• facebook
  • whatsapp
  • telegram

రైతుల ఆర్థికాభివృద్ధికి మార్గం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దక్కే ప్రతిఫలంపైనే రైతుల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేకపోవడం కర్షకులకు పెద్ద సమస్యగా మారుతోంది. వారికి సంబంధించిన ఎన్నో సమస్యలకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) పరిష్కారంగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వాలు వడ్లు, గోధుమలు వంటి ఆహార ధాన్యాలనే కొనుగోలు చేస్తున్నాయి తప్పించి, మిగతా పంట ఉత్పత్తుల గురించి పట్టించుకోవడం లేదు. కొన్ని పంటలకు మద్దతు ధరలను ప్రకటించి ఊరుకుంటున్నాయి. ఫలితంగా వ్యవసాయ మార్కెటింగ్‌లో మధ్యవర్తుల గొలుసు వేళ్లూనుకుపోయింది. దళారి వ్యవస్థతో అటు అన్నదాతలు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోగా, ప్రజలకూ సరసమైన ధరలకు సరకులు లభించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రారంభించినవే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ). రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఇదో కీలకమైన ముందడుగు. 2021 జులై వరకు 16,811 ఎఫ్‌పీఓలు నమోదయ్యాయి. అయిదువేలకు పైగా మాత్రమే ఉనికిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డు, ఇతర సంస్థల ప్రోత్సాహంతో అవి ఏర్పాటయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం వంద నుంచి వెయ్యి మంది దాకా రైతులు వాటాదారులుగా కార్యకలాపాలను ప్రారంభించాయి.

విశేష సేవలు

కేంద్రం 2018-19 బడ్జెట్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రోత్సాహానికి పలు చర్యలను ప్రకటించింది. అప్పటి నుంచి అయిదు సంవత్సరాల్లో కొత్తగా 10 వేల ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్తగా ఏర్పాటైన వాటికి కొన్నేళ్లపాటు పన్ను మినహాయింపు సహా పలు ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. పంటల సేకరణ మొదలు వాటి శుద్ధి సహా మార్కెటింగ్‌ వరకు వివిధ కార్యకలాపాల ద్వారా ఎఫ్‌పీఓలు రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేసి ఎక్కువమంది రైతులను వాటి పరిధిలోకి తెస్తే ప్రయోజనం ఉంటుంది. కర్షకులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి రైతు ఉత్పత్తి కంపెనీలను ఏర్పాటు చేసుకునేందుకు కలిసిరావాలంటూ ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ పిలుపిచ్చారు. ఇవి సొంతంగా శీతల గిడ్డంగులను సైతం నిర్మించుకోవచ్చని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌, ఎగుమతుల కోసం రైతులు తమ సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వంపై ఆధారపడవద్దని సూచించారు. దేశంలో ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులే. ఆర్థిక బలం లేకపోవడంతో వారు తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడంలో పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పంటల సాగు దశలో సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటికోసం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎఫ్‌పీఓల ద్వారా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో సభ్యత్వం కలిగిన కర్షకులకు యంత్రాల కొనుగోలు, పంట రుణాలు, పురుగు మందులు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రత్యక్ష మార్కెటింగ్‌ వంటి సేవలను అందిస్తాయి. కర్షకులకు బేరమాడే శక్తిని కలిగిస్తాయి. పారదర్శక వ్యవసాయ మార్కెట్‌ను సృష్టిస్తాయి. రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేత కార్మికులు, హస్తకళాకారులు తదితరులతో ఏర్పాటయ్యే సంస్థలు వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలను సైతం నిర్వహించవచ్చు. ప్రభుత్వం వాటిని కంపెనీ చట్టం కింద నమోదు చేస్తోంది. నాబార్డు అనుబంధ సంస్థ ‘నాబ్‌కిసాన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌’ ఎఫ్‌పీఓల రుణ అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటైంది. బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి కూడా రుణాలు పొందవచ్చు. వాటికి మద్దతు ఇవ్వడానికి కేంద్రం ఈక్విటీ గ్రాంట్‌ ఫండ్‌, క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ తదితర పథకాలను తీసుకొచ్చింది.

తప్పని సవాళ్లు

ఎన్ని రకాల వెసులుబాట్లు కల్పించినా ఎఫ్‌పీఓలకు సవాళ్లు తప్పడం లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలతో సభ్యులకు సమర్థంగా సేవలు అందించలేకపోతున్నాయి. పంట ఉత్పత్తులను వేరుచేయడం, ప్యాకింగ్‌, నిల్వ, రవాణా సౌకర్యాలతోపాటు మౌలిక వసతుల కల్పన భారంగా మారింది. పర్యవేక్షణ, నియంత్రణ కోసం అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన, వృత్తిపరంగా అర్హత కలిగిన సిబ్బంది అవసరం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వారు అందుబాటులో ఉండటం లేదు. ఉత్పత్తులను లాభదాయక ధరలకు మార్కెటింగ్‌ చేయడం కీలకం. ఇందుకు పెద్ద రిటైలర్లు, వ్యాపారులతో అనుసంధానత అవసరం. వ్యవసాయానికి సంబంధించి పలు పథకాలను సైతం ప్రభుత్వం వాటి ద్వారా అమలు చేయవచ్చు. రైతులకు ఎఫ్‌పీఓలపై అవగాహన కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఇలాంటి సంస్థలను మరింతగా అభివృద్ధి పరచాలి. ఎక్కువ మంది రైతులు భాగస్వాములయ్యేలా చూడాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సమర్థంగా పనిచేస్తే రైతుల ఆదాయాన్ని, వ్యవసాయ వృద్ధిని పెంపొందించడానికి ఎఫ్‌పీఓలు సహాయ పడతాయనడంలో సందేహం లేదు!

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమర్కండ్‌లో భారత్‌ సహకార నినాదం

‣ మానవ హక్కులను కాలరాస్తున్న చైనా

‣ స్వేచ్ఛాహననంపై ఆగ్రహజ్వాల

‣ సాగుభూమికి రసాయనాల ముప్పు

‣ మనోవర్తి... గౌరవ జీవన హక్కు!

Posted Date: 27-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం