• facebook
  • whatsapp
  • telegram

దేశ ఆర్థికానికి వెన్నుదన్ను



భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవల 90వ వార్షికోత్సవం జరుపుకొంది. 1934లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం కింద స్థాపితమైన ఆర్‌బీఐని స్వాతంత్య్రం వచ్చిన తరవాత 1949లో జాతీయం చేశారు. మెరుగైన ద్రవ్య నియంత్రణ కోసం స్థాపించిన ఆర్‌బీఐ నేడు వర్ధమాన దేశాలన్నింటి కేంద్ర బ్యాంకులకన్నా సమర్థంగా పనిచేస్తున్నట్లు కితాబులందుకొంటోంది.


ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంకు 1668లో స్వీడన్‌లో ఏర్పాటయ్యింది. ఆ తరవాత 1694లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ స్థాపితమైంది. ఇవి రెండూ ప్రభుత్వ రుణ బాండ్లను కొనుగోలు చేయడానికి జాయింట్‌ స్టాక్‌ కంపెనీలుగా ఏర్పడ్డాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సైతం వాటాదారులతో జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా నమోదైంది. ఆర్‌బీఐ ఏర్పడక ముందు బ్రిటిష్‌ పాలనలోని భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులు (బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బోంబే) కీలకంగా ఉండేవి. 1935లో అవి మూడూ కలిసి ఇంపీరియల్‌ బ్యాంక్‌గా విలీనమయ్యాయి. అదే ఆ తరవాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా రూపాంతరం చెందింది. మొదట్లో కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పనిచేసిన ఆర్‌బీఐ 1937లో ముంబయికి మారింది.


వోస్ట్రో ఖాతాలు

ద్రవ్యోల్బణం వల్ల జాతీయ కరెన్సీ విలువ క్షీణించడాన్ని నిలువరించడానికి, ప్రభుత్వం బాండ్ల రూపంలో రుణాలు స్వీకరించడానికి ఫ్రాన్స్‌లో కేంద్ర బ్యాంకును 1800లో నెపోలియన్‌ ఏర్పాటు చేశారు. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ 20వ శతాబ్దంలో స్థాపితమైంది. ఆర్‌బీఐ, ఫెడరల్‌ రిజర్వుల మాదిరిగా అన్ని కేంద్ర బ్యాంకులు ద్రవ్య (కరెన్సీ) స్థిరత్వాన్ని కాపాడుతూ, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే విధానాలను అనుసరిస్తాయి. 1914 వరకు దేశాల కరెన్సీ విలువ వాటి వద్దనున్న బంగారం నిల్వలపై ఆధారపడి ఉండేది. బంగారం నిల్వలు క్షీణిస్తే దేశ కరెన్సీ విలువ సైతం తగ్గిపోయేది. దాన్ని అరికట్టడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేవి. అధిక వడ్డీ లభించే చోట్లకు బంగారం పరుగుతీసేది. 1970ల్లో చమురు విక్రయాలను డాలర్లలో జరపడం మొదలుపెట్టిన తరవాత బంగారం మునుపటి ప్రాధాన్యం కోల్పోయింది.


ప్రారంభంలో వ్యవసాయ సరకుల ధరలపై ఆర్‌బీఐ ఎక్కువగా దృష్టి పెట్టేది. ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేస్తూ వ్యవసాయం, పరిశ్రమలకు తగినన్ని పెట్టుబడులు లభించేలా ప్రాధాన్యమిచ్చేది. అయితే, విత్త లోటు ఎగబాకుతుండటం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) తక్కువగా ఉండటం ఆర్‌బీఐకి సమస్యలుగా నిలిచేవి. 1984-85లో జీడీపీలో 8.8శాతంగా ఉన్న కేంద్రం, రాష్ట్రాల విత్త లోటు 1990-91కల్లా 9.4శాతానికి పెరిగింది. అంతలో గల్ఫ్‌ యుద్ధం విరుచుకుపడటంతో చమురు ధరలు పెరిగిపోయి వాణిజ్య లోటు హెచ్చింది. విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోవడంతో భారత్‌ బంగారు నిల్వలను తాకట్టు పెట్టి ఐఎంఎఫ్‌ నుంచి రుణసేకరణ జరపాల్సి వచ్చింది. 1991 ఆర్థిక సరళీకరణ తరవాతి నుంచి పరిస్థితి మెరుగుపడసాగింది. అయినా భారత్‌ 2011 నుంచి చమురు దిగుమతులపై ఏటా భారీగా వెచ్చిస్తోంది. గడచిన రెండేళ్లలో వరసగా రూ.12 లక్షల కోట్లు, రూ.16 లక్షల కోట్ల చొప్పున ఖర్చు చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలతో చమురు దిగుమతులు, వాటికి డాలర్లలో చెల్లింపులు సమస్యాత్మకంగా మారాయి. అందుకే భారత ప్రభుత్వం, ఆర్‌బీఐ గడచిన 15 ఏళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని రూపాయల్లో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి.


అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచడానికి గతేడాది ఆగస్టులో రిజర్వు బ్యాంకు వోస్ట్రో ఖాతాలు తెరవడానికి 22 దేశాల కేంద్ర బ్యాంకుల్ని అనుమతించింది. ఈ ఖాతాలను తెరిచిన వాటిలో శ్రీలంక, బ్రిటన్‌, జర్మనీ, రష్యా, బంగ్లాదేశ్‌, ఇజ్రాయెల్‌, ఇరాన్‌లు ఉన్నాయి. ఈ ఖాతాల ద్వారా భారతీయ వర్తకులు విదేశాల నుంచి దిగుమతుల కోసం రూపాయల్లో చెల్లింపులు జరపగలుగుతారు. మన ఎగుమతిదారులు చెల్లింపులు స్వీకరించవచ్చు. దాదాపు 64 దేశాలు భారత్‌లో వోస్ట్రో ఖాతాలు తెరవడానికి సుముఖంగా ఉన్నాయి. ఈ ఖాతాల వల్ల డాలర్లు, యూరోలు, బ్రిటిష్‌ పౌండ్లు, జపనీస్‌ యెన్‌ వంటి విదేశీ కరెన్సీ నిల్వలను ఆదా చేసుకుని రూపాయల్లో జమలు, చెల్లింపులు జరపవచ్చు. దీనివల్ల రూపాయి క్రమంగా అంతర్జాతీయ కరెన్సీగా రూపాంతరం చెందడానికి బాటలుపడతాయి. ఇప్పటికే పలు దేశాలు డాలర్‌, యూరో, పౌండ్‌, యెన్‌ (బిగ్‌ 4)లకు దూరం జరిగి సొంత కరెన్సీలలో వ్యాపారం జరపాలని చూస్తున్నాయి. 1999లో బిగ్‌ 4 కాకుండా ఇతర కరెన్సీల వినియోగం కేవలం రెండు శాతం; 2023కల్లా అది 12శాతానికి పెరిగింది. దీనివల్ల డాలర్లకు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీల వినియోగం పుంజుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.


నియంత్రణ అవసరం

నేడు కరెన్సీ లావాదేవీల్లో డిజిటల్‌ సాంకేతికతల వినియోగం పెరుగుతోంది. క్రిప్టో, డిజిటల్‌ కరెన్సీల నియంత్రణ ఆర్‌బీఐకి సవాలుగా మారనుంది. క్రిప్టోల రూపంలో అక్రమ ధన చలామణీ, ఇతర చట్టవిరుద్ధ వినియోగాలు పెరుగుతాయి. బటన్‌ నొక్కగానే కోట్లకు కోట్లు సరిహద్దు దాటిపోతాయి. ఇది బ్యాంకింగ్‌ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పౌరులు క్రిప్టోల వంటి డిజిటల్‌ కరెన్సీలకు మారకుండా అధికార కరెన్సీపై, బ్యాంకులపై నమ్మకం ఉంచాలని, అదే వారికి భద్రమని ప్రభుత్వాలు తెలియజెప్పాలి. డిజిటల్‌ కరెన్సీలకు ఆర్‌బీఐ పటిష్ఠ నియంత్రణ చట్రాన్ని ఏర్పరచాలి. ఇప్పుడు చైనా ప్రాబల్యం పెరగడం, ఉక్రెయిన్‌, హమాస్‌ యుద్ధాలతో అంతర్జాతీయ రాజకీయ వాతావరణం మారడం కొత్త సమస్యలను తీసుకొచ్చాయి. కరెన్సీ విలువలో, పెట్టుబడుల ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఒత్తిళ్లను తెచ్చిపెడుతున్నాయి. అమెరికా సర్వం సహాధిపత్యానికి బదులు బహుళధ్రువ ప్రపంచం ఏర్పడనుంది. మారిన కాలానికి అనుగుణంగా తగిన విధానాలను రిజర్వు బ్యాంకు రూపొందించి, సమర్థంగా అమలు చేయాలి.


బ్రిక్స్‌ కూటమి కృషి

కువైట్‌, బహ్రెయిన్‌, యూఏఈ, ఖతార్‌ దేశాల్లో 1960ల్లో కొంతకాలంపాటు రూపాయి చట్టబద్ధ కరెన్సీగా చలామణీ అయ్యింది. 1966లో రూపాయి విలువ తగ్గింపుతో ఆ దేశాలు మన కరెన్సీకి స్వస్తి చెప్పాయి. విచ్ఛిన్నం కాకముందు వరకు సోవియట్‌ యూనియన్‌ ఇండియాతో రూపాయలు-రూబుళ్లలో వ్యాపారం సాగించేది. సోవియట్‌ కుప్పకూలిన తరవాత అదీ నిలిచిపోయింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల 2022 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో మళ్ళీ రూపాయి వినియోగానికి ప్రయత్నాలు పుంజుకొన్నాయి. డాలర్‌ ఆధిపత్యం నుంచి తప్పించుకోవాలని పలు దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి మొగ్గుచూపుతున్నాయి. బ్రిక్స్‌ కూటమి ఈ దిశగా ముమ్మరంగా కృషి చేస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు

‣ ఆయువు తోడేస్తున్న వాయువు

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

‣ రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?

‣ అయోమయంలో అమెరికా ఓటరు

‣ మాట మార్చిన ముయిజ్జు

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

Posted Date: 15-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం