• facebook
  • whatsapp
  • telegram

అమెరికాలో విద్యకు అడుగువేసే ముందు!

పరిశీలించాల్సిన పలు అంశాలు

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులను మొదట ఆకర్షించే దేశం- అమెరికా! ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అక్కడ చదువుకుని స్థిరపడాలనుకుంటారు, వారిలో తెలుగు విద్యార్థుల సంఖ్యా తక్కువేం కాదు. మరి అక్కడికి వెళ్లాలనుకునే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా.. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందామా?

అమెరికాలో దాదాపు 4 వేలకుపైగా విద్యాసంస్థలు ఉన్నాయి. వీటి నుంచి విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న టాప్‌ 1000 యూనివర్సిటీలను లెక్క తీస్తే అందులో దాదాపు 60 శాతం విద్యాసంస్థలు అమెరికాలోనే ఉన్నాయి, ఈ విషయం చాలు.. అక్కడ దొరికే విద్యానాణ్యతను అంచనా వేయడానికి! అంతేకాదు, విద్యార్థులు తాము చదవాలనుకుంటున్న కోర్సుల స్పెషలైజేషన్లు తామే ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. నచ్చినవి మాత్రమే చదువుకునే అనుకూలత ఇక్కడ చెప్పుకోదగిన విషయం. 

యూనివర్సిటీని బట్టి అమెరికాలో ట్యూషన్‌ ఫీజు రూ.8 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఉంటుంది. సగటున అక్కడ ఉండేందుకు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఖర్చవ్వొచ్చు. ఈ ఖర్చుల స్థాయి విద్యార్థి ఉంటున్న ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 

రిసెర్చ్‌ ఓరియంటెడ్‌ ప్రోగామ్స్‌కు యూఎస్‌ఏలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. చదువుకుంటూ యూనివర్సిటీలోనే పార్ట్‌ టైం జాబ్‌ చేసేందుకు విద్యార్థులకు బోలెడు అవకాశాలు. అంతేకాకుండా, అక్కడ డిగ్రీ అందుకున్న విద్యార్థులు అక్కడే కొంతకాలంపాటు పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇలా చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగంలో చేరాక సగటున ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ జీతం పొందవచ్చు.

అమెరికాలోని విద్యాసంస్థల్లోకి ప్రవేశాలు ప్రధానంగా ఏడాదికి మూడు సీజన్లలో జరుగుతాయి. అవి..

1. ఫాల్‌ ఇన్‌టేక్‌: ఇది ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకూ ఉండే సీజన్‌. మొత్తం ప్రవేశాల్లో ఇదే ప్రధానమైన ఇన్‌టేక్‌. ఈ సమయంలోనే అక్కడ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది.

2. స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌: ఇది సాధారణంగా జనవరిలో మొదలవుతుంది. దీన్ని కూడా ప్రధానమైన సీజన్‌గా చెబుతారు. చాలా కోర్సులు ఈ సమయంలో ప్రారంభమవుతాయి.

3. సమ్మర్‌ ఇన్‌టేక్‌: ఈ సీజన్‌ ఏటా మే లేదా జూన్‌ నెలల్లో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొన్ని కోర్సులు మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉండటం వల్ల దీన్ని మైనర్‌ ఇన్‌టేక్‌గా చెబుతారు.

దరఖాస్తు - పరీక్ష సన్నద్ధత

1. ఎంచుకున్న కోర్సును అనుసరించి రాయాల్సిన పోటీ పరీక్షలు ఏంటో ముందుగా చూడాలి. అలాగే ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షలు కూడా ఏం రాయాలి అనేది నిర్ణయించుకోవాలి.

2. సాధారణంగా టెక్నికల్‌ కోర్సులకు ఎస్‌ఏటీ/ జీఆర్‌ఈ అవసరం అవుతాయి (ఎస్‌ఏటీ అండర్‌గ్రాడ్యుయేట్‌ - జీఆర్‌ఈ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు). బిజినెస్‌ స్కూల్స్‌ అందించే మేనేజ్‌మెంట్‌ డిగ్రీలకు జీమాట్‌ రాయాల్సి ఉంటుంది.

3. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్, డీఈటీ/ పీటీఈ రాయాలి.

4. ఇన్‌టేక్‌ సమయానికి కనీసం 8 లేదా 9 నెలల ముందే ఈ పరీక్షలు అన్నీ పూర్తిచేయడం మంచిది. దానివల్ల దరఖాస్తు ప్రక్రియలకు ఎటువంటి హైరానా లేకుండా సులభంగా చేసుకునే వీలు కలుగుతుంది.

యూనివర్సిటీలు - కోర్సులు

విద్యార్థి బడ్జెట్‌ని బట్టి యూనివర్సిటీని ఎంచుకోవడం మంచిది. దానివల్ల ఖర్చులు కాస్త అదుపులో ఉంటాయి.

టైర్‌ 1 రిసెర్చ్‌ యూనివర్సిటీల్లో పరిశోధన అవకాశాలతోపాటు అసిస్టెంట్‌షిప్స్‌ లభించే అవకాశాలు అధికం. వీటిల్లో ఏడాదికి ట్యూషన్‌ ఫీజు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఉంటుంది.

టైర్‌ 2 రిసెర్చ్‌ యూనివర్సిటీల్లోనూ అధిక రిసెర్చ్‌ యాక్టివిటీతోపాటు ఏడాదికి ట్యూషన్‌ ఫీజు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఉంటుంది. 

టైర్‌ 3 రిసెర్చ్‌ యూనివర్సిటీల్లో మిగతా వాటితో పోలిస్తే తక్కువ రిసెర్చ్‌ యాక్టివిటీ ఉంటుంది. వీటిలో ఏడాదికి ట్యూషన్‌ ఫీజు రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఉంటుంది. 

అధికశాతం విద్యార్థులు అమెరికాలో తూర్పు, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీలను ఎంచుకుంటూ ఉంటారు. అక్కడ వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటం, మంచి ఉద్యోగావకాశాలు లభించడమే ఇందుకు కారణం. 

కొన్ని యూనివర్సిటీలు ‘పాథ్‌వే ఆప్షన్స్‌’ కూడా అందిస్తాయి. నచ్చిన యూనివర్సిటీలో సీటు కోరి, అందుకు తగిన అకడమిక్‌ అర్హత లేని విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి. అవి పూర్తిచేశాక వారు చదవాలనుకున్న కోర్సులో చేరవచ్చు.

వీసా

యూఎస్‌ఏలో చదువుకునేందుకు విద్యార్థులు ఎఫ్‌1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. 

ఇందుకు రూ.13,242 ఫీజు చెల్లించి యూఎస్‌ ఎంబసీతో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. 

మొత్తం 2 అపాయింట్‌మెంట్లు ఉంటాయి, ఒకటి బయోమెట్రిక్స్‌ కోసం, రెండోది ముఖాముఖి ఇంటర్వ్యూ కోసం. 

ఒక ఏడాదికి సరిపోయేలా ట్యూషన్‌ ఫీజు, ఖర్చుల డబ్బు విద్యార్థి వద్ద నిల్వ ఉన్నట్లుగా రుజువు చూపించాలి.

ఉద్యోగావకాశాలు

స్టూడెంట్‌ వీసాతో ఉన్నప్పుడే అక్కడ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. 

సీపీటీ (సర్క్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)కు దరఖాస్తు చేసుకోవచ్చు. 

విద్యార్థి చదివిన కోర్సును బట్టి ఏడాది నుంచి మూడేళ్ల వరకూ పనిచేసేలా అనుమతి లభిస్తుంది. 

ఉదాహరణకు విద్యార్థి చదివిన డిగ్రీ స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌) అయితే వారికి మూడేళ్ల పని అనుమతి లభిస్తుంది. ఒక ఏడాది - ఓపీటీ, రెండేళ్లు - ఓపీటీ స్టెమ్‌ ఎక్స్‌టెన్షన్‌.

దరఖాస్తులు

చాలా యూనివర్సిటీలు కోర్సు ప్రారంభానికి ముందు 6 నెలలపాటు దరఖాస్తులను స్వీకరిస్తాయి. 

ఐ-20, వీసా ప్రక్రియలు పూర్తి చేసేందుకు తగిన సమయం ఉండేలా ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయడం మంచిది.

త్వరగా దరఖాస్తు చేస్తే స్కాలర్‌షిప్‌ వచ్చేందుకు అవకాశం అధికం. 

టెస్ట్‌ స్కోర్లు అధికారికంగా తెలియజేయడం యూఎస్‌ఏ యూనివర్సిటీలకు తప్పనిసరి.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌!

‣ ఇంటర్‌ తర్వాత ‘నెస్ట్‌’!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?

‣ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు

Posted Date : 28-02-2023


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం