• facebook
  • whatsapp
  • telegram

పప్పులే నిప్పులైన వేళ..

దేశీయంగా పప్పు ధాన్యాల ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. నిరుడు ఖరీఫ్‌, రబీ సీజన్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం కంది, మినుము తదితర పంటల దిగుబడులపై పడింది. దాంతో ధరలు ఎగబాకుతున్నాయి.

పప్పుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పరంగా భారత్‌ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పప్పుధాన్యాల వాటా 7-10శాతం దాకా ఉంటుంది. రబీ సీజన్‌లోనే అత్యధికంగా 60శాతం పప్పుధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటకలు వీటి సాగులో ముందువరసలో ఉన్నాయి. మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో సెనగల వాటాయే అత్యధికంగా 40శాతం దాకా ఉంటుంది. తరవాతి స్థానాల్లో కంది (15-20శాతం), మినుము, పెసర (8-10శాతం చొప్పున) ఉన్నాయి. నిరుడు పప్పు  ధాన్యాల ఎగుమతుల్లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ప్రస్తుతం దేశీయంగా వాటి ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఏర్పడటంతోపాటు నిరుడు ఖరీఫ్‌లో కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. రబీ సమయంలోనూ ప్రతికూల పరిస్థితుల వల్ల అనేక రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గాయి. ఫలితంగా కంది, మినుముతో పాటు ఇతర పప్పుధాన్యాల ధరలు ప్రస్తుతం అధికమయ్యాయి. దాంతో దిగుమతులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

అధిక గిరాకీ

దేశీయంగా నిరుడు 310 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగయ్యాయి. 2022-23కు సంబంధించి రెండో ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి 278.10 లక్షల టన్నులు. అంతకు ముందు ఏడాది అది 273.02 లక్షల టన్నులు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా పప్పుధాన్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో భారత్‌ నుంచి ఎగుమతులు సైతం అధికమవుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు దేశీయ పప్పుధాన్యాల ఎగుమతులు 5.39 లక్షల టన్నులకు చేరాయి. అంతకుముందు ఏడాది అదే కాలానికి ఎగుమతులు మూడు లక్షల టన్నులే. బంగ్లాదేశ్‌, శ్రీలంక నుంచి సెనగలు సహా పలు రకాల పప్పులకు గిరాకీ ఎక్కువగా ఉంది. నేపాల్‌, అమెరికా, కెనడా, బ్రిటన్‌ తదితర దేశాల్లోని ప్రవాస భారతీయుల నుంచి పప్పులకు డిమాండ్‌ ఏర్పడింది. బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు భారత్‌ నుంచి సెనగల ఎగుమతులు భారీగా పెరిగాయి. కందిపప్పునకు గల్ఫ్‌ దేశాల నుంచి గిరాకీ ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గడం, దేశీయంగా డిమాండు పెరగడం వల్ల కంది, మినుము ఎగుమతులు క్షీణించాయి. దేశంలో ప్రజలకు పప్పు ధాన్యాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం దిగుమతులను అనుమతిస్తోంది. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద ఎంపిక చేసిన జిల్లాల్లో వరి, గోధుమ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, దిగుబడులను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో పప్పుధాన్యాల పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటిస్తోంది. రైతుల నుంచి ఏటా కొనుగోలు చేస్తోంది. ఇండియాలో దాదాపు 50శాతం పంటభూములు వర్షాధారమే. పప్పుధాన్యాల సాగుకు అవి చాలా అనుకూలం. నిజానికి ఏటికేడు దేశీయంగా పప్పుధాన్యాల విస్తీర్ణం పెరుగుతుండటంతో దిగుమతులు తగ్గుతున్నాయి. వాటి ఉత్పాదకత సైతం పెరిగింది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. పప్పుధాన్యాల సాగు పరంగా అన్నదాతలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

సరైన గిట్టుబాటు ఏదీ?

పప్పుధాన్యాల పంటల సాగు దేశీయంగా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఉత్పాదకత తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. ఉత్పాదకత పరంగా గతంలో కంటే భారత్‌ కొంత పురోగతి సాధించింది. ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం అది చాలా తక్కువే. అధిక దిగుబడినిచ్చే వంగడాల లేమి, తక్కువ యాంత్రీకరణ, అశాస్త్రీయ పంటల విధానం, వర్షపాతంలో అసమానతలు తదితరాల వల్ల పప్పుధాన్యాల ఉత్పాదకత ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతోపాటు ఏటా సాగు ఖర్చులు సైతం అధికమవుతున్నాయి. దానికి తగినట్లుగా కేంద్రం సరైన మద్దతు ధరను ప్రకటించడం లేదు. దాంతో రైతుల ఆదాయం అంతంతమాత్రంగా ఉంటోంది. వాతావరణ మార్పులకు భయపడి చాలామంది రైతులు ఇతర పంటల సాగువైపు దృష్టి సారిస్తున్నందువల్ల పప్పుధాన్యాల దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్‌లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెరగాలంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలి. దానికోసం వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలను ప్రోత్సహించాలి. రైతుల నుంచి ఎప్పటికప్పుడు సరైన మద్దతు ధరకు పప్పుధాన్యాలను ప్రభుత్వాలు సేకరించాలి. వాటి ఎగుమతులపైనా సరైన దృష్టి సారించాలి.

- డి.ఎస్‌.బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అసంబద్ధ విధానాలతో వ్యర్థాల మేట

‣ సంక్షోభ నివారణకు సన్నద్ధతే కీలకం

‣ సహేతుక పన్ను.. బడుగులకు దన్ను

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం

‣ నాసిరకం విత్తు.. రైతన్న చిత్తు!

Posted Date: 17-06-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని