• facebook
  • whatsapp
  • telegram

సేంద్రియ సేద్యం... భూసారం పదిలం!

సహజ వనరుల్ని పరిమితికి మించి వాడుకుంటే దుష్ఫలితాలు తప్పవు. భూక్షయాన్ని నివారించకపోతే ఆహారోత్పత్తి క్షీణించే ముప్పుంది. భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచడమే పరిష్కారం. సేంద్రియ సాగు విధానాలను ఆచరించడం, విరివిగా చెట్లు పెంచడం అత్యంత ఆవశ్యకం. నేలకు పునరుజ్జీవనాన్ని కల్పించడం, భూసారాన్ని పరిరక్షించడం తక్షణావసరం. భవిష్యత్‌ వ్యవసాయం ముందున్న సవాళ్లివే!

దేశంలో హరిత విప్లవం తరవాత అవసరాలకు మించి ఆహార ధాన్యాలు ఉత్పత్తవుతున్నాయి. కేవలం ధరల్ని దృష్టిలో ఉంచుకుని అధికోత్పత్తులు ఇచ్చే వరి, గోధుమ వంటి పంటలవైపే మొగ్గు చూపుతున్నారు. మద్దతు ధరలు కూడా వాటికే ఉండటంతో సాగు ఏటికేడూ పెరుగుతోంది. తద్వారా పంటమార్పిడికి అవకాశం సన్నగిల్లుతోంది. రైతులు నిరవధికంగా ఒకే పంటను వేస్తూ పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు నేల స్వభావంపై పెను ప్రభావం చూపుతున్నాయి. వరస పంటల కోసం పదే పదే దున్నడం, లోతుగా దున్నడం, విత్తడం వల్ల నేలకు విశ్రాంతి ఉండటం లేదు. తదుపరి పంటకు నేల తనను తాను సిద్ధం చేసుకునే అవకాశం కొరవడుతోంది. నేల సారాన్నంతా నిరంతరం వేసే పంటే లాగేసుకుంటూ, తిరిగిచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఈ పరిణామాలన్నీ భూసార పరిస్థితిని తలకిందులు చేస్తున్నాయి. నేలలోని సేంద్రియ కర్బన పదార్థాన్ని కరిగించేస్తున్నాయి.

నిర్జీవ స్థితి

ఒక అంచనా ప్రకారం- దేశంలోని సాగు భూముల్లో సేంద్రియ కర్బన శాతం 0.5 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది కనీసం 2.5 శాతం ఉండాలి. నేలలో సేంద్రియ కర్బనం తగినంతగా లేకపోవడం వల్లే మొక్కలు పీకితే సులభంగా ఊడి వస్తున్నాయి. దశాబ్దాల తరబడి వరసగా ఒకే పంట పండించే విధానాలతో నేల దాదాపుగా నిర్జీవ స్థితికి చేరుకుంటోంది. యంత్రాలు, మనుషులు, జంతువులు వదిలే వాయువులు, గాలిలో ఉండే కర్బనం కంటే భూమిలోనే అధిక కర్బన శాతం ఉంటుంది. కర్బనం నీటిని త్వరగా గ్రహించి వేరువ్యవస్థకు సరిపడా గాలిని అందిస్తుంది. నేలలోని సూక్ష్మజీవులకు అవసరమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది కాబట్టి కర్బన శాతం అధికంగా ఉంటే నేల గుల్లబారుతుంది. చెట్లను నరికేయడం, దుక్కి లోతుగా దున్నడం వల్ల 50 నుంచి 80 శాతం కర్బనం గాలిలోకి చేరి కార్బన్‌డయాక్సైడ్‌గా మారి మానవాళికి నష్టం కలిగిస్తోందన్న సంగతి తెలిసిందే.

నేలకు జీవాన్నిచ్చే పరిస్థితులు కల్పించడంపై రైతులు తక్షణం దృష్టి సారించాలి. నేల పైపొరలకు పునరుజ్జీవాన్ని కల్పించడం, నేలను దున్నకుండా లేదా తక్కువగా దున్నే పద్ధతుల్లో పంటలు వేయాలి. ఉదాహరణకు వరిలో నేరుగా వెదజల్లే పద్ధతి, పంట మార్పిడి పాటించడం వంటి విధానాలను అనుసరించాలి. వరి మాగాణుల్లో నేలను దున్నకుండా జీరో టిల్లేజి పద్ధతిలో జొన్న, మొక్కజొన్న, వేరుసెనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు వంటి పంటలను పండించే అవకాశాల గురించి శాస్త్రవేత్తలు కొంతకాలంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వీటిని ఆచరించాల్సిన అవసరముంది. నేలలోని సారం, తేమ క్షీణించకుండా పంటల మధ్య విరామంలో నేల పైభాగాన్ని కప్పి ఉంచే పంటలను సాగు చేయాలి. పంటలు వేసినప్పుడు భూమిలోని తేమ తగ్గిపోకుండా చూసే విధానాలను అనుసరించాలి. వీటన్నింటి వల్ల నేల సారం మరింత పెరుగుతుంది. బంజరు భూములను ఖాళీగా వదిలేయకుండా వర్షాధారంగా మామిడి, నేరేడు, జీడిమామిడి వంటి చెట్లను విస్తారంగా పెంచడం ద్వారా నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. ఈ తరహా వ్యవసాయ అడవుల పెంపకం వల్ల నేలలో అత్యధికంగా కర్బనం నిక్షిప్తమవుతున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు. నీడనిచ్చే మర్రి, రావి వంటి చెట్లు భూమిలోకి మరింత లోతుగా వేళ్లను వ్యాపింపజేస్తాయి కాబట్టి ఇలాంటి చెట్లు పెంచిన ప్రాంతాల్లోనూ సేంద్రియ కర్బనాన్ని వేళ్లు లోతుగా దాచిపెడతాయి. ఈ తరహా అడవులు హరిత వాయువులను పెద్దయెత్తున పీల్చుకుని భూతాపాన్ని గణనీయంగా తగ్గించేందుకు తోడ్పడతాయి. రసాయనాలనే వాడుతూ సేంద్రియ ఎరువుల్ని పూర్తిగా విస్మరించడం వల్ల వేరువ్యవస్థకు అవసరమైన ఆక్సిజన్‌ భూమి పొరల్లోకి చొచ్చుకొనిపోయే పరిస్థితి నేడు ఉండటం లేదు. ఫలితంగా మొక్కలు రోగాల బారిన పడుతున్నాయి.

విధానాలు మారితేనే...

నేలలు నిస్సారం అవుతున్న ఫలితంగా భారత్‌లో పండించే కూరగాయల్లో 60 శాతం ప్రొటీన్లు, అమెరికా కూరగాయల్లో 87 శాతం ఖనిజ లవణాలు పడిపోయాయని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్‌’ అధ్యయనం పేర్కొంది. సేంద్రియ ఎరువులతో పాటు జీవ ఎరువులవంటి వాటిని కలిపి వాడుకోవాలి. గతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పశువుల మందలను చేలో నిలగట్టడం వంటి పద్ధతులను పాటించడం నేల పునరుజ్జీవానికి దోహదపడవచ్చు. పశువులు, జీవాలను చేలల్లో మందలుగా కట్టినప్పుడు వాటి విసర్జితాలు సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయి. ఇవి నేల కోల్పోయిన సారాన్ని, భూమి అడుగు పొరల్లోని నీటి ఊటలను, మట్టి బలాన్ని, నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని పెంపొందిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలో కర్బనాన్ని పెంచితే ఆ నేలకు అదనంగా నీటిని ఇంకించుకునే శక్తి సమకూరుతుంది. దీన్నిబట్టి నేలలో సేంద్రియ కర్బన శాతం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కర్బన ఆధారిత సేంద్రియ ఎరువుల్ని విరివిగా భూమికి అందించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుని రైతులు తదనుగుణంగా నేలకు పునరుజ్జీవాన్నిచ్చేలా సాగు విధానాలను మార్చుకోవడం ప్రపంచ ఆహార భద్రత రీత్యా తక్షణావసరం.

అంకుర సేవలు

నెదర్లాండ్స్‌కు చెందిన ‘ఫ్రీసాయిల్‌’ అనే అంకుర సంస్థ భూసార పరిరక్షణ కోసం నాణ్యమైన మొక్కల ఆధారిత కంపోస్టును రూపొందించింది. దీన్ని నేలపై చల్లితే మొక్కలు సహజరీతిలో సంగ్రహిస్తాయి. బహుళ పంటలకు ఉపయోగించుకోవచ్చు. నేలకు జీవాన్ని ఇస్తుంది. నేల సారాన్ని ఇనుమడింపజేస్తుంది. ఫలితంగా తెగుళ్లను తట్టుకునే శక్తి సహజంగానే మొక్కలకు సమకూరుతుంది.

కెనడాకు చెందిన ‘ఆక్టెర్రా’ అనే అంకుర సంస్థ కంపోస్టు నేలలో పూర్తిగా కలిసిపోయి జీవాన్నిచ్చేలా చేయడంతో పాటు నేలలు, విత్తనాలు, పంటలో రసాయన అవశేషాలను నియంత్రించే సాంకేతికతను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తోంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు కంపోస్టు ద్వారా మొక్కలకు పోషకాలు సక్రమంగా అందించే ఈ పరిజ్ఞానం రైతులకు ప్రయోజనాలు కలిగిస్తోంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమస్యల ఊబిలో అన్నదాత

‣ రైతుల ఆర్థికాభివృద్ధికి మార్గం

‣ సమర్కండ్‌లో భారత్‌ సహకార నినాదం

‣ మానవ హక్కులను కాలరాస్తున్న చైనా

‣ స్వేచ్ఛాహననంపై ఆగ్రహజ్వాల

‣ సాగుభూమికి రసాయనాల ముప్పు

‣ మనోవర్తి... గౌరవ జీవన హక్కు!

Posted Date: 28-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని