• facebook
  • whatsapp
  • telegram

సాగులో డ్రోన్ల సాయం

పెరుగుతున్న వినియోగం

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ, అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే డ్రోన్ల సహాయంతో ‘స్మార్ట్‌ సాగు’ వైపు పయనిస్తున్నాయి. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది. 2022-23 బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. అందులో భాగంగా కిసాన్‌ డ్రోన్లను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీ ఇటీవల దేశంలోని 100 ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు చల్లేందుకే కాకుండా- రానున్న రోజుల్లో రైతులు తమ పంట ఉత్పత్తులను తక్కువ సమయంలోనే మార్కెట్లకు తరలించవచ్చునన్న ప్రధాని మాటలు డ్రోన్ల ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. భారత్‌లో డ్రోన్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం వందల సంఖ్యలో అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో 20 సంవత్సరాలుగా వ్యవసాయ డ్రోన్లను ఉపయోగిస్తున్నా గత అయిదారేళ్లుగా వీటి వినియోగం వేగంగా పెరుగుతోంది.

ప్రయోజనాలెన్నో...

మనదేశంలో వ్యవసాయ భూమి దాదాపు 16 కోట్ల హెక్టార్లు. దేశ జనాభాలో 56శాతం వ్యయసాయరంగంలో పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయంలో ఉన్న ప్రజలు 15-20శాతం మాత్రమే. సగటు కమతాల పరిమాణం, పంటల ఉత్పాదకత అక్కడ మనకంటే ఎక్కువే. దీనికి కారణం సాగులో యాంత్రీకరణ, సాంకేతికతను ఉపయోగించడమే. ఇందులో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి నేల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి, పంటను పర్యవేక్షించడానికి, నీటి పారుదలను సమర్ధంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి. పంటలకు సోకే చీడ పీడలను ముందుగానే పసిగడతాయి. మెరుగైన సెన్సార్లను ఉపయోగించి మట్టిలో నైట్రోజన్‌ స్థాయులను పర్యవేక్షించవచ్చు. కెనడాలో విత్తనాలను నాటడానికీ డ్రోన్లు వాడుతున్నారు. డ్రోన్‌ సాంకేతికతలో కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా రైతులు ఇంటి వద్దే ఉండి పొలంలోని పంటను, దూర ప్రాంతాల్లో ఉన్న తోటలను పర్యవేక్షించవచ్చు. అటవీ జంతువుల నుంచి పైరును కాపాడుకోవచ్చు. పశువులు తప్పిపోయినప్పుడు వెతికేందుకూ సహాయ పడతాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్లసాయంతో మందులను పొలంలోని మొక్కలకు సమపాళ్లలో చల్లవచ్చు. ఉద్యాన పంటలకు ఇవి మరింత ప్రయోజనకరం. మామిడి, కొబ్బరి వంటి ఎత్తు ఎక్కువగా ఉండే తోటలకు సమర్థంగా పురుగుమందులు పిచికారీ చేయవచ్చు. జపాన్‌లో శాస్త్రవేత్తలు తేనెటీగల మాదిరిగా పూలను పరాగసంపర్కం చేసేందుకు అతి చిన్న డ్రోన్‌లను రూపొందించారు. వాటిలో జీపీఎస్‌ను ఉపయోగించారు. కాలుష్యం పెచ్చరిల్లడంతో పాటు పలు కారణాల వల్ల తేనెటీగలు క్రమంగా క్షీణిస్తుండటంతో భవిష్యత్తులో డ్రోన్లు పరాగ సంపర్కానికి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కువగా చైనా, అమెరికా, జపాన్‌, స్పెయిన్‌, బ్రెజిల్‌లలో వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మందులను, ఆహార పదార్థాలను నేరుగా ఇళ్లకే పంపేందుకు కొన్ని సంస్థలు డ్రోన్‌లను వాడుతున్నాయి. అలాగే రైతులు కూరగాయలు, పండ్లు సహా వివిధ ఉత్పత్తులను ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు వాడుకోవచ్చు. దీనిపై అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.

ఆటంకాలను అధిగమించాలి

వ్యవసాయ డ్రోన్లవల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ- భారత్‌లో వాటిని రైతులు ఉపయోగించడానికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ దాదాపు 80శాతం చిన్న, సన్న కారు రైతులే. వాటిని కొనుగోలు చేయడం వారి శక్తికి మించిన పని. డ్రోన్లు పూర్తిగా సాంకేతికత ఆధారంగా పనిచేస్తాయి. దాన్ని అన్నదాతలు ఆకళింపు చేసుకొని ఉపయోగించడం అంత సులభం కాదు. పైగా వారికున్న కమతాల పరిమాణం సైతం తక్కువ కాబట్టి డ్రోన్ల వినియోగంవల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుందా అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. డ్రోన్ల వాడకం పెరిగితే వ్యవసాయ కూలీల ఉపాధికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా డ్రోన్లను ఉపయోగించడం, లైసెన్సింగ్‌, మరమ్మతులు, నిపుణులు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు రైతులకు ప్రతిబంధకంగా మారకూడదు. చిన్న రైతులకు అందుబాటులో ఉంచేందుకు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలి. ఔత్సాహిక రైతులకు వీటి వినియోగంపై శిక్షణ ఇప్పించాలి. పెట్టుబడి ఖర్చును తగ్గించేందుకు, దిగుబడి పెంచేందుకు డ్రోన్ల వాడకం అనేది ఓ చక్కని పరిష్కారంగా ఉన్నప్పుడు మాత్రమే అన్నదాతలు వాటిని వాడేందుకు ముందుకొస్తారు.

- డి.సతీష్‌బాబు

Posted Date: 03-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం