• facebook
  • whatsapp
  • telegram

బడులు, కళాశాలలు ప్రారంభం

* 7 నెలల ఆలస్యంగా తరగతి గది బోధన

* సురక్షిత దూరం పాటించేలా బెంచీలు

ఈనాడు - హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి బడి బాట పట్టనున్నారు. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్‌ రెండో వారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా 7 నెలలు ఆలస్యంగా తరగతి గది బోధనకు సిద్ధమయ్యాయి. పాఠశాల విద్యలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష తరగతి గది బోధనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీటితో పాటు వైద్య కళాశాలలు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్నాయి. పలువురు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొవిడ్‌ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. బడికి పంపేందుకు తల్లిదండ్రులు సమ్మతి లేఖ ఇస్తేనే లోపలికి అనుమతి ఇస్తారు. ఇప్పటివరకు లేఖ ఇవ్వని వారు ఫిబ్ర‌వ‌రి 1న‌ అందజేసి లోపలికి వెళ్లాలి.

తనిఖీ చేసిన మంత్రులు

రాష్ట్రంలో పాఠశాలలను జ‌న‌వ‌రి 31న‌ పలువురు మంత్రులు, అధికారులు తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అందోలులో సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకులాన్ని పరిలించేందుకు వెళ్లారు. కొవిడ్‌ నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ విద్యాసంస్థలను నడపాలని, నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌లోని సంక్షేమ వసతి గృహాలను మంత్రులు పరిశీలించారు. 2017-18లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటైన 119 బీసీ గురుకుల పాఠశాలలు వచ్చే విద్యాసంవత్సరానికి (2021-22) జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ కానున్నాయని వెల్లడించారు.

వైద్య విద్యార్థులకు ఇలా..

2019-20 సంవత్సరంలో ప్రవేశాలు పొందిన తొలి ఏడాది ఎంబీబీఎస్‌, ఆయుష్‌ విద్యార్థులకు, 2016-17లో ప్రవేశాలు పొంది ప్రస్తుతం తుది సంవత్సరం పూర్తి చేసుకోనున్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి తరగతులు ప్రారంభించనుంది. వీరితో పాటు పారామెడికల్‌ చివరి ఏడాది విద్యార్థులకు, దంత వైద్యవిద్యలో 2019-20లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. 2020-21లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వైద్యకళాశాలలు తెరిచిన వారంలో ఏదో ఒకరోజు కళాశాలకు వచ్చి, తమకు సంబంధించిన సమాచారాన్ని పొందాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్యకళాశాలలో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియా తెలిపారు.

ఏర్పాట్లు.. నిబంధనలు

* పాఠశాలలో తరగతి గదికి 20 మంది విద్యార్థులను.. ఆరడుగుల సురక్షిత దూరం ఉండేలా కూర్చోబెట్టాలి. సర్కారు బడుల్లో ఆ ప్రకారమే బెంచీలు వేశారు.

* మధ్యాహ్న భోజనం, శౌచాలయాలు, చేతులు శుభ్రం చేసుకునే కొళాయిల వద్ద సర్కిళ్లు గీశారు.

* ప్రతి చోటా ఐసొలేషన్‌ గదిని కేటాయించారు. విద్యార్థుల్లో ఎవరైనా కరోనా లక్షణాలను గుర్తిస్తే వెంటనే ఆ గదికి తరలించి తల్లిదండ్రులకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇస్తారు.

రాష్ట్రంలో 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలల్లో ప్రత్యక్ష విద్యాబోధనకు ఆయా సొసైటీలు అవసరమైన చర్యలు చేపట్టాయి. అవసరమైన విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేలా 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.