• facebook
  • whatsapp
  • telegram

చిరకాల స్నేహం... బలమైన బంధం

మూడు దశాబ్దాల భారత్‌-ఇజ్రాయెల్‌ మిత్రత్వం

భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య దౌత్య సంబంధాలు పురుడు పోసుకొని 30 ఏళ్లు పూర్తి కావస్తున్న వేళ విభిన్న రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని ఇరుదేశాలూ గుర్తించాయి. కిందటేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ‘కాప్‌-26’కు హాజరైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ తొలిసారి భేటీ అయ్యారు. భవిష్యత్తులో శాస్త్రీయ ఆవిష్కరణలు, రక్షణ, సైబర్‌ భద్రత, పరిశోధనలు, వ్యవసాయం, వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆయన చెబుతున్నారు. బెన్నెట్‌ ఈ నెలారంభంలో భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా- ఆయనకు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో పర్యటన జూన్‌కు వాయిదా పడింది.

పశ్చిమాసియాతో గాఢానుబంధం

దశాబ్దాల వైరాన్ని వీడి అరబ్‌ దేశాలకు ఇజ్రాయెల్‌ స్నేహహస్తం అందించిన తరవాత పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ ముఖచిత్రంలో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చొరవతో 2020 నాటి ‘అబ్రహాం అకార్డ్‌’ ఒప్పందం మేరకు యూఏఈతో ఇజ్రాయెల్‌ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ మూడు దేశాలకు భారత్‌ను జతకూరుస్తూ పశ్చిమ క్వాడ్‌గా వ్యూహాత్మక చతుర్భజ కూటమికి బీజం పడింది. రక్షణ, వాణిజ్యం, సైన్స్‌, పరిశోధనల రంగాల్లో ముందంజలో ఉన్న ఈ దేశాలతో చెలిమిని భారత్‌ బలంగా కోరుకుంటోంది. ఇజ్రాయెల్‌తో దీర్ఘకాలంగా సంబంధాలున్నా, 1992లో పీవీ జమానాలో మొదలైన దౌత్యసహకారం వాజపేయీ హయాంలో సుసంపన్నమైంది. పోఖ్రాన్‌ అణుపరీక్షలను సమర్థించిన ఇజ్రాయెల్‌, కార్గిల్‌ యుద్ధసమయంలో హెరాన్‌ డ్రోన్లను, ఆయుధ సంపత్తిని సమకూర్చి పాకిస్థాన్‌పై పైచేయి సాధించడంలో దోహదపడింది. సైనిక సామగ్రి, రక్షణ పరికరాల సరఫరాలో భారత్‌కు రష్యా తరవాత అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2017లో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన, మరుసటి ఏడాది అప్పటి ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ దిల్లీ సందర్శన తరవాత ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రెండేళ్ల కిందట కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌ రూ.14 వేల కోట్లు వెచ్చించి గగనతల నిఘా వ్యవస్థలైన రెండు ఫాల్కన్‌ ముందస్తు హెచ్చరికల నియంత్రణ వ్యవస్థల(అవాక్స్‌)ను కొనుగోలు చేస్తోంది. రక్షణ సహకారంపై రానున్న పదేళ్ల అవసరాల దృష్ట్యా సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ తయారు చేసేందుకు ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది విదేశాంగ మంత్రి జైశంకర్‌ పర్యటన సందర్భంగా 2022 చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పట్టాలెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌తో సంబంధాలకు ఆకాశమే హద్దు అంటున్న బెన్నెట్‌ హయాంలో ‘మేకిన్‌ ఇండియా’ స్ఫూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో భిన్నరంగాల్లో కొత్త ఒడంబడికలకు అవకాశం ఉంది. ఆ దేశ చిప్‌ల తయారీ సంస్థ భారీ పెట్టుబడితో బెంగళూరులో సెమీకండక్టర్ల ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పబోతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థ రూపొందించిన పెగాసస్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ భారత రాజకీయాలను ఏడాదిగా కుదుపుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను దిల్లీ కొనుగోలు చేసిందా, వినియోగించిందా అనేవి శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విదేశీ ప్రభుత్వాలు అధికారికంగా వాడటానికి మాత్రమే ఇజ్రాయెల్‌ రక్షణ ఎగుమతుల నియంత్రణ సంస్థ (డీఈసీఏ) అనుమతితో ఈ సాప్ట్‌వేర్‌ను అందజేస్తోంది. దీంతోపాటు అత్యంత సురక్షితమైన సైనిక సాంకేతికతను మోదీ సర్కారు 2017లోనే కొన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల రాసిన కథనం సంచలనం రేపింది. రక్షణ, సైబర్‌ రంగాల్లో కుదిరే ఒప్పందాలకు వాణిజ్య విలువ కంటే విశ్వసనీయతే ప్రాతిపాదిక. పెగాసస్‌ వంటి సున్నిత అంశాలతో ద్వైపాక్షిక సంబంధాలు ప్రభావితం కాకుండా నిలుపుకోవడం ఇరుదేశాల కర్తవ్యం.

దౌత్య పరీక్ష

ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో పలు దేశాల అధినేతలు దిల్లీ నాయకత్వంతో ఫోన్‌ సంభాషణల్లో, వర్చువల్‌ సమావేశాల్లో రష్యాకు వ్యతిరేక వైఖరి తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. యుద్ధబీభత్సంవల్ల మానవతా సంక్షోభం, హక్కుల హననం, ఆస్తుల విధ్వంసాన్ని ఖండిస్తున్న ఇండియా- బాధిత దేశానికి మానవతా సాయాన్ని కొనసాగించడం ద్వారా సమతూకాన్ని పాటిస్తోంది. ఇజ్రాయెల్‌ సైతం ఇదే తరహా సమదూర వైఖరిని అవలంబిస్తూనే చర్చలు పరిష్కారంగా ప్రతిపాదిస్తుండం గమనార్హం. తూర్పు, పశ్చిమ క్వాడ్‌లోని మిగతా దేశాలతో పోలిస్తే ఈ రెండు దేశాల స్పందనలో సారూప్యత కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన తరవాత ఒక దశలో నఫ్తాలీ బెన్నెట్‌ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా సంఘర్షణపై ఇప్పటివరకూ భారత్‌ సమతూకంగా వ్యవహరిస్తూ వస్తోంది. అరబ్‌ గడ్డపై వచ్చిన మార్పులు, సోవియట్‌ రష్యా పతనం తరవాత క్రమంగా దిల్లీ వైఖరిలో మార్పు అనివార్యమైంది. 2017 వరకు సమగ్ర భౌగోళిక సరిహద్దులు, సార్వభౌమాధికారంతో కూడిన పాలస్తీనా దేశాన్ని కాంక్షించిన దిల్లీ- మోదీ, నెతన్యాహుల చెలిమి తరవాతే ఆ పట్టు సడలించినట్లు అర్థమవుతోంది. మూడు దశాబ్దాల మిత్రత్వం జూన్‌లో బెన్నెట్‌ భారత పర్యటన తరవాత కొత్త తీరాలకు చేరగలదని ఆశించవచ్చు.

- బోండ్ల అశోక్‌
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం