• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ బ‌డ్జెట్ 2024-25


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. 

 మొత్తంగా సంక్షేమం, సాగు రంగాలే గుండెగా 2024-25 బడ్జెట్‌ను జులై 25న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌లో సంక్షేమం, వ్యవసాయ రంగాలకే రూ.1.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి తమ ప్రాథమ్యాలను చాటింది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలకు రూ.63 వేల కోట్లు కేటాయించడం ద్వారా సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది. ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన భరోసా ప్రకారం వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించింది. 
ఆరు గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపునూ సర్కారు ప్రాధాన్య అంశంగా చేపట్టింది. వీటికే ప్రత్యేకంగా రూ.47,167 కోట్లను ఇవ్వడం ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఆదాయానికి కీలకమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధిపైనా శ్రద్ధ చూపుతూ రూ.10 వేల కోట్లను ప్రత్యేకించింది.అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రధాన పథకాలకు నిధులు పెద్దమొత్తంలో దక్కాయి. 

 రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త పాలసీలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి గ్రామం నుంచి మండలానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్లు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు 4 వరసల తారురోడ్లు నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు వివరించింది. 

మొత్తం అన్ని పథకాలకు కలిపి రూ.లక్షా 55 వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ పథకాల ద్వారా పేదలకు అధిక లబ్ధి చేకూరడమే కాకుండా అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగానికి రూ.1.10 లక్షల కోట్ల కేటాయింపు 

ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట

ఆరు గ్యారంటీలకు రూ.47,167 కోట్లు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర అభివృద్ధికీ ప్రాధాన్యం

‣ రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి

‣ పన్నుల రాబడి 24% పెరుగుతుందని బడ్జెట్‌ అంచనా


వనరుల పరిమితులున్నా

వనరుల పరిమితులున్నా రాష్ట్ర ఆదాయం రూ.2.90 లక్షల కోట్లకుపైగా సాధించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ రాబడి లక్ష్యసాధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని పథకాలకు కలిపి రూ.2.91 లక్షల కోట్లకు పైగా ఖర్చుచేయాలని నిర్ణయించింది. గతేడాది శాసనసభ, పార్లమెంటు ఎన్నికలున్నందున యంత్రాంగం దాదాపు ఐదారు నెలలు ఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టడంతో ఆదాయం పెద్దగా పెరగలేదని ఆర్థికశాఖ వివరించింది. సాధారణంగా ఒక ఏడాది ఆదాయం పెద్దగా పెరగకపోతే మరుసటి సంవత్సరం భారీగా పెరగడం సహజమని అందుకే ఈ ఏడాది పన్నుల ద్వారా ఆదాయంలో 24 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదవుతుందని ఈ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. 

2022-23లో పన్నుల ద్వారా రూ.లక్షా 6 వేల కోట్ల ఆదాయం రాగా.. గతేడాది(2023-24) బడ్జెట్‌లో తొలుత రూ.లక్షా 31 వేల కోట్లు దాటవచ్చని గత ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఎన్నికల హడావుడి కారణంగా ఆదాయం పెంపుపై దృష్టి పెట్టే అవకాశం యంత్రాంగానికి లేకపోవడంతో చివరికి  రూ.లక్షా 11 వేల కోట్లే వచ్చినట్లు ‘సవరణ బడ్జెట్‌’ తెలిపింది. 

ఈ సవరణ మొత్తంపై మరో 24 శాతం పెరిగి ఈ ఏడాది రూ.లక్షా 38 వేల కోట్లు రావచ్చని తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది పన్నుల ద్వారా ఆదాయం వృద్ధిరేటు తక్కువగా ఉండటానికి ఎన్నికలే కారణమని, ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండదని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వారం వారం సమీక్షలు జరిపి సంస్కరణలు తెస్తున్నందున 24 శాతం వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తంచేసింది. ఇక పన్నేతర ఆదాయం గతేడాది రూ.23,819 కోట్లు రాగా ఈ ఏడాది రూ.35,208 కోట్లు వస్తుందని అంచనా వేసింది. 

రాష్ట్ర రెవెన్యూ రాబడి పద్దు కింద వచ్చే మొత్తం రూ.2.21 లక్షల కోట్లలో... పన్నుల ద్వారా ఆదాయం రూ.1.38 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208 కోట్లు అత్యంత కీలకం. సంక్షేమ పథకాలకు ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. ఇక  మద్యంపై ‘ఎక్సైజ్‌ సుంకం’ పద్దు కింద వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే రూ.20,298 కోట్ల నుంచి రూ.25,617 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 

మద్యం అమ్మకాలు భారీగా పెరిగేతేనే అదనంగా మరో రూ.5,319 కోట్ల ఆదాయం ‘ఎక్సైజ్‌ సుంకం’గా వస్తుంది. మద్యం, పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు పెరిగితే వ్యాట్‌ కూడా రూ.33,449 కోట్లు వస్తుందని అంచనా.

                             

అప్పులే ఆదుకునేది

రాష్ట్ర ఆదాయం పద్దులో అప్పులు అత్యంత కీలకంగా మారాయి. అప్పులను కూడా ‘రాష్ట్ర ఆదాయం’ పేరుతో బడ్జెట్‌లో చూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో రూ.62,212 కోట్ల రుణాలను సేకరిస్తామని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటితో కలిపితేనే రాష్ట్ర ఆదాయం రూ.2.90 లక్షల కోట్లు దాటుతుందని వివరించింది. గతేడాది(2023-24) రూ.51,566 కోట్ల రుణాలను తీసుకోగా ఈ ఏడాది అంతకన్నా మరో రూ.10,646 కోట్లను అదనంగా తీసుకోవాలని నిర్ణయించింది. అయినా, ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు గానీ, అభివృద్ధికి గానీ వినియోగించుకునే అవకాశం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

గతంలో తీసుకున్న రుణాలపై అసలు, వడ్డీ కలిపి కిస్తీ కింద నెలకు రూ.5,365 కోట్ల చొప్పున ఈ ఏడాది రూ.64,380 కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ లెక్కన ఈ ఏడాది తీసుకునే రూ.రూ.62,212 కోట్ల రుణాలకు మరో రూ.2,168 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ సొంత సొమ్ము కలిపి కిస్తీల కింద రూ.64,380 కోట్లను కట్టాల్సి ఉంటుందని భట్టి వివరించారు. కొంతవరకైనా అప్పులు తీసుకోకపోతే రాష్ట్ర ఆదాయం నుంచి ఈ కిస్తీలను కడితే సంక్షేమం, అభివృద్ధి పథకాలకిక నిధులుండవని తెలిపారు. 

కేటాయింపులు రూ. కోట్లలో

పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి : 29,816

సాగునీటి రంగం: 22,301

ప్రాథమిక విద్య : 17,942

పురపాలక- పట్టణాభివృద్ధి : 15,594

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం: 11,468
 


 

మహానగరికి నిధుల భాగ్యం

‘గ్రేటర్‌’ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు - బడ్జెట్‌లో హైదరాబాద్‌కు భారీగా కేటాయింపులు

మూసీ సుందరీకరణ,  హైడ్రా సహా అన్ని విభాగాలకు ఆర్థిక దన్ను 

ప్రగతి పనులు పెద్దఎత్తున చేపట్టేందుకు అవకాశం

హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్‌లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. రాజధాని సరిహద్దులను బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) వరకు విస్తరించి.. అన్ని ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా ఏకంగా రూ.10 వేల కోట్లు కేటాయించింది. 

గత కొన్నేళ్ల బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలిస్తే.. ఈసారే హైదరాబాద్‌కు భారీ కేటాయింపులు దక్కాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, మెట్రో సంస్థలకు పెద్దఎత్తున నిధులు ప్రతిపాదించారు. మూసీ సుందరీకరణకు తొలిసారిగా రూ.1,500 కోట్లు కేటాయించడం ద్వారా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్నీ సకాలంలో విడుదల చేస్తే నగరంలో భారీగా పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


సీఎం ప్రత్యేక దృష్టి

కోటికిపైగా జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా మహానగరంపై అభివృద్ధిపరంగా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేయడం ద్వారా దాన్ని సాధించాలని ఆయన అనుకుంటున్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 

గత బడ్జెట్‌లో భారాస ప్రభుత్వం మహానగరంలోని అన్ని విభాగాలకు రూ.5,729 కోట్లు కేటాయించగా.. అందులో 47 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిధులు సరిపోకపోవడంతో వేల కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి తాజా బడ్జెట్‌లో ‘గ్రేటర్‌’కు రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో జీహెచ్‌ఎంసీకి రూ.3,065 కోట్లు, జలమండలికి రూ.3,385 కోట్లు, మెట్రోకు రూ.1,100 కోట్లు ప్రతిపాదించారు. 

నగరంలోని అన్ని విభాగాలకు నిధులు కేటాయించడం వల్ల ఆగిన పనులు పూర్తి చేయడంతోపాటు కొత్తవి మొదలుపెట్టడానికి అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ, ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఏర్పడిన నూతన సంస్థ ‘హైడ్రా’కు రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. మూసీ సుందరీకరణకు ఈ ఏడాది అంకురార్పణ జరగనుందని భావిస్తున్నారు. 

‣ బడ్జెట్‌లో భారీ కేటాయింపుల నేపథ్యంలో మహానగరంలో చేపట్టాల్సిన పనుల గురించి అన్ని విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన సమావేశం జరగనుందని, ఆ తరువాత కార్యాచరణ అమలుపై సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
 


అన్ని పథకాలకు భారీ కేటాయింపులు...

సీఎం దళిత సాధికారత పథకానికి రూ.2 వేల కోట్లు

‣ కల్యాణలక్ష్మి, ఉపకార వేతనాలకు నిధుల వెల్లువ

సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.2 వేల కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు రూ.23,810 కోట్లు



ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు, బకాయిలు చెల్లించేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు సహా మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.63,633.2 కోట్లు కేటాయించింది. 

ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కేటాయింపులు రూ.23,810 కోట్లు. బీసీ సంక్షేమశాఖలో స్వయంఉపాధి పథకాల అమలు కోసం కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కార్పొరేషన్లు, సహకార ఆర్థిక సమాఖ్యలకు భారీగా నిధులు ఇచ్చింది. తొలిసారిగా బీసీల్లో అన్నివర్గాల స్వయంఉపాధి పథకాలకు రూ.1,910.34 కోట్లు దక్కాయి. 

ఎస్సీల స్వయంఉపాధి కోసం సీఎం దళిత సాధికారత పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపి ఎస్సీల సంక్షేమానికి రూ.33,124 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,002.59 కోట్లు కేటాయించారు.
 



సీఎం దళిత సాధికారత.. సమీకృత గురుకులాలు

బడ్జెట్‌లో ప్రభుత్వం స్వయంఉపాధి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించింది. సీఎం దళిత సాధికారత పథకానికి కేటాయించిన రూ.2 వేల కోట్లతో దళితుల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయనుంది. గురుకులాల్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమీకృత గురుకులాలు నిర్మించాలని నిర్ణయించింది. 

ఈ మేరకు భారీగా రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఒక్కో గురుకుల నిర్మాణానికి దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చుచేయనుంది. సమీకృత గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవనాలు, వసతి, డార్మెటరీలు, ప్రయోగశాలలు, భోజనశాలలు, క్రీడామైదానాలు ఉంటాయి. ఒక్కో గురుకులాన్ని దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. 

సమీకృత గురుకులాలు మినహాయించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల నిర్వహణకు రూ.3,062 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చితే ఈ నిధులు ఎక్కువే. గురుకులాల నిర్వహణతో పాటు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సర్కిళ్లకు నిధులు పెంచింది.

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల నిర్వహణ, అదనపు సదుపాయాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కింది. బీసీ కమిషన్‌కు రూ.14.25 కోట్లు కేటాయించారు. గిరిజన సంక్షేమశాఖలో సీఎం ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ పథకానికి రూ.12.50 కోట్లు, బీసీ సంక్షేమ పరిధిలో నాయీబ్రాహ్మణులు, ధోబీలకు ఉచిత విద్యుత్తుకు రూ.250 కోట్లు కేటాయించింది.



గిరిజన ప్రాంతాల రోడ్లకు మోక్షం

గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఐదేళ్లుగా రోడ్లు నిర్మించాలని భావించినా గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కొత్త ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి అధిక

ప్రాధాన్యం ఇస్తూ రూ.447.95 కోట్లు ఇచ్చింది. 

‣ ఐటీడీఏల నిర్వహణకు రూ.40 కోట్లు కేటాయించింది. విదేశీవిద్య పథకానికి కేటాయింపులు పెద్దగా పెరగలేదు. మైనార్టీలకు అత్యధికంగా రూ.130 కోట్లు కేటాయించింది. ఎస్సీలకు రూ.70 కోట్లు, బీసీలకు రూ.80 కోట్లు, ఎస్టీలకు రూ.38 కోట్లు కలిపి ఈ పథకానికి రూ.318 కోట్లు ప్రకటించింది.


కల్యాణలక్ష్మికి రూ.3,585 కోట్లు

పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద బడ్జెట్‌లో నిధులు పెంచింది. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంతో పాటు కొత్తగా మంజూరు చేసేందుకు ఓటాన్‌ అకౌంట్‌ కన్నా అదనంగా రూ.585 కోట్లు కేటాయించింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు కలిపి రూ.3,585 కోట్లు కేటాయించారు. ఎస్సీలకు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.260 కోట్లు, బీసీలకు రూ.2,175 కోట్లు, మైనార్టీలకు రూ.650 కోట్లు కేటాయించారు.
 


ఉపకారానికి దండిగా నిధులు

రాష్ట్రంలో సంక్షేమ వర్గాల బోధన ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లించేందుకు బడ్జెట్‌లో నిధులు పెంచింది. ఓటాన్‌ అకౌంట్‌తో పోల్చితే నిధులు దాదాపు రూ.వెయ్యి కోట్లు పెరిగాయి. 

* రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న దాదాపు 12.5 లక్షల మంది విద్యార్థులకు బోధన ఫీజుల బకాయిలు చెల్లించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఫీజుల కోసం రూ.3,655.54 కోట్లు కేటాయించిన ప్రభుత్వం బీసీల ఉపకారానికి రూ.1,910.34 కోట్లు ఇచ్చింది. ఎస్సీ విద్యార్థులకు రూ.708.68 కోట్లు, ఎస్టీలకు రూ.616.52 కోట్లు, మైనార్టీలకు రూ.420 కోట్లు కేటాయించింది.
 


పల్లెకు పెన్నిధి

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కన్నా రూ.10,264 కోట్లు తగ్గుదల 

‣ చేయూత కోసం రూ.14,861 కోట్ల కేటాయింపు  

ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. ప్రస్తుతం సాధారణ పెన్షన్‌ నెలకు రూ.2016, దివ్యాంగుల పెన్షన్‌ రూ.3016 చొప్పున ఉంది. 

‣ కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీ మేరకు దాన్ని రూ.4000, రూ.6000 చొప్పున ఇవ్వడానికి పెన్షన్‌ బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది. ప్రభుత్వం మరో రూ.2861 కోట్లను మాత్రమే పెంచి పెన్షన్ల కోసం రూ.14,861 కోట్లు కేటాయించింది.

 మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థికసాయం అమలుకు ప్రభుత్వం గత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.4,500 కోట్లను కేటాయించింది. తాజా బడ్జెట్‌లో ఈ కేటాయింపులను తొలగించింది. 

 


చేయూత పింఛన్ల కోసం రూ.22,000 కోట్లు.. ఇతర పద్దుల కింద మరో రూ.29,000 కోట్లు.. మొత్తంగా రూ.51,000 కోట్లను ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించగా.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.29,816 కోట్లను కేటాయించింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.40,080 కోట్ల కేటాయింపులు జరపగా.. అంతకంటే రూ.10,264 కోట్లు తగ్గాయి. 2023-24లో అప్పటి ప్రభుత్వం రూ.30,976 కోట్లు కేటాయించడం గమనార్హం. 
 


మంచినీటి సరఫరాకు

ఈ ఏడాది జూన్‌లో సమగ్ర సర్వేలో 4 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు లేవని ప్రభుత్వం గుర్తించింది. మిషన్‌ భగీరథలో బయటపడ్డ లోపాలను సవరించి, రాష్ట్రంలో 100 శాతం గృహాలకు సురక్షిత నీటిని సరఫరా చేయాలని, గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు, పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ కేంద్రాలకు తాగునీటిని అందించాలని నిర్ణయించింది. మిషన్‌ భగీరథ బాధ్యతలను పంచాయతీరాజ్‌ అధికారులకు అప్పగించింది.

‣ మిషన్‌ భగీరథ నిర్వహణ పద్దు కింద ఏటా రూ.6,000 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోంది. తాజా బడ్జెట్‌లో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ.3,046 కోట్లను మాత్రమే కేటాయించడం గమనార్హం. 


గ్రామదారి రహదారి

పంచాయతీల మౌలిక వసతుల కల్పనలో భాగంగా సమగ్ర గ్రామీణ రహదారుల విధానాన్ని రూపొందించింది. గ్రామం నుంచి ప్రతి మండలానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి రూ.5,328 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో రూ.3,628 కోట్లు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా కింద కేటాయించడంతో పాటు ప్రభుత్వం సొంతంగా రోడ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు, నిర్వహణకు రూ.700 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల నిధి కోసం రూ.200 కోట్లు కేటాయించింది. 
 


మహిళలకు వడ్డీ లేని రుణాలు

మూడేళ్లుగా మహిళా స్వయంసహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకం అమలు కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం దానిని మళ్లీ ప్రారంభించి.. రూ.1302 కోట్లను కేటాయించింది. తెలంగాణ మహిళాశక్తి పథకం కింద వారికి క్యాంటీన్ల మంజూరుతో పాటు ఇతరత్రా పథకాల కింద ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

 దానికోసం తాజాగా రూ.80.90 కోట్లు ఇచ్చింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే మహిళా సంఘాల సభ్యురాళ్లకు రూ.2 లక్షల ప్రమాద బీమా పథకం అమలుకు రూ.96.53 కోట్లను కేటాయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు రూ.1075 కోట్లు ఇచ్చింది.
 


పెరిగిన ద్రవ్యలోటు

రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. 2022-23లో రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు రూ.32,556.51 కోట్లుంది. గతేడాది(2023-24) బడ్జెట్‌లో ఇది రూ.38,234.94 కోట్లకు చేరవచ్చని అంతమేర రుణాలు తీసుకుంటామని గత బడ్జెట్‌లో తొలుత అంచనా వేసింది. 

కానీ గత మార్చి నాటికి ద్రవ్యలోటు రూ.49,372.84 కోట్లకు చేరడంతో రుణాల సేకరణా అదేస్థాయికి చేరింది. ఇక ఈ ఏడాది మొత్తం రూ.2.90 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా ద్రవ్యలోటు రూ.49,255.41 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. బడ్జెట్‌లో మరో కీలక అంశం రెవెన్యూ మిగులు. 

‣ 2022-23లో ఇది రూ.5,943.64 కోట్లుండగా గతేడాది రూ.4,881.74 కోట్లుండవచ్చని తొలుత అంచనా వేశారు. ఇది కాస్తా రూ.1,704.89 కోట్లకు పడిపోయినట్లు సవరణ బడ్జెట్‌లో తేలింది. ఇక ఈ ఏడాది ఇది రూ.297.42 కోట్లే ఉంటుందని తాజా బడ్జెట్‌లో అంచనా వేశారు. ప్రభుత్వం సేకరించే రుణాలు కాకుండా వాస్తవంగా వచ్చే రెవెన్యూ రాబడులతో పోలిస్తే.. రెవెన్యూ వ్యయం ఎంత ఉంటుందనేది లెక్కించి మిగిలే సొమ్మును ‘రెవెన్యూ మిగులు’ పద్దు పేరుతో బడ్జెట్‌లో చూపుతారు.
 

గ్యాస్‌ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’

రూ.500 సిలిండర్‌ పథకానికి రూ.723 కోట్లు
కాంగ్రెస్‌ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39,57,637 కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. సాధారణ కనెక్షన్‌ వినియోగదారులు ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.455, ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులు రూ.155 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.855 కోట్ల సబ్సిడీ అవసరం అవుతుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. 

సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 27న రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల రూపాయల్ని చెల్లించింది. బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించడంతో రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు అవసరమైన నిధులు లభించినట్లయింది. 

బియ్యంపై సబ్సిడీకి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1879.05 కోట్లు కేటాయించింది.
 


విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
 


రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి. 

గత భారాస ప్రభుత్వం 2017-18లో ఎనిమిది విశ్వవిద్యాలయాలకు రూ.420 కోట్లు, 2018-19లో రూ.210 కోట్లు కేటాయించింది. అయితే వాటిలో విడుదల చేసింది మాత్రం సగానికి మించలేదు. గత ఏడాది(2023-24) బడ్జెట్‌లో భారాస ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రతిపాదించినా వర్సిటీలకు అందింది దాదాపు శూన్యమే. 

తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మహిళా వర్సిటీతో కలిపి.. 12 విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రతిపాదించింది. మహిళా వర్సిటీకి తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. 

ఈ విశ్వవిద్యాలయానికి గత ప్రభుత్వం కూడా 2022-23, 2023-24 బడ్జెట్‌లలో రూ.100 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.
 


సదుపాయాలు సమకూరేదెలా?

రూ.500 కోట్లలో రెండు విశ్వవిద్యాలయాల(ఓయూ, మహిళా వర్సిటీ)కే రూ.200 కోట్లు కేటాయించారు. మిగిలిన 10 వర్సిటీలకు మిగిలేది రూ.300 కోట్లు.. అంటే ఒక్కోదానికి సగటున రూ.30 కోట్లు మాత్రమే. ఈసారైనా పూర్తిగా నిధులిస్తారా? అన్నది వేచిచూడాలి. 

కాకతీయ వర్సిటీ గ్రంథాలయంలో వసతులు లేవు. 

‣ జేఎన్‌టీయూహెచ్‌ కింద సిరిసిల్ల, వనపర్తితోపాటు గత ఏడాది మొదలైన పాలేరు, మహబూబాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు శాశ్వత భవనాలు లేవు.  

వర్సిటీల్లో 1,800 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ అంశాన్ని బడ్జెట్‌లో సర్కారు ప్రస్తావించలేదు.


వేతన గ్రాంటూ పూర్తిగా ఇవ్వలేదు

గత బడ్జెట్‌లో 11 విశ్వవిద్యాలయాలకు వేతనాల కోసం బ్లాక్‌ గ్రాంట్‌ పేరిట అప్పటి ప్రభుత్వం రూ.835.94 కోట్లు ప్రతిపాదించింది. తీరా రూ.784.64 కోట్లే ఇచ్చింది. ఈసారి బడ్జెట్‌లో రూ.910.34 కోట్లు ప్రతిపాదించారు.


ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు

ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పథకాలకు పెద్దపీట

కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.1,676.46 కోట్లు

పాలమూరు-రంగారెడ్డికి  రూ.1,285 కోట్లు

6.32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం
------------------------------------------------------------


‘ఓటాన్‌ అకౌంట్‌’ కన్నా రూ.5,723 కోట్లు తగ్గిన ‘బడ్జెట్‌’

బడ్జెట్‌లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.28,024 కోట్లు కేటాయించగా పూర్తిబడ్జెట్‌కు వచ్చేసరికి రూ.5,723 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. ఇప్పటికే పనులు పూర్తయిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరందే పనులకు ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించారు. ఈ పనుల పూర్తి ద్వారా ఈ ఏడాది 6.32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును తేల్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ఆ ప్రాజెక్టులకు నిధుల వరద 

బడ్జెట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న కీలక ప్రాజెక్టుల పూర్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.1,676.46 కోట్లు కేటాయించారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ఉన్న కీలక ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డికి రూ.1,285 కోట్లు కేటాయించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.715 కోట్లు దక్కాయి. ఈ పథకంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీలు, పంప్‌హౌస్‌ల పనులతోపాటు కీలకమైన ప్యాకేజీ-29 కింద పలు రకాల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భూసేకరణ కూడా మిగిలి ఉంది.

 దేవరకద్ర నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకూ భారీగా నిధులిచ్చారు. కోయిల్‌సాగర్‌ జలాశయం విస్తరణ, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టనున్నారు. చాలాఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగంబండ జలాశయం పనులు, పునరావాస చర్యలకు గడిచిన పదేళ్లతో పోల్చితే భారీగా నిధులు వచ్చాయి. కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న రాజీవ్‌ నెట్టెంపాడుకు కూడా నిధుల పరంగా ప్రాధాన్యం దక్కింది.


నల్గొండ జిల్లాకు కీలకంగా ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఏఎమ్మార్పీ) పథకం పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. పెండింగ్‌ బిల్లులు, టన్నెల్‌బోర్‌ మిషన్‌ను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించారు. నాగార్జునసాగర్‌ జలాల ఎత్తిపోతకు ఏర్పాటు చేస్తున్న స్కీంలకు కూడా దండిగా నిధులిచ్చారు. డిండి ఎత్తిపోతలకు కూడా ప్రాధాన్యం దక్కింది. 

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు సాగునీరు అందించనున్న సీతారామ ఎత్తిపోతలకు రూ.687.81 కోట్లు కేటాయించగా.. ఈ ఎత్తిపోతల ప్రధాన కాలువ నుంచి నాగార్జునసాగర్‌ కాలువకు అనుసంధానం చేసి గోదావరి నీటిని తరలించే లింక్‌ కాలువ పనులకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. 

‣ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతలకు రూ.248.99 కోట్లు ఇచ్చారు. ఈ పథకం కింద గతంలో రూ.11 వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన సొరంగాలు, కాలువలు నిరుపయోగంగా ఉన్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వెనుక జలాల ముంపుతో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రక్షణ గోడలు నిర్మించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 

మధ్యతరహా ప్రాజెక్టులకు..
వికారాబాద్‌ జిల్లాలోని కోటిపల్లి వాగుకు రూ.8 కోట్లు, ఖమ్మంలోని వైరా ప్రాజెక్టుకు రూ.14.49 కోట్లు, కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పెద్దవాగు జగన్నాథపూర్‌ ప్రాజెక్టుకు   రూ.12.32 కోట్లు కేటాయించారు.   ప్రపంచ బ్యాంకు డ్యాం రీహ్యాబిలిటేషన్‌ స్కీంకు రూ.75 కోట్లు ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల పథకం మిషన్‌ కాకతీయకు  రూ.273.45 కోట్లు కేటాయించారు. దేవాదుల, శ్రీరామసాగర్, బీమా ప్రాజెక్టులకు కేంద్రం సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా (మ్యాచింగ్‌ గ్రాంట్‌) కింద రూ.100.50 కోట్లు కేటాయించారు.  

బోర్డులకు నిధులు 
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు రూ.11.75 కోట్లు... గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)కు రూ.10 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ రెండు బోర్డులకు గత ఆర్థిక సంవత్సరం నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది.


ఈ ఏడాదే అధిక కేటాయింపులు

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు గత ఐదేళ్లతో పోలిస్తే.. ఈ ఏడాదే కేటాయింపులు అధికమని ప్రభుత్వం వెల్లడించింది. రుణాలకు వడ్డీల చెల్లింపుల నిధులు తీసివేస్తే.. ప్రాజెక్టులకు స్కీం బడ్జెట్‌ కింద 2023-24లో రూ.9,381 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం రూ.10,829 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.
 



విద్యాశాఖకు కాస్త పెంచినా

గత బడ్జెట్‌ కంటే రూ.2199 కోట్లు అధికంగా కేటాయింపు
 


రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్‌లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా 7.3 శాతమే. పెరిగిన నిధుల్లో అత్యధికం ఉపాధ్యాయులు, అధ్యాపకుల జీతాలకే పోతాయని, అభివృద్ధి పనులకు మిగలవని విద్యావేత్తలు, సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కేటాయించిన విద్యాశాఖ బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.17,942 కోట్లు, సాంకేతిక, ఉన్నత విద్యకు కలిపి రూ.3,350 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యలో భాగంగా కళాశాల విద్యాశాఖకు రూ.606 కోట్లు, ఇంటర్‌ విద్యాశాఖకు రూ.834 కోట్లు ప్రతిపాదించారు. 


తొలి బడ్జెట్‌లో 10.89 శాతం కేటాయించినా.. 

చదువుకు పెద్ద పద్దులా కనిపిస్తున్నా మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా అంతంతమాత్రమే. రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం 2014-15 బడ్జెట్‌లో విద్యాశాఖకు 10.89 శాతం కేటాయించగా.. తర్వాత నుంచి వాటా తగ్గుతూ వస్తోంది. 2019-20లో 6.77 శాతం, 2020-21లో 6.69, 2021-22లో 6.78, 2022-23లో 6.24, 2023-24లో 6.57 శాతంగా ఉంది. అది ఈసారి 7.3 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తం పాఠశాల విద్యాశాఖ బడ్జెట్‌లో కనీసం 85 శాతం.. అంటే దాదాపు రూ.18 వేల కోట్లు ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేతనాలకే పోతాయి. ఇక మిగిలిన సుమారు రూ.3 వేల కోట్లలో సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజనం తదితర పథకాల్లో 40 శాతం కింద రాష్ట్ర వాటాలు పోతాయని విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఉదాహరణకు సమగ్ర శిక్షకు రూ.1952.17 కోట్లు చూపింది. అందులో రాష్ట్ర వాటా 40 శాతం ఇవ్వాలి. అంటే దాదాపు రూ.780 కోట్లు. 


తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లకు రూ.500 కోట్లు 

మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నెలకొల్పుతామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అందుకు బడ్జెట్‌లో అంతర్జాతీయ పాఠశాలలకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వాటిని తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లుగా పిలవనున్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలను ఎంపిక చేయనున్నారు. కేటాయించిన సొమ్ముతో ఎన్ని పాఠశాలలను ఏర్పాటు చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 


ఎన్నికల ప్రణాళికలో 15 శాతం చెప్పినా.. 

పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,000 పాఠశాలలున్నాయి. వాటిల్లో వందల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక 194 ఆదర్శ పాఠశాలలు ఉంటే అందులో 160 చోట్లే అమ్మాయిలకు వసతి ఉంది. మిగిలిన చోట్ల హాస్టళ్లు లేవు. ఇక కేజీబీవీల్లో సామర్థ్యానికి మించి విద్యార్థినులున్నారు. ప్రత్యేక అకడమిక్‌ బ్లాక్‌లు లేవు. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో 15 శాతం నిధులిస్తామని చెప్పినా.. ప్రస్తుతం 7.3 శాతమే కేటాయించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

విద్యుత్‌కు నిధుల వెలుగులు

ఇంధనశాఖకు రూ.16,410 కోట్లు 

‣ గతేడాది కన్నా రూ.252 కోట్లు ఎక్కువ


నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్‌లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. పెరిగిన కరెంటు డిమాండ్‌ను నెరవేర్చేందుకు మొత్తం రూ.16,158 కోట్లు ఖర్చు చేసినట్లు ‘సవరించిన బడ్జెట్‌’లో పేర్కొంది. ఈ ఏడాది దానికన్నా మరో రూ.252 కోట్లు పెంచి.. ఇంధనశాఖకు మొత్తం రూ.16,410 కోట్లు కేటాయించింది. వ్యవసాయానికి, ఇతర వర్గాలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న నేపథ్యంలో నిధులను పెంచింది.


నెట్‌వర్క్‌ బలోపేతానికి ప్రణాళికలు

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు తగ్గించి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్‌స్టేషన్ల నిర్మాణం, హై ఓల్టేజీ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపునకు రూ.3,017 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పవర్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.


‘గ్రేటర్‌’లో మరో 100 ఛార్జింగ్‌ స్టేషన్లు

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పుడున్న స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్యరహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.


పట్టణాలకు పట్టం 

ఏకంగా రూ.15,594 కోట్ల కేటాయింపు 

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పురపాలక శాఖకు పెద్దపీట వేస్తూ రూ.15,594 కోట్లు కేటాయించింది. నిరుటి బడ్జెట్‌లో ఇచ్చిన రూ.11,082 కోట్లతో పోలిస్తే ఇది రూ.4,512 కోట్లు అదనం కావడం విశేషం. అయితే, నిరుడు కేటాయించిన నిధుల్లో 47% మాత్రమే ఖర్చు చేశారు. ఈసారి ప్రభుత్వం పట్టణాభివృద్ధికి రూ.4,977 కోట్లు ప్రతిపాదించింది. అందులో ప్రధానంగా  గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, కరీంనగర్, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్లకు కలిపి రూ.50 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.30 కోట్లు, వరంగల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి రూ.180 కోట్లు, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీకి రూ.100 కోట్లు, అమృత్‌ పథకంలోని పురపాలికలకు రూ.150 కోట్లు, సమీకృత మార్కెట్ల అభివృద్ధికి రూ.100 కోట్లు, వివిధ ఆలయాల అభివృద్ధి సంస్థలకు రూ.100 కోట్లు, వైకుంఠ ధామాలకు రూ.75 కోట్లు, పురపాలక సంఘాలు రుణాలు తీసుకునేందుకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు రూ.114 కోట్లు కేటాయించింది.
 


సొంత రాబడులపై భారీ అంచనాలు

పన్నేతర రాబడి పెరుగుదలపై నమ్మకం

పన్నుల రాబడిలో 24% వృద్ధిరేటు అంచనా

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లపైనా ఆశలు



సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఈ రెండింటి ద్వారానే 60% నిధులు సమకూర్చుకోనున్నట్లు ప్రతిపాదించింది. 

వనరులు పరిమితంగా ఉన్నా భారీ బడ్జెట్‌ను రూపొందించినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నికర రాబడులను ప్రాతిపదికగా తీసుకొని వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖలతోపాటు రవాణాశాఖ రాబడి పెరుగుదలను భారీగా అంచనా వేసింది. ఆ వివరాలు ఇవీ... 

గత ఏడాది రాష్ట్రానికి పన్నుల రాబడి 1.11 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది 24% పెరుగుదలతో రూ.1.38 లక్షల కోట్లు వస్తుందని పేర్కొంది. 

పన్నేతర రాబడి గత ఏడాది రూ.23,819 కోట్లు రాగా ఈసారి ఏకంగా రూ.35,208 కోట్లు ఆశిస్తోంది. 

పన్నుల రాబడిలో నిరుడు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపంలో కేంద్రం నుంచి రూ.9,729 కోట్లు మాత్రమే అందగా.. ఈసారి రూ.21,636 కోట్లు వస్తాయని పేర్కొంది. 

రుణాలు కాకుండా పన్నులు, పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర పన్నుల వాటా రూపంలో మొత్తం రూ.2.21 లక్షల కోట్లను అంచనా వేసింది. ఈ మొత్తం గత ఏడాది వాస్తవ రాబడుల కంటే రూ.52,153 కోట్లు (30%) అధికం.  

రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు, భూముల క్రయవిక్రయాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి ఈ ఏడాది రూ.18,244 కోట్లుగా అంచనా వేసింది. 

ఎక్సైజ్‌ రాబడి గతేడాది కంటే రూ.5,319 కోట్లు పెరిగి.. మొత్తం రూ.25,618 కోట్లు  వస్తాయని ప్రకటించింది.

వాహనాల అమ్మకాలు అంతకంతకూ   పెరుగుతున్న క్రమంలో రవాణాశాఖ ద్వారా  గత ఏడాది కంటే రూ.1,383 కోట్లు అదనంగా.. మొత్తం రూ.8,477 కోట్లు వస్తాయని     ప్రతిపాదించింది. 

అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడుల్లో పెరుగుదలను 20% పైగా అంచనా వేసింది. 

పన్నేతర ఆదాయంలో సింహభాగం భూముల అమ్మకం నుంచి కాగా తర్వాత స్థానం గనులది. భూముల అమ్మకం ద్వారా గత ఏడాది రూ.16,852 కోట్లు ఖజానాకు సమకూరగా.. ఈసారి రూ.25,817 కోట్లుగా అంచనా వేసింది. గనులు ఇతర రాబడులను గత ఏడాది కంటే రూ.1,200 కోట్లు పెంచి రూ.6,991 కోట్లుగా ప్రతిపాదించింది.

‣ ఇతర రాబడుల్లో కేంద్రం నుంచి పన్నుల వాటాగా అందే మొత్తాన్ని కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగా రూ.26,216 కోట్లను చూపింది. 

ఇది కాక రుణాల ద్వారా రూ.62,212 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. వీటిలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో బాండ్ల విక్రయం ద్వారా రూ.57,112 కోట్ల రుణం తీసుకోనుండగా మిగతా వాటిని కేంద్రం, ఇతర రుణాల రూపంలో తీసుకోనున్నట్లు ప్రకటించింది. 

పన్నులు రాబడిని పెంచుకునేందుకు తమ విధానాలు తమకు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

అన్నదాతకు అందలం

వ్యవసాయానికి రూ.49,383 కోట్ల కేటాయింపులు 


రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాధాన్య పథకాలు, అవసరాల దృష్ట్యా ఆ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది. 2023-24 బడ్జెట్‌లో రూ.26,811 కోట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.22,572 కోట్లు పెంచి మొత్తం రూ.49,383 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగుకు ఇదే అత్యధిక బడ్జెట్‌. 

వాస్తవంగా వ్యవసాయశాఖ రుణమాఫీకి రూ.31 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.23 వేల కోట్లు తదితర అంచనాలతో రూ.64 వేల కోట్ల మేరకు నిధులను ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. కానీ, రుణమాఫీతోపాటు రైతుభరోసా, పంటల బీమా పథకాల వాస్తవ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తాజా కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది నుంచి కొత్తగా రైతు కూలీలకు ఏటా రూ.12 వేల సాయం చేస్తామని ప్రకటించింది. 


రుణమాఫీనే పెద్ద పద్దు 

రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 

‣ తెల్లకార్డు లేని వారు, ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లు, ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులను తొలగించి, ఇటీవలే తొలివిడతగా రూ.లక్ష లోపు మాఫీ చేయాలని 11.34 లక్షల మందికి రూ.6,035 కోట్లను జమ చేసింది. 

దీన్నిబట్టి తాజా బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.26 వేల కోట్లు సరిపోతాయని నిర్ణయించింది. 

రైతుబంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకు ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.7,500 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం దీనిని వర్తింపజేసేందుకు సన్నద్ధమైంది.

 ఇందులో పరిమితులు, నిబంధనలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఈ మేరకు రూ.23 వేల కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా రూ.15,075 కోట్లతోనే సరిపెట్టింది.

‣ ఇకపై భూమిలేని రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేలు రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందుకు రూ.906 కోట్లు నిర్దేశించింది. అర్హుల ఎంపిక బాధ్యత పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించింది. 

పంటల బీమా పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం సగం నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.1300 కోట్లు కేటాయించింది. 
 


వరికి బోనస్‌ 
 


సన్న వడ్లు పండించే రైతులకు ఎకరానికి రూ.500 చొప్పున బోనస్‌ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఈ సీజన్‌ నుంచే దానిని అమలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరిధాన్యం ఏటా సాగవుతోంది. ఈ లెక్కన ఈ పథకానికి రూ.15 వేల కోట్లు అవసరమవుతాయి. అయితే మొత్తం సాగులో సన్నబియ్యం 33 రకాలు పండించేది తక్కువే కావడంతో రూ.1,800 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైతు బీమా పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు రూ.1,589 కోట్లు కేటాయించింది. విత్తనాల సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ ఇతర పథకాలకు రాష్ట్ర వాటా కింద రూ.5 వేల కోట్లు ఇచ్చింది. 


నూతన విత్తన విధానం 

నాసిరకం, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు, నాణ్యమైన విత్తనోత్పత్తికి కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.10 కోట్లను కేటాయించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.18.75 కోట్లు ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి, ఆయిల్‌పామ్‌ సాగు అభివృద్ధికి రూ.737 కోట్లు కేటాయించింది. 
 


గొర్రెల పంపిణీ పథకం లేనట్లే 
 


ఆరేళ్లుగా అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికినట్లే తెలుస్తోంది. కొత్త బడ్జెట్‌లో దీనికి నిధులేమీ ఇవ్వలేదు. ఈ పథకం అమల్లో అభియోగాలు రావడం, వాటిపై విచారణ కొనసాగుతుండటం తెలిసిందే. గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కూడా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. చేపల పంపిణీ పథకాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ రూ.249 కోట్లు ఇచ్చింది. 

పాడి రంగం, ఇతరత్రా పథకాలకు రూ.300 కోట్లు కేటాయించింది. పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.18 కోట్లు, మామునూరు పశువైద్య కళాశాలలో మౌలిక వసతులకు రూ.25 కోట్లు, కొడంగల్‌లో కొత్తగా మంజూరైన పశువైద్య కళాశాలకు రూ.6.50 కోట్లు ఇచ్చింది. సిద్దిపేట పశువైద్య కళాశాల నిర్మాణానికి గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.11.34 కోట్లు కేటాయించగా.. ఈసారి ఏమీ ఇవ్వలేదు.
 


గృహ నిర్మాణానికి రూ.9,184 కోట్లు


గృహ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9,184 కోట్లు కేటాయించింది. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,16,500; రాష్ట్ర రిజర్వు కింద 33,500 ఇళ్లను కేటాయించింది. అందుకోసం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.7,740 కోట్లను ప్రతిపాదించింది. 

తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.9,184 కోట్లుగా పేర్కొంది. 2023-24లో అప్పటి ప్రభుత్వం రూ.12 వేలకోట్లు గృహ నిర్మాణానికి కేటాయించింది. ప్రస్తుత సర్కారు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6లక్షలు, ఇతర వర్గాలకు రూ.5లక్షలు అందించనుంది. 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల పథకం కింద రూ.4,644 కోట్ల ఆర్థిక సహాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందించాలని.. నిర్మాణంలో ఉన్న వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు 82,82,332 దరఖాస్తులు అందగా వాటి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది.
 


ఆరోగ్యానికి అదనంగా  వైద్యశాఖకు రూ.11,468 కోట్లు


గ్రామీణ ఆరోగ్యం, వైద్య విద్య బోధనాసుపత్రులకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు రూ.11,468 కోట్లను ప్రతిపాదించింది. రాష్ట్రంలో ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు నిధుల్లో ప్రాధాన్యమిచ్చింది. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ రూ.9135 కోట్లు కాగా ఈసారి రూ.11,468 కోట్లను కేటాయించింది.

రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించే ఉచిత వైద్యం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు నిధులను పెంచింది. ఆరోగ్యహెల్త్‌ కేర్‌ ట్రస్టుకు రూ.695 కోట్లు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌కు రూ.150 కోట్లు, కొత్త వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల భవనాల నిర్మాణానికి రూ.542 కోట్లు, బోధనాసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో వైద్య పరీక్షల పరికరాలు, ఇతర ఉపకరణాల కొనుగోలుకు రూ.300 కోట్లు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.260 కోట్లు కేటాయించింది. 

మరో రూ.200 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా నర్సింగ్‌ కాలేజీలను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్‌ హాస్పిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ విధానానికి రూ.268 కోట్లను ప్రతిపాదించింది. 

ఆయుష్మాన్‌ భారత్‌కు రాష్ట్ర వాటాగా రూ.108 కోట్లు, మందుల కొనుగోలుకు రూ.377 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ.51 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.211.86 కోట్లు, జర్నలిస్ట్‌ల హెల్త్‌ స్కీంకు రూ.45 కోట్లు కేటాయించింది. స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్‌ల మొత్తాన్ని రూ.10 కోట్లకు పెంచింది. 

తల్లీబిడ్డల ఆరోగ్యసంరక్షణ కిట్‌లకు రూ.150 కోట్లు ప్రతిపాదించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేంద్రం నుంచి రూ.776 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది.
 


పలు రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులు ఇవీ..


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీకి బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించారు. దీంతో పాటు కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త వెటర్నరీ కళాశాలకు రూ.6.50 కోట్లను కేటాయించారు.

పరిశోధన - అభివృద్ది కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5 కోట్ల చొప్పున రూ.603.76 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమనిధికి రూ.50 కోట్లు ప్రతిపాదించారు.
 


గృహజ్యోతి’కి రూ.2,418 కోట్లు

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల్లో ఒకటైన ‘గృహజ్యోతి’ కింద నెలకు 200 యూనిట్ల కరెంటును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ పథకానికే ప్రస్తుత బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.2,418 కోట్లు కేటాయించింది. పథకం కింద అర్హులకు డిస్కంలు గత మార్చి ఒకటో తేదీ నుంచి సున్నా బిల్లులు జారీ చేస్తున్నాయి. ఈ బిల్లుల చెల్లింపుల కింద డిస్కంలకు ప్రభుత్వం రూ.2,418 కోట్లు విడుదల చేయనుంది. పథకం కింద జులై 15 నాటికి.. 45,81,676 ఇళ్లకు సున్నా బిల్లులు జారీ అయినట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. 
 

సాఫీగా మహాలక్ష్ముల ప్రయాణం 
 


ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర మహిళల ఉచిత ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా... ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లకుపైగా కేటాయించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2023 డిసెంబరు 9 నుంచి బస్సుల్లో ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రవాణా శాఖ పద్దు కింద ఆర్టీసీకి రూ.3,082.53 కోట్లను కేటాయించింది. అలాగే ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.631.04 కోట్లను, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.370.86 కోట్లను ఉచిత ప్రయాణానికి ప్రత్యేకించింది. వీటి మొత్తం రూ.4084.43 కోట్లు.  


మహిళా, శిశు సంక్షేమానికి రూ.2,669.80 కోట్లు 

రాష్ట్రంలో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.2,669.80 కోట్లు కేటాయించింది. సమీకృత శిశు అభివృద్ధి పథకానికి రూ.408 కోట్లుగా పేర్కొంది. జాతీయ న్యూట్రిషియన్‌ మిషన్‌కు రూ.34.45 కోట్లు, ఆరోగ్యలక్ష్మికి రూ.71 కోట్లు, అంగన్‌వాడీల ఉన్నతీకరణకు రూ.34.45 కోట్లు ఇస్తామంది. మహిళా సంక్షేమ కేంద్రాలు, మహిళల భద్రత, భరోసా కేంద్రాలకు నిధులను భారీగా పెంచింది. ఈ మూడు విభాగాలకు రూ.80 కోట్లు ఇచ్చింది. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి రూ.52 కోట్లు, వివాహాల ప్రోత్సాహానికి రూ.10 కోట్లు, గురుకులాలకు రూ.1.25 కోట్లు, ట్రాన్స్‌జెండర్ల భద్రతకు రూ.కోటి ఇచ్చింది.  


ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలు 

రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల(ఐటీఐ)ను ఆధునిక నైపుణ్య కేంద్రాలు(అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌-ఏటీసీ)గా మార్చేందుకు వీలుగా ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. తొలుత 25 ఐటీఐలను అభివృద్ధి చేసి పారిశ్రామిక రంగం 4.0 పేరిట దీర్ఘ, స్వల్పకాలిక వ్యవధి కోర్సుల అమలుకు ఇప్పటికే టాటా టెక్నాలజీస్‌ సంస్థతో కార్మిక శాఖ ఒప్పందం చేసుకుంది. వీటికోసమే రూ.300 కోట్లు కేటాయించింది. ఐటీఐల ఉన్నతీకరణ, స్కిల్‌ మిషన్, అప్రెంటిస్‌ పథకాలకు రూ.47.33 కోట్లు ఇచ్చింది. కార్మిక శాఖ, బీమా వైద్య సేవల కోసం కార్మికశాఖకు రూ.881.85 కోట్లు కేటాయించింది. ఇందులో బీమా వైద్య సేవలకు రూ.102 కోట్లుగా పేర్కొంది. 


ఐటీకి రూ.773.86 కోట్లు 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) శాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.773.86 కోట్లు కేటాయించింది. ఐటీ మౌలిక సదుపాయాలకు రూ.100 కోట్లు, వీహబ్‌కు రూ.9 కోట్లు, టాస్క్‌కు రూ.30 కోట్లు, టీహబ్‌కు రూ.40 కోట్లు, టీఫైబర్‌ గ్రిడ్‌కు రూ.50 కోట్లు, టీవర్క్స్‌కు రూ.25 కోట్లు కేటాయించింది.


అటవీ శాఖకు రూ.1,064 కోట్లు 

రాష్ట్ర బడ్జెట్‌లో అటవీ, పర్యావరణ శాఖకు రూ.1,064 కోట్లు కేటాయించారు.  హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో ఉన్న వివిధ జూపార్కులకు రూ.12 కోట్లు, అడవుల నరికివేతను నిరోధించడానికి రూ.5 కోట్లు, ఫారెస్ట్‌ కళాశాలకు రూ.102 కోట్లు, అభయారణ్యాలకు రూ.60.95 కోట్లు కేటాయించారు. 

దారిన పడనున్న రోడ్లు!

ఈనాడు, హైదరాబాద్‌: రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపును పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖకు రూ.5,790 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ 4,552 కోట్లు కేటాయించారు. దానితో పోల్చితే ఇది రూ.1,238 కోట్లు అదనం.

ఈ ఆర్థిక సంవత్సరంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.3,031 కోట్లు వెచ్చించనున్నారు. అందులో రాష్ట్ర రహదారులకు రూ.519 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.632 కోట్లు ఖర్చు చేస్తారు. భవనాలకు రూ.1,769 కోట్లు, పీపీపీ ప్రాజెక్టులకు రూ.90 కోట్లు, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు రూ.11 కోట్లు కేటాయించారు. 

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌) పేరుతో ప్రభుత్వం హైదరాబాద్‌ నలుమూలలా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. అందుకు అయ్యే వ్యయాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో తీసుకుంటుంది. పలు జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 

గతంలో నిర్మించిన సచివాలయం, అమరవీరుల స్మారక స్తూపం తదితరాల చెల్లింపులకు ఆ నిధులు వినియోగించనున్నట్లు సమాచారం. మరోవైపు పౌర విమానయాన విభాగం కోసం రూ.41 కోట్లు కేటాయించింది.

నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ దిశగా..

ఈనాడు, హైదరాబాద్‌: ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌ పలురకాల ఒడిదొడుకుల కారణంగా మూతపడింది. దీన్ని పునరుద్ధరించే విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌ పునరుద్ధరణకు ఈ ఏడాది జనవరిలో ఒక కమిటీని నియమించింది. త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.139 కోట్లు కేటాయించారు. 


పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.2,762 కోట్లను పరిశ్రమల శాఖకు కేటాయించింది. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ నైపుణ్య విశ్వవిద్యాలయం (స్కిల్‌ యూనివర్సిటీ)’ని ఈ ఏడాదే నెలకొల్పాలని నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ వర్సిటీ    కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.

చేనేతకు చేయూత.. 

రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వివిధ వస్త్రాలను (విద్యార్థుల యూనిఫారాలు, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్‌షీట్లు వంటివి..) తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా స్థానిక నేతన్నల నుంచే సేకరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో చేనేత, జౌళి పరిశ్రమలకు రూ.370 కోట్లను కేటాయించింది. తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను రాష్ట్రంలో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.  

రయ్‌ రయ్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ 

హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు వెలుపల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.గతంలో కంటే అధికంగా 2024-25 వార్షిక బడ్జెట్‌లో రూ.1,525 కోట్లు కేటాయించింది. ప్రాంతీయ రింగు రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించదలిచాయి.

 ఉత్తర భాగం భూసేకరణకు ప్రస్తుతం కేటాయించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించేందుకు మార్గం సుగమమైంది. దీంతోపాటు శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేటాయించిన నిధులతో రహదారి పనులు చకచకా సాగేందుకు సానుకూలత ఏర్పడింది. 



మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి....
 

Click here For more details ....

 

Posted Date: 26-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని