికిపైగా ప్రవేశం పొందేవారు. బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో గతేడాది 62 వేల మంది ప్రవేశం తీసుకున్నారు. ఈసారి రెండు చోట్లా విద్యార్థుల సంఖ్య తగ్గింది. తాజాగా యూజీసీ దూరవిద్య ప్రవేశాల గడువును డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించడంతో వర్సిటీలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయి.


ఎందుకీ పరిస్థితి?
ఏటా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో రెగ్యులర్‌ తరగతుల్లో చేరలేకపోతే దూరవిద్యలో ప్రవేశాలు తీసుకునేవారు. కరోనా కారణంగా ఇంటర్‌లో ఫీజు కట్టిన విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రెగ్యులర్‌గా చేరేందుకు వారంతా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు డిగ్రీ ఫలితాలు రాకపోవడంతో పీజీలో చేరే విద్యార్థుల సంఖ్యా తగ్గింది. ఇక ఉద్యోగులు, గృహిణులు, చిరువ్యాపారులు, వృద్ధులు దూరవిద్యను ఎంచుకునేవారు. ప్రస్తుతం కరోనాతో బయట ఎక్కువగా తిరిగే వీల్లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో వాయిదా వేసుకుని ఉంటారని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ప్రవేశాల పరిస్థితి ఇలా..
అంబేడ్కర్‌ వర్సిటీలో 2020-21 సంవత్సరానికి యూజీ కోర్సుల్లో 33,543 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. పీజీ కోర్సులపరంగా 9,071 మంది, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు కలిపి 2,831 మంది ప్రవేశాలు తీసుకున్నారు.
● ఓయూ పరిధిలో యూజీ కోర్సుల్లో 1647 రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, పీజీ కోర్సులకు 2,623 రిజిస్టర్‌ చేసుకున్నారు. ఓయూ ఎంబీఏ అర్హత పరీక్ష ఈనెలలో జరగనుంది. ఇక ఐసెట్‌ అర్హత సాధించిన 94 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. పీజీ డిప్లొమా కోర్సుల్లో 383 మంది రిజిస్టర్‌ చేసుకోగా 128 మంది ఫీజు కట్టారు.
కొత్త కోర్సులు వాయిదా
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి పీజీ డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు ప్రవేశపెట్టాలని అధికారులు భావించారు. ఏదైనా కోర్సు ప్రారంభించే ముందు స్టడీ మెటీరియల్‌ సిద్ధం చేయకుండా మొదలు పెట్టొదని దూరవిద్య మండలి (డెబ్‌) స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా విశ్వవిద్యాలయం మూత పడటంతో స్టడీ మెటీరియల్‌ సిద్ధం కాకపోవడంతో ఆయా కోర్సులు ప్రారంభించలేదు.
రెండో విడతకల్లా మెరుగుపడొచ్చు
- ప్రొ.గణేశ్‌, ఓయూ దూరవిద్య విభాగం సంచాలకుడు
ప్రస్తుతం డిసెంబరు నెలాఖరువరకు గడువు ఉన్నందున ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులకు ఫీజు కట్టేందుకు వీలుంది. జనవరి, ఫిబ్రవరిలో రెండో విడత ప్రవేశాల నాటికి పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.