• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శాస్త్రీయంగా చదివేద్దాం! 

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

ఆయుధాలు మనదగ్గర ఉంటే సరిపోతుందా? లేదు! వాటిని ఎలా నేర్పుగా వినియోగించాలో తెలిసినప్పుడే యుద్ధంలో గెలుస్తాం. అలాగే పోటీ పరీక్షలను ఎంపిక చేసుకున్నాక సరైన విధానంలో చదివినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించే  అవకాశం ఉంటుంది. అంటే ఆయుధాలను వినియోగించే పద్ధతి అన్నమాట. ప్రిపరేషన్‌లో శాస్త్రీయమైన మెలకువలు ఇవిగో!

1. పాఠ్యాంశాల విహంగ వీక్షణం

పోటీ పరీక్షల మొత్తం సిలబస్‌లో ఏ పేపర్లు ఉంటాయి, అందులో ఏయే సబ్జెక్టులుంటాయి.. అనే అవగాహన ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పేపర్‌ని తీసుకుని దానిలో ఉన్న అన్ని  పాఠ్యాంశాలపై స్పష్టత పెంచుకోవాలి. ఆ పాఠ్యాంశాల పేర్లను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే- విందు భోజనానికి వెళ్ళినప్పుడు కనిపించింది ఏదో ఒకటి తినకుండా అసలు ఏయే ఆహార పదార్థాల లభ్యత ఉందో.. ఓసారి అలా చూస్తాం కదా? అప్పుడే తినటంలో దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలో సులభంగా తెలుస్తుంది. 

పోటీ పరీక్షల సంగతి కూడా అంతే! పరీక్షలోని అన్ని పేపర్లలో ఉన్న చాప్టర్ల వారీగా పాఠ్యాంశాల పేరుతో గుర్తు పెట్టుకోవాలి. తరువాత ఒక పేపర్‌ని పరిగణనలోకి తీసుకుని చాప్టర్లు అన్నిటినీ చదవాలా, కొన్నిటిని వదిలివేయవచ్చా అనేది నిర్ణయించుకోవాలి. గ్రూప్‌-2, డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ లాంటి ఆబ్జెక్టివ్‌ పరీక్షల ప్రిపరేషన్లో అయితే అన్ని చాప్టర్లూ చదవాల్సిందే. గ్రూప్‌-1, సివిల్స్‌ లాంటి పరీక్షల్లో అయితే కొన్ని చాప్టర్లను వదిలి వేయవచ్చు. ఈ విధంగా ఒక పేపర్లో చదవాల్సిన పాఠ్యాంశాలు ఏమిటో నిర్ణయించుకోవాలి. అదే సందర్భంలో ఎంపిక చేసుకున్న చాప్టర్‌కి మిగతా పేపర్లలో  అనుసంధానాన్ని చూసుకోవాలి. ఈ విధంగా  పోటీ పరీక్షకు సంబంధించిన అన్ని పేపర్లలోని పాఠ్యాంశాలనూ అవకాశం ఉంటే అనుసంధానం చేసుకుని- అసలు ఏమి చదవాలి అనే విషయంలో అంతిమ నిర్ణయం జరగాలి. తరువాత చదవడం ప్రారంభించాలి. ఇదే విహంగ వీక్షణం!

2. పేపర్‌ను పూర్తిస్థాయిలో చదవాలా?

ప్రిపరేషన్‌లో ఇది విలువైన ప్రశ్నే. సన్నద్ధతకు లభించే మొత్తం సమయంలో కొన్ని రోజుల పాటు ఒక పేపర్‌లో ఉన్న సిలబస్‌ మొత్తాన్ని చదివి పట్టు సాధించుకున్న తరువాత మరో పేపర్‌ లోకి వెళ్ళాలి- అనేది ఈ పద్ధతిలో అనుసరించే వ్యూహం.ఈ పద్ధతి వల్ల అభ్యర్థులకు ఒక పేపర్‌పై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఎటువంటి అవరోధాలూ లేకుండా చదువుతారు. కాబట్టి వేగవంతంగా అధ్యయనం పూర్తవుతుంది. ఒక పేపర్‌లో సాధించిన పట్టు ప్రేరణగా నిలిచి ఇతర పేపర్లను మరింత స్ఫూర్తితో చదివే అవకాశం ఏర్పడుతుంది. సగటు ప్రజ్ఞావంతులు ఈ తరహా ప్రిపరేషన్‌ వల్ల ఎటువంటి తికమక లేకుండా సులభంగా సిద్ధమవుతారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 

అయితే సిలబస్‌ విస్తృతంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి మెరుగైన ఫలితాలను ఇవ్వడం లేదని తేలింది. ఒక పేపర్‌ పూర్తిచేశాక అయిదారు ఇతర పేపర్లను కూడా ముగించి మళ్లీ మొదటి పేపర్‌ అధ్యయనానికి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. దీంతో మొదటి పేపర్లో చదివి జ్ఞాపకంగా ఏర్పరుచుకున్న అంశాలు బలహీనపడుతున్నాయని తేలింది. అందువల్ల ఉన్నత స్థాయి పరీక్షలకు ఈ తరహా చదివే విధానం మెరుగైంది కాదనే అభిప్రాయం ఉంది. పరిమిత సిలబస్‌ ఉన్నప్పుడు మాత్రం తప్పక విజయవంతం అవుతుంది.

3. పేపర్లన్నీ ఒకే సమయంలో...

ప్రతిరోజు సిలబస్‌లో ఉన్న పేపర్లన్నీ చదివే పద్ధతి ఇది. ఈ పద్ధతిలో మొత్తం సమయాన్ని అన్ని పేపర్లకూ విడగొట్టుకోవాలి. ప్రతి పేపర్లో నిర్దేశించుకున్న చాప్టర్‌ని నిర్దేశించుకున్న సమయంలో చదివాలి. ఈ పద్ధతిలో చదువుతున్నప్పుడు వేగవంతంగా అధ్యయనం జరుగుతున్న భావన కలగదు గానీ అన్ని పేపర్లూ చదువుతున్నామనే సంతృప్తి ఉంటుంది. అదేవిధంగా ఏయే పేపర్లలో ఏయే చాప్టర్లను అనుసంధానం చేసుకొని చదవాలనే అవగాహనతోపాటు సమగ్ర పరిజ్ఞానం వస్తుంది. ప్రతి రోజూ సిలబస్‌లో ఉన్న అన్ని పేపర్లనూ చదువుతూ ఉంటారు కాబట్టి పేపర్‌ వారీగా జ్ఞాపకశక్తి కూడా బలంగా ఏర్పడుతుంది. 

విస్తృతమైన సిలబస్‌ ఉన్నప్పుడూ, ఉన్నత స్థాయి పరీక్షలకూ ఇది బాగా అనువైన పద్ధతి. ఒకే పేపర్‌ చదవడంతో పోలిస్తే.. అన్ని పేపర్లూ కలిపే చదివే పద్ధతిలో పేపర్లూ, చాప్టర్లూ మారుతూ ఉన్నందున విసుగుదల తక్కువ. ఈ విధానంలో ప్రజ్ఞావంతులు బాగా రాణించగలరు. సగటు ప్రజ్ఞకు తక్కువ ఉన్నవారు కొంత సందిగ్ధతకు లోనవుతారు. ఏ అంశంపైనా పట్టు సాధించలేకపోతున్నామని బెంబేలెత్తుతారు. పర్యవసానంగా ప్రేరణ కోల్పోయి అధ్యయనం నుంచి బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. అంతిమంగా అభ్యర్థులు వారి ప్రజ్ఞ స్థాయినీ, సమయాన్నీ, పరీక్ష స్థాయినీ, పేపర్‌ స్వభావాన్నీ బట్టి ఏ పద్ధతిలో వెళ్ళాలో నిర్ణయించుకోవాలి.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మార్కులు మాత్రమేనా.. అంతకుమించి!

‣ పక్కా సంసిద్ధత... ప్రేరణ!

Posted Date : 29-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌