• facebook
  • whatsapp
  • telegram

సంఘటితమైతేనే సాగు బాగు

ఎఫ్‌పీఓలతో రైతులకు మేలు

ఉత్పత్తి ఖర్చులో సగం సైతం దక్కని ధరలతో రైతులు నష్టాల సేద్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టానికి గిట్టుబాటు లభించనప్పుడు రైతులు సేద్యంపై భరోసా కోల్పోతారు. మార్కెట్ల గమనం, ధరల స్థితిగతులు, సరఫరా, గిరాకీ వ్యత్యాసాలను తెలుసుకునే తెలివిడి భారతీయ కర్షకులకు లేదు. ఈ కారణంగానే తాను పండించిన పంటకు ధర తానే నిర్ణయించలేని నిస్సహాయస్థితిలోకి రైతు కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల్ని అధిగమించి సేద్యాన్ని ఒక పరిశ్రమగా నిలబెట్టాలంటే రైతులకు సాగు మెలకువలతో పాటు మార్కెట్‌ నైపుణ్యాలను నేర్పించాలి. అంకుర పరిశ్రమల ఏర్పాటుతో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో రైతుల్ని ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓలు)గా ఏర్పరచి వాటితో అనుసంధానించగలిగితే సేద్యంలో సరికొత్త విప్లవం సుసాధ్యమవుతుంది.

అంకుర సంస్థల తోడ్పాటు

ఒక ఉత్పత్తి రైతు నుంచి వినియోగదారుకు చేరే క్రమంలో అనేక రెట్లు అధిక ధర పలుకుతోంది. అందులో రైతుకు దక్కుతున్నది 30శాతమే. 70శాతం దళారులకే పోతోంది. పంటకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు, పనిముట్ల విషయంలోనూ డీలర్ల ప్రమేయం లేకుండా నేరుగా ఎఫ్‌పీఓలు రైతుల అవసరాలకు అవసరమైన ఉత్పత్తులను నేరుగా కంపెనీలతో మాట్లాడి తెప్పించుకుంటాయి. దానివల్ల డీలర్లకు పోయే కమిషన్‌ రైతులకు మిగులుతుంది. నాసిరకాలు, నకిలీల బెడదా తప్పుతుంది. రైతులు నేరుగా ఉత్పత్తిని వినియోగదారులకు అందించడం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా ఇరువురికీ లాభదాయకంగా ఉంటుంది. దానివల్ల దళారులకు వెళ్ళేదానిలో రైతుకు 65శాతం దక్కితే, వినియోగదారుకు 35శాతం తక్కువ ధరకే సరకు అందే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి మండలంలో ఒక పంటను అధికంగా సాగు చేస్తున్న రైతులను ఒక ఛత్రం కిందకు తీసుకొచ్చి వారితో ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలి. మన రైతులకు పంటలు పండించే విషయంలో శాస్త్రవేత్తలతో సమానమైన అనుభవం ఉంది. లేనిదల్లా పంటను విక్రయించుకోవడంలో నైపుణ్యమే. కొత్త మార్కెట్ల అన్వేషణ, మంచి ధరను పొందడం, ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు చేరవేసే సాంకేతికత అందుబాటు వంటివన్నీ బడుగు రైతులకు ఏటికేడు సవాలుగా నిలుస్తున్నాయి. భారీ ఖర్చుతో కూడిన ఈ సాంకేతిక సేవలను పేద రైతులు వినియోగించుకునే స్థితిలో లేరు. పంట చేతికందే సమయంలో రైతుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకపోతేనే మెరుగైన ధర కోసం నిరీక్షిస్తాడు. కానీ, 70శాతం కర్షకులు తెచ్చిన అప్పును వెంటనే తీర్చాల్సిన దుస్థితిలో ఉండటంవల్లే పంటను అయినకాడికి తెగనమ్ముకోవాల్సి వస్తోందన్నది పలు సర్వేల సారాంశం. దశాబ్దాలుగా కౌలుదారులు సహా సాగు చేసే ప్రతి రైతుకూ పంట రుణం అందించలేని ప్రభుత్వ వైఫల్యంవల్లే ఈ సమస్య పట్టిపీడిస్తోంది. ఏ జాడ్యాలకు శాశ్వత పరిష్కారం చూపితే రైతుల పరిస్థితులు మెరుగుపడతాయో పాలకులకు తెలియనిది కాదు. అటువంటి ప్రణాళికలపై ప్రభుత్వాలు సరిగ్గా దృష్టి సారించడంలేదు.    

ఐక్యంగా నిలవాలి

మద్దతు ధరలు దక్కడం లేదంటూ పంట ఉత్పత్తులను రోడ్లపై పారేయడం లేదా పొలాల్లోనే కాల్చేయడం తరచూ చోటుచేసుకుంటున్న దయనీయ ఉదంతాలు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకూడదంటే... ధర నిర్ణయం విషయంలో వ్యాపారులెంత సంఘటితంగా ఉంటారో- రైతులూ అంతే ఐక్యంగా నిలవాలి. రైతులు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని చేపట్టగలిగితే ధరలు పతనమైనప్పుడల్లా ఆవేదన చెందాల్సిన అవసరం ఉండదు. అందుకు వారు చేయాల్సిందల్లా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడటమే. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో నేడు అటువంటి సంఘాలు సేద్యంలో విప్లవం సృష్టిస్తున్నాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం బెంగళూరులో రైతులంతా ‘సఫల్‌’ సంఘంగా ఏర్పడి ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతున్నారన్న విషయాన్ని కథలుగా చెప్పుకొన్నారు. నేడు అటువంటి సంఘాలు దేశంలో పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చాయి. అవి తమ ఉత్పత్తులకు సొంత బ్రాండ్‌ ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ విపణులకు సరకుల్ని సరఫరా చేయగలుగుతున్నాయి. ఆయా పంటలను విస్తృతంగా పండించే ప్రాంతాల్లో ఇలాంటి సంఘాలు ఏర్పడితే ఉప ఉత్పత్తుల తయారీకి మార్గం సుగమమవుతుంది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా- రైతుల సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉండటం దురదృష్టకరం. గ్రామాలవారీగా రైతులు సంఘాలుగా ఏర్పడితే వచ్చే ప్రయోజనాలు అనంతం. ఇందుకు అంకుర సంస్థలు ఎంతో మేలు చేస్తాయి. ఎఫ్‌పీఓలను అంకుర సంస్థలతో అనుసంధానిస్తే సేద్యంలో సరికొత్త విప్లవం ఆరంభమైనట్టే. జాతీయ నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా రైతుల్ని సాగు నిపుణులుగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం స్వాగతించదగింది. వాటికితోడు కేంద్రం ఎఫ్‌పీఓల ఏర్పాటును విశేషంగా ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం మరింత చొరవ ప్రదర్శించాలి. రైతుల్లో నైపుణ్యాలనూ పెంపొందించేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తీసుకుంటే సత్ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా పంటల సాగుతోపాటు పాడి, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగల పెంపకం వంటివాటిని ప్రోత్సహిస్తే రైతులకు స్థిరమైన ఆదాయాలు అందుతాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి జిల్లాలో ఒకటి రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకేలు) ఉన్నాయి. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగల వీలుంది.

పరిశ్రమగా సేద్యం

వ్యవసాయానికి వాణిజ్యపరంగా ఉన్న అవకాశాలను అంకుర సంస్థలు గుర్తించాయి కాబట్టే- నేడవి సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు విలువ జోడింపు, సేద్యంలో సాంకేతికత వినియోగంతో మంచి దిగుబడులు రాబట్టగలుగుతున్నాయి. ఎగుమతి వ్యూహాలను అనుసరిస్తున్న కొన్ని అంకుర సంస్థల కృషి మరెందరికో స్ఫూర్తినిస్తోంది. వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్రీయ వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని మూడేళ్ల క్రితమే కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగా రైతుల తోటలకు సమీపంలో ఉప ఉత్పత్తులను తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయించాలని భావించింది. ఆ దిశగా అడుగులు మరింత వేగంగా పడాల్సిన అవసరముంది. అంకుర సంస్థలు పలు రకాల సేవలు అందిస్తున్న తరుణంలో వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం కష్టమైన పనేమీ కాదు. సంఘటితంగా ఉంటే రైతులు బహుముఖ సేవలను అందుకోగలుగుతారు. దాంతో లాభాలు రెట్టింపవుతాయి. ఆయా పంటల నుంచి విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ ఊపందుకొని సేద్యం ఒక పరిశ్రమగా మారుతుంది. అప్పుడు నిరక్షరాస్యులైన గ్రామీణ రైతులు సైతం లబ్ధి పొందుతారు. అప్పుడే నిజమైన సంక్రాంతి వైభవాన్ని మనం పల్లెల్లో చూడగలుగుతాం.

 

- అమిర్నేని హరికృష్ణ

Posted Date: 17-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం