• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

6342 పీవో/ ఎంటీ ఖాళీల భర్తీకి ఐబీపీఎస్‌ ప్రకటన

బ్యాంకు కొలువు.. ఎందరో ఉద్యోగార్థుల కల. సాధించదలిచిన లక్ష్యం. ఐబీపీఎస్‌ ప్రకటన రూపంలో వారికో అవకాశం వచ్చిందిప్పుడు. సరైన సన్నద్ధతా వ్యూహం, ప్రణాళికతో సిద్ధమైతే.. ఈ నియామక పరీక్ష పాసవ్వడం అసాధ్యం కాదు. అందుకు ఉపయోగపడే మెలకువలు ఇవిగో! 

వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల నియామకానికి ఐబీపీఎస్‌ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 6432 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐబీపీఎస్‌ ద్వారా నియామకాలు చేపట్టే 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 5 తమ ఖాళీల వివరాలను ఇంకా తెలియజేయలేదు. తుది నియామకాలు జరిపే సమయానికి ఆ బ్యాంకుల్లోని ఖాళీల వివరాలు, ఇప్పటికే వివరాలు తెలిపిన బ్యాంకుల్లో ఏర్పడబోయే అదనపు ఖాళీలతో కలిపి..పోస్టుల సంఖ్య పెరగవచ్చు. ఆగస్టు 22వ తేదీ వరకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకోబోయే అభ్యర్థులందరూ దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ తేదీలోగా వారి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంటుంది. 

తగినంత సమయముంది

ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు, మెయిన్స్‌ పరీక్ష నవంబరులో నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌లో పరీక్ష తేదీలను పేర్కొనకపోయినా ఐబీపీఎస్‌ ఇదివరకు విడుదల చేసిన పరీక్ష క్యాలెండర్‌లో పరీక్ష తేదీలను పేర్కొన్నారు. కాబట్టి ఆ తేదీల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. దాని ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 15, 16, 22 తేదీల్లో, మెయిన్స్‌ పరీక్ష నవంబరు 26వ తేదీన నిర్వహిస్తారు. అంటే ప్రిలిమ్స్‌ పరీక్షకు దాదాపు 10 వారాల సమయం, మెయిన్స్‌ పరీక్షకు 15 వారాల సమయం ఉంటుంది. 

మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు తమ సన్నద్ధతను ఇప్పుడు మొదలుపెట్టినా విజయం సాధించగలిగేంత సమయం ఉంది. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసుకునే అభ్యర్థులకు ఇది చాలా చక్కని అవకాశం.

టెస్టులు చాలా ముఖ్యం

టాపిక్స్‌ నేర్చుకునే క్రమంలో, ఆ తర్వాత పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో టాపిక్‌ వారీ టెస్టులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టాపిక్‌ నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్‌లోని వివిధ స్థాయుల్లోని 20, 25 ప్రశ్నలను సమయాన్ని నిర్దేశించుకుని (10-15 నిమిషాలు) సాధించాలి. ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో గమనించాలి. అవి పెరిగేలా సాధన చేయాలి. ప్రిలిమినరీ పరీక్షకు నెల రోజుల ముందు నుంచీ ప్రతిరోజూ ఒక పూర్తిస్థాయి మోడల్‌ పేపర్‌ను రాయాలి. దాన్ని విశ్లేషించుకుంటే ఎక్కడ మెరుగుపరుచుకోవాలో అర్థమవుతుంది. దాని ప్రకారం సాధనలో మార్పులు చేసుకోవాలి. 

ఇలా ప్రణాళికతో సన్నద్ధం అయితే ఐబీపీఎస్‌ పీఓ పరీక్షలో తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. 

నోటిఫికేషన్‌ ముఖ్య వివరాలు 

పోస్టుల సంఖ్య: 6432

విద్యార్హత (22.08.2022 నాటికి): ఏదైనా డిగ్రీ 

వయసు (01.08.2022 నాటికి): 20 - 30 సం. (జనరల్‌ అభ్యర్థులకు)

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ… అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850 

దరఖాస్తు చివరితేది: 22 ఆగస్టు 2022

ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్‌ 2022

మెయిన్స్‌ పరీక్ష: నవంబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://www.ibps.in/


ప్రణాళికతో సిద్ధం కావాలి

అభ్యర్థులు కేవలం ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించేలా కాకుండా మొత్తం పరీక్ష ప్రక్రియలో నెగ్గేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించేలా సన్నద్ధం కావాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తంగా 4 విభాగాలు, 5 సబ్జెక్టులు ఉన్నాయి. వీటన్నింటికీ మొదటి నుంచీ సన్నద్ధం కావాలి. సబ్జెక్టుల ప్రాధాన్యం, కాఠిన్యం ఆధారంగా రోజులో వాటికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. 

సాధారణంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ విభాగాలకు ఎక్కువ సమయం పడుతుంది. మార్కులు కూడా ఎక్కువే. ఈ రెండు విభాగాల్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ను గుర్తించి వాటిని ముందుగా నేర్చుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ఉన్న ఆప్టిట్యూడ్‌ (మెయిన్స్‌లో ఇది డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) విభాగాల్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలు.... క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, నంబర్‌ సిరీస్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌. మెయిన్స్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (డీఐ) నుంచే ఎక్కువ ప్రశ్నలుంటాయి. వీటన్నింటినీ ముందుగా నేర్చుకుని బాగా సాధన చేయాలి. ఆపై ఒక్కో ప్రశ్న వచ్చే వివిధ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ నేర్చుకోవాలి. పర్సంటేజి, ఏవరేజి, రేషియో-ప్రపోర్షన్, నంబర్‌ సిస్టమ్‌లను ముందుగానే నేర్చుకుంటే డీఐ చాలా సులభమవుతుంది. 

టాపిక్స్‌ అన్నీ పూర్తిగా నేర్చుకున్నాక వాటిని వేగంగా సాధించగలిగేలా బాగా సాధన చేయాలి. ఈ క్రమంలో వివిధ షార్ట్‌కట్‌ పద్ధతులను నేర్చుకుని వినియోగించాలి. కాలిక్యులేషన్స్‌ బాగా వేగంగా చేయగలగాలి. వాటి కోసం వీలైతే స్పీడ్‌మ్యాథ్స్, వేద గణితం లాంటి వేగంగా చేయగలిగే పద్ధతులను నేర్చుకోవాలి. 

రీజనింగ్‌లో ఎక్కువ ప్రశ్నలు సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్‌ నుంచి ఉంటాయి. దాదాపు 50-60 శాతం ప్రశ్నలు వీటి నుంచే ఉంటాయి. వీటితో బ్లడ్‌ రిలేషన్స్‌ కలిపి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ముందుగా దాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ ప్రశ్నలు వచ్చే ప్రాధాన్య క్రమంలోని ఇతర టాపిక్స్‌ను పూర్తిచేసుకోవాలి. 

ఇంగ్లిష్‌ విభాగం ఈ పరీక్షలో చాలా ముఖ్యమైంది. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌ పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ తరహాలో దీని నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో దాదాపు ఒకే విధంగా గ్రామర్‌ ఆధారంగా ఉంటాయి. గ్రామర్‌ తెలిసినప్పుడు సెంటెన్స్‌ కరెక్షన్, ఎర్రర్‌ ఫైండింగ్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, ఫిల్లర్స్, క్లోజ్‌టెస్ట్‌.. లాంటి వాటిని చేయగలిగే వీలుంటుంది. కాబట్టి పాఠశాల స్థాయిలో ఇదివరకే నేర్చుకున్న గ్రామర్‌ను మళ్లీ బాగా చూసుకుని ఈ తరహా ప్రశ్నలన్నీ బాగా సాధన చేయాలి. డిస్క్రిప్టివ్‌ విభాగంలోని లేఖారచన, వ్యాస రచన (లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌)లను ఎక్కువగా సాధన చేయాలి. వివిధ రకాలైన ఉత్తరాలను ఏ విధంగా రాయాలో నేర్చుకోవాలి. ప్రారంభం, ముగింపు, కంటెంట్‌ ఎలా ఉండాలో తెలుసుకోవాలి. వ్యాస రచనకు ఏదైనా టాపిక్‌ను తీసుకుని దాన్ని 150 నుంచి 200 పదాల వరకు ఎలా విస్తరించి రాయాలో నేర్చుకోవాలి. ప్రతిరోజూ కనీసం ఒక లెటర్, ఒక ఎస్సే సాధన చేయాలి. 

ప్రతిరోజూ ఒక పత్రికను తప్పనిసరిగా చదువుతూ వివిధ రంగాలవారీగా ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకోవాలి. దినపత్రికలోని సంపాదకీయాన్ని తప్పనిసరిగా చదవాలి. దీనివల్ల వివిధ విషయాల పట్ల సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఇది ఇంటర్వ్యూకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకోవడం మెయిన్స్‌ పరీక్షలోని జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ విభాగాలకు ఉపయోగపడుతుంది. 

కంప్యూటర్‌పై అవగాహన లేకపోతే ఆ పరిజ్ఞానం పెంచుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల గురించి తెలుసుకోవాలి. ఎంఎస్‌-ఆఫీస్‌ బాగా నేర్చుకోవాలి. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Posted Date : 04-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌