‣ నిపుణుల సూచనలు
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. తర్వాతి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు దేశవ్యాప్తంగా 2,529 మంది ఎంపికయ్యారు. న్యూదిల్లీ కేంద్రంగా త్వరలో వీరికి మౌఖిక పరీక్షలు జరగనున్నాయి. ఈ అభ్యర్థులకే కాకుండా సివిల్స్‌కు సిద్ధమవుతున్నవారికీ, భవిష్యత్తులో రాయబోతున్నవారికీ ఆసక్తికరమైన ఇంటర్వ్యూ స్వరూప స్వభావాలను తెలుసుకుందాం!
సివిల్స్ ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే... ఇది అభ్యర్థి సర్వీసునూ, క్యాడర్‌నూ, జీవిత పర్యంతం కొనసాగే హోదానూ నిర్ణయించగలదు. మొత్తం 2025 మార్కుల్లో ఇంటర్వ్యూకు 275 మార్కులుంటాయి. అంటే మొత్తం పరీక్ష విధానంలో దీని వెయిటేజీ 13.5 శాతం మాత్రమే. అయినప్పటీ మొత్తం అభ్యర్థి యోగ్యతను నిర్ణయించడంలో దీని ప్రభావం 30 శాతానికి పైగానే ఉంటుంది.
గత కొన్ని సంవత్సరాల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల మార్కులను విశ్లేషిస్తే...
‣ టాపర్లు మెయిన్స్‌లో, ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు సాధించారు.
‣ ఇంటర్వ్యూలో కొన్ని మార్కులు అదనంగా సాధించినా.. పది ర్యాంకులకుపైగా మెరుగుదల వస్తుంది.
‣ ఇంటర్వ్యూలో కొన్నిసార్లు 2 నుంచి 3 మార్కులు తగ్గినా.. 3 నుంచి 4 ర్యాంకులు వెనకబడిపోవచ్చు. ఫలితంగా ఐఏఎస్‌కు ఎంపికవ్వాల్సినవారు ఐపీఎస్/ ఐఆర్ఎస్లకు పరిమితం కావాల్సిరావొచ్చు.
ఇటీవలి వరకూ అభ్యర్థులు మెయిన్ పరీక్షను ప్రాంతీయ భాషలో రాసినట్లయితే.. ప్రాంతీయ భాషలోనే ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉండేది. బి.బి.భట్టాచార్య కమిటీ సిఫారసుల ఆధారంగా దీంట్లో మార్పులు చేశారు. 2011 నుంచీ ఏ భాషలో మెయిన్ పరీక్ష రాసినా.. ఇంటర్వ్యూ మీడియాన్ని అభ్యర్థులు నిర్ణయించుకోగలుగుతున్నారు.
ఎలా నిర్వహిస్తారు?
ఐదు నుంచి ఏడు ఇంటర్వ్యూ బోర్డులు ఏక కాలంలో పర్సనాలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తాయి. అభ్యర్థుల సంఖ్య, ఇంటర్వ్యూకు కేటాయించిన సమయం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. ప్రతి బోర్డుకూ యూపీఎస్సీ సభ్యుడు నాయకత్వం వహిస్తారు. దీంట్లో నలుగురు నుంచి ఐదుగురు రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, విద్యావేత్తలు, సైంటిస్టులు, ఇతరులు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యుల పేర్లను సునిశిత పరిశీలన తర్వాతే కమిషన్ నిర్థరిస్తుంది.
ప్రతిరోజూ పదకొండు మందికిపైగా అభ్యర్థులను ప్రతిబోర్డూ ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రతి అభ్యర్థికీ దాదాపు అరగంట సమయం కేటాయిస్తారు. ప్రతి సంవత్సరం ఖాళీల సంఖ్యకు రెండున్నరరెట్ల మందిని ఇంటర్వ్యూ చేస్తారు. సాధారణంగా ఈ ఇంటర్వ్యూలు 9 వారాలపాటు జరుగుతాయి.
యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులూ ఈ ప్రక్రియ మొదలుకావడానికి ముందే.. బోర్డులోని సభ్యులకు ఇంటర్వ్యూ నిర్వహణపై దిశానిర్దేశం చేస్తారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అన్ని బోర్డుల్లో ఒకే విధానం అమలయ్యేలా చూస్తారు. ప్రతి వారం నిపుణులను వేర్వేరు బోర్డుల్లోకి మారుస్తారు.
ప్రశ్నల సరళిలో మార్పు
గత కొన్నేళ్లుగా ప్రశ్నల సరళిలో మార్పు వచ్చింది. అభ్యర్థిలోని నిజమైన వ్యక్తిత్వాన్ని వెలికితీసే దిశగా యూపీఎస్సీ మార్పులు చేసింది. ప్రస్తుతం నిగ్వేకర్ కమిటీ సిఫారసుల ప్రకారం.. అభ్యర్థుల ప్రవర్తన, వైఖరి, విలువల గురించి తెలుసుకునేలా ప్రశ్నలను అడుగుతున్నారు.
ఇంటర్వ్యూ బోర్డు పరిశీలించే కోణాలు
‣ అభ్యర్థికి తన చుట్టూ జరుగుతోన్న ఘటనల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు, క్రీడలు, ఆరోగ్యం.. మొదలైన రంగాల్లో వచ్చే తాజా వార్తల గురించి తెలుసుకుంటున్నాడా? వార్తాపత్రికలూ, మ్యాగజైన్లూ చదివి చుట్టూ జరుగుతోన్న విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నాడా? .
‣ వార్తాంశాలను విశ్లేషించి సరైన నిర్ణయానికి వస్తున్నారా?
‣ నిర్దిష్ట సంఘటనను విడి అంశంగా మాత్రమే నిర్థారణకు వస్తున్నాడా? దాన్ని సాధారణ ట్రెండ్‌లో భాగంగా గుర్తిస్తున్నారా?
‣ ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి తార్కికంగా నిర్థరణకు వస్తున్నారా?
‣ ఏవైనా సలహాలు ఇస్తే వాటి లాభనష్టాల గురించి విశ్లేషిస్తున్నారా? పక్షపాతం లేకుండా హేతుబద్ధమైన తార్కిక ముగింపునకు వస్తున్నారా?
‣ ప్రెజెంటేషన్‌లో తగిన స్పష్టత ఉందా.. లేదా?
‣ సమస్యలను పరిష్కరించడంలో అభ్యర్థి వైఖరి ఎలా ఉంది? ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం, ఆదర్శవాదం, వేతనం తీసుకుంటున్నారు కాబట్టి మొక్కుబడిగా పనిచేసే నైజం... వీటిల్లో ఏది ఉంది?
‣ సమస్యల పట్ల ఎంత వేగంగా స్పందిస్తున్నారు?
‣ సమస్యల గురించి ఆలోచించి, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? లేదా చదివింది యాంత్రికంగా వల్లెవేస్తున్నారా?
‣ తన భావాలను ఒంటరివ్యక్తిగా ఆలోచించి వ్యక్తం చేస్తారా? బృందంలో ఒకరిగా వ్యక్తం చేస్తారా?
‣ మనుషుల మంచితనం మీద నమ్మకం ఉందా? నిర్మాణాత్మకంగా ఆలోచిస్తారా? నిరాశావాదా?
‣ ప్రస్తుత పరిస్థితులకు ఎదురీదుతారా? లేదా మూసధోరణిలో ప్రవర్తిస్తారా?
‣ మొండిగా వ్యవహరిస్తున్నారా లేదా తన దృష్టి కోణాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
‣ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారా.. నిర్లక్ష్యంగానా? లేదా జరగబోయే పరిణామాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారా?
‣ తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదా మొత్తం సమాచారం వచ్చేంత వరకూ నిర్ణయాలు తీసుకోవడాన్ని వాయిదా వేస్తున్నారా?
‣ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారా? లేదా ఆత్మసంతృప్తి కోసం సామాజిక స్పృహతో పనిచేస్తారా?
‣ తన పరిధులను అతిక్రమించి సహాయం చేయడానికి ముందుకు వస్తారా? లేదా గిరి తీసుకుని విధులను నిర్వర్తిస్తారా?
‣ మొత్తానికి అధికారిగా విజయం సాధిస్తారా? ఓటమి చెందుతారా?
ఐదు అంశాల నుంచి....
మౌఖిక పరీక్షలో ఐదు స్థూల విషయాలను ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంటుంది.

1. వ్యక్తిగతం: మీ పేరు, ఏ గ్రామం/ జిల్లాకు చెందినవారు, ఆ ప్రాంతానికి ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యం గురించి అడుగుతారు. ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు... అనే దాని మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
2. విద్యాసంబంధం: ప్రాథమిక విద్యార్హతలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అవి చదివిన కాలానికీ©, ఇంటర్వ్యూ సమయానికీ మధ్య చాలా అంతరం ఉంటుంది కాబట్టి ఈ వివరాలను ముందుగానే మననం చేసుకునివుండటం మంచిది. గ్రాడ్యుయేషన్ కోర్ సబ్జెక్టుల నుంచి ప్రాథమిక స్థాయి ప్రశ్నలు వస్తే చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. చదివిన డిగ్రీతో సంబంధం లేకుండా ఆప్షనల్‌ను ఎంచుకున్నవారు మరింత సమర్థంగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాల్సివుంటుంది.
3. ఆప్షనల్: ఆప్షనల్ సబ్జెకులో మరీ లోతుగా ఉండే ప్రశ్నలను అడగరు. ఎందుకంటే అభ్యర్థులు అప్పటికే మెయిన్ పరీక్షలో పరిజ్ఞానాన్ని నిరూపించుకుని ఉంటారు. ప్రాథమిక ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది.
4. వర్తమానాంశాలు: దీంట్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఏమైనా ఉండొచ్చు. రోజువారీగా వార్తలను విశ్లేషించుకోవడం ఎంతో అవసరం.
5. అభిరుచులు: ఖాళీ సమయంలో మీరేం చేస్తుంటారని అడిగే అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి హాబీలూ లేకపోయినట్లయితే ఆ విషయాన్ని నిజాయతీగా చెప్పేయాలి. హాబీలు ఉన్నట్లయితే వాటి గురించి అడిగే ప్రాథమిక ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
- వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్ 6 సిగ్మా
‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు