• facebook
  • whatsapp
  • telegram

9 ఉద్యోగాలతో శ్రీకాంత్‌.. 8 కొలువులతో ఉదయ్‌హసన్‌

అనతికాలంలోనే సత్తా చాటిన యువకులుఈనాడు, హైదరాబాద్‌: మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతకు భవిష్యత్తుపై ఎన్నో కలలు.. ఆశలు ఉంటాయి. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా చాలామందే ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఒకట్రెండు వైఫల్యాలు ఎదురుకాగానే ‘ఇదంతా మన వల్ల కాదులే’ అనుకుని నిరాశలో కూరుకుపోతారు. ఈ ఇద్దరు యువకులు మాత్రం అందుకు భిన్నం. వైఫల్యాలను సవాలుగా స్వీకరించి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అందులో ఒకరైన శ్రీకాంత్‌ తొమ్మిది కొలువులు సాధించగా.. మరో యువకుడు ఉదయ్‌హసన్‌ ఒకే ఏడాదిలో ఎనిమిది ఉద్యోగాలు సాధించి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


సోదరి కష్టం.. స్నేహితుడి ప్రోత్సాహంతో..

నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన శ్రీకాంత్‌ది మధ్య తరగతి కుటుంబ నేపథ్యం. 2014లో తండ్రి, 2019లో తల్లి మరణించడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అక్క శ్రీలక్ష్మి ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అన్నీ తానై కుటుంబాన్ని నడిపించారు. తన చదువు కొనసాగిస్తూనే..తమ్ముడు శ్రీకాంత్‌నూ చదివించారు. సోదరి ప్రోత్సాహంతో 2020లో ఎంబీఏ పూర్తిచేసిన శ్రీకాంత్‌ 2021లో హైదరాబాద్‌లో బ్యాంకింగ్‌ శిక్షణ కేంద్రంలో చేరారు. తొలి ప్రయత్నంలో రాసిన పరీక్షల ఫలితాలు నిరాశపరిచినా కుంగిపోలేదు. నోటిఫికేషన్‌ వచ్చిన ప్రతి పరీక్ష రాస్తూ వచ్చారు. 2022లో సౌత్‌ ఇండియా బ్యాంకు(ప్రయివేటు)లో ఉద్యోగం రాగా చేరిపోయారు. ఏడు నెలల తర్వాత రాజీనామా చేసి మళ్లీ సాధన మొదలుపెట్టారు. 2022లోనే రెండు ఉద్యోగాలు సాధించినా వాటిలో చేరలేదు. 2023లో విడుదలైన అనేక నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు రాశారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా ఏడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్రెడిట్‌ ఆఫీసర్‌, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో అకౌంటెంట్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఫైనాన్స్‌ ఎకౌంట్స్‌ స్పెషలిస్ట్‌), ఐబీపీఎస్‌ క్లర్క్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు పీవో (ప్రయివేటు), కరీంనగర్‌ డీసీసీబీలో క్లర్క్‌, ఆర్‌ఆర్‌బీ(రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) పీవో, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ కొలువులు సాధించారు. ‘‘ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో చేరాలని ఉంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఆర్బీఐ అసిస్టెంట్‌ తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అవీ వెల్లడైన తర్వాత ఎందులో చేరాలో నిర్ణయించుకుంటానని’ శ్రీకాంత్‌ తెలిపారు. తన ఉద్యోగ ప్రయత్నంలో అక్క శ్రీలక్ష్మితోపాటు స్నేహితుడు శ్రీశైలం అండగా ఉండి మార్గదర్శనం చేశారని, తన విజయం వెనుక వారి ప్రోత్సాహం ఉందన్నారు.


తొలి ప్రయత్నం నిరాశపరిచినా...

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉదయ్‌హసన్‌ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి నాగేశ్వర్‌రావు ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి సృజనకుమారి గృహిణి. అంతంతమాత్రంగా ఉన్న తండ్రి సంపాదనతో ఇల్లు గడిచేది. తాను ఉన్నత స్థానానికి చేరుకుంటే తప్ప కుటుంబ ఆర్థిక పరిస్థితి మారదనే అభిప్రాయాన్ని బలంగా మనసులో నాటుకున్న ఉదయ్‌హసన్‌ కష్టపడి చదివారు. 2022లో బాసర ట్రిపుల్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేశారు. వెనువెంటనే బ్యాంకు ఉద్యోగ సాధన లక్ష్యంతో శిక్షణ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. చేరిన మొదటి సంవత్సరంలోనే ఎనిమిది నోటిఫికేషన్లు రాగా..అన్నీ రాశారు. 2022 ‘ఎస్‌బీఐ పీవో’ ఉద్యోగ పరీక్షలో ర్యాంకు సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తుది ఫలితాల్లో నిరాశ ఎదురైనా వెనకడుగు వేయలేదు. 2023లో క్లరికల్‌, పీవో, ఇన్సూరెన్స్‌ సంస్థలకు సంబంధించి ఎనిమిది నోటిఫికేషన్లు రావడంతో ఉత్సాహం రెట్టింపయింది. మరింత శ్రమించారు. ఇందులో ఏడు ఉద్యోగాలు(ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌, ఆర్‌ఆర్‌బీ పీవో, ఏపీజీవీబీలో క్లర్క్‌, ఆర్బీఐ అసిస్టెంట్‌, ఎస్బీఐ పీవో, ఐబీపీఎస్‌ పీవో(కెనరా బ్యాంకు), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(క్లర్క్‌) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ‘వీటితోపాటే న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ తుది ఫలితాల్లో ఉద్యోగం సాధించానని, ఆ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులో ఇటీవలే చేరిపోయానని’ ఉదయ్‌హసన్‌ తెలిపారు. దీన్ని కొనసాగిస్తూనే ఆర్బీఐ గ్రేడ్‌-బి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని, దాన్నీ నెరవేర్చుకుంటానని ధీమా వ్యక్తంచేశారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Posted Date: 03-04-2024


 

ఇత‌రాలు

మరిన్ని