• facebook
  • whatsapp
  • telegram

కొలువుల పండగ!

* యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీ 
* వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు 
* త్వరితగతిన నోటిఫికేషన్లు 
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
 

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగులకు తీపికబురు.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. డిసెంబ‌రు 13న‌ ప్రగతిభవన్‌లో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘తెలంగాణ ఏర్పడిన సమయం నాటికి ఉన్న ఖాళీలను గుర్తించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. తర్వాత ఉద్యోగ విరమణల కారణంగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. వాటన్నింటినీ సత్వరమే భర్తీ చేస్తాం. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల నియామకాలు జరగాలి. వీటితోపాటు ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల సమాచారం తీసుకోవాలి. డిసెంబరు నెలాఖరునాటికి ఉద్యోగ విరమణ చెందనున్న వారి వివరాలను సైతం సేకరించాలి. ఏయే శాఖలో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. ఖాళీల వివరాలు వచ్చాక.. వాటిని భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తాం’’ అని కేసీఆర్‌ చెప్పారు. 
 

అన్ని శాఖలకు సీఎస్‌ సమాచారం.. 
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు డిసెంబ‌రు 13 సాయంత్రం అంతర్గత ఉత్తర్వులు ఇచ్చారు. శాఖల వారీగా ఖాళీల వివరాలను అత్యవసరంగా తెలియజేయాలని సూచించారు. దీనికి సంబంధించిన నమూనాను డిసెంబ‌రు 14న‌ అన్ని శాఖలకు అందజేస్తామని తెలిపారు.
 

 

ఇవీ చదవండి...

 

ఇంజినీరింగ్ డిగ్రీతో విప్రో కొలువులు

 

అప్రెంటిస్‌షిప్‌ డిగ్రీలు

Posted Date : 13-12-2020