• facebook
  • whatsapp
  • telegram

నొప్పించని వైఖరి... మెప్పించిన నేర్పరి!

విజయవంతంగా మోదీ ఐరోపా పర్యటన

యావత్‌ ఐరోపా సమాజం సంక్షోభంలో కూరుకున్న వేళ- భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు అక్కడి దేశాల్లో పర్యటించి, కీలక దేశాధినేతలతో భేటీ కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా ఉత్పన్నమైన ప్రస్తుత ఉపద్రవం... రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపా ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు. ఈ పరిణామం ప్రపంచ దేశాలను మళ్ళీ రెండు శిబిరాలుగా చీలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చీలిక ప్రభావానికి లోనుకాకుండా, భారత విదేశాంగ విధాన స్వతంత్రతకు విఘాతం కలగకుండా- మోదీ యాత్ర ముగించడం దౌత్యనీతికి దర్పణం పట్టింది. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌లలో పర్యటించిన ప్రధాని- ద్వైపాక్షిక, బహుళపాక్షిక సంబంధాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఆయా దేశాధినేతలు మీడియా ఎదుట రష్యా దమనకాండను దునుమాడినా- మోదీ సంయమనం పాటించారు. ఎక్కడా మిత్రదేశం పేరు ఉటంకించలేదు. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల హననం, ఆస్తుల విధ్వంసం, అంతర్జాతీయ న్యాయసూత్రాల ఉల్లంఘనలపై విచారం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలే పరిష్కారమని విస్పష్టంగా ప్రకటించారు. సంక్షోభం నెలకొన్న దేశాల్లోనూ తటస్థ వైఖరినే ప్రదర్శించడం మన విదేశాంగ విధానంలోని దృఢత్వాన్ని చాటింది. నార్డిక్‌ దేశాలైన ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, డెన్మార్క్‌ దేశాధినేతలతో కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులోనూ యుద్ధం, పర్యవసానాలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ, దిల్లీ వైఖరిని ఎవరూ ప్రశ్నించలేదు. విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, విభిన్న రంగాల ప్రతినిధుల మధ్య సాగిన చర్చల్లోనూ పరస్పర ప్రయోజనకరమైన విషయాలకే ప్రాధాన్యం దక్కింది.

కలిసి సాగితే కలదు ప్రయోజనం

బెర్లిన్‌ వేదికగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో భేటీ తరవాత మోదీ మాట్లాడుతూ ‘ఈ యుద్ధంలో అంతిమ విజేతలెవరూ ఉండరు. యుద్ధంవల్ల సాధించే సానుకూల ఫలితమేదీ ఉండకపోగా, ప్రపంచ మానవాళి ఆహారం, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది’ అంటూ ఆందోళనను వ్యక్తపరిచారు. ఆది నుంచీ ఇండియాది శాంతి పక్షమేనని పునరుద్ఘాటించారు. మోదీ తన పర్యటనలో ద్వైపాక్షిక, బహుళపాక్షిక సంబంధాలకే ప్రాధాన్యమిచ్చారు. ఆరోదఫా అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) సమావేశం సందర్భంగా- వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారం పెంపుదలకు భారత్‌-జర్మనీ ప్రతినిధులు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. మూడేళ్ల క్రితం దిల్లీలో జరిగిన ఐజీసీ భేటీలో నాటి ఛాన్స్‌లర్‌ ఏంగెలా మెర్కెల్‌- మోదీ లక్షించిన మేరకు తాజాగా పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేలా భారత్‌కు రూ.80,430 కోట్ల రుణాన్ని జర్మనీ ప్రకటించింది. సహజ వనరుల సుస్థిర నిర్వహణకు మరో రూ.2,412 కోట్ల రుణాన్ని రాయితీగా అందించనుంది. పౌరవిమానయానం, సముద్ర పరిజ్ఞానం, విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారంతో సాగాలని నిర్ణయించారు. అమెరికా, చైనాల తరవాత ఐరోపా సమాఖ్య భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అందులో జర్మనీది అగ్రస్థానం. ఇండియాలో ఎఫ్‌డీఐల పరంగా ఏడోస్థానం. సుమారు 1,700 జర్మన్‌ కంపెనీలు ఇక్కడ నాలుగు లక్షల మందికి ఉపాధి చూపిస్తున్నాయి. భారత పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఐటీ, ఫార్మా, బయోటెక్‌, ఆటొమొబైల్‌ రంగాల్లో జర్మనీలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్రెగ్జిట్‌ అనంతరం 27 దేశాల ఈయూ కూటమిలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న జర్మనీయే పూనిక వహించి ఇండియా- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఈయూఎఫ్‌టీఏ) పట్టాలెక్కించే ప్రయత్నం చేసి ఉండాల్సింది. దేశీయ ఉత్పత్తుల ఎగుమతులకు రెండో గమ్యస్థానంగా ఉన్న ఐరోపాతో ఎఫ్‌టీఏ కుదిరితే ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరేవన్న వాదన ఉంది. గత ఐజీసీలో మోదీ-మెర్కెల్‌ ఆ దిశగా ముందడుగు వేసినా, పురోగతి లోపించింది.

సరికొత్త సమీకరణలు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను అభినందించేందుకు ఫ్రాన్స్‌లో దిగిన మోదీ రక్షణ రంగంలో పాత ఒప్పందాలను ప్రస్తావించారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆహార, వ్యవసాయ స్థాపక మిషన్‌ (ఎఫ్‌ఏఆర్‌ఎం)లో సహకారానికి ఫ్రాన్స్‌ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సౌర, పవన విద్యుత్తు వాడకాన్ని పెంచుతూ 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావడానికి కంకణబద్ధం కావాలని ఇండియా, ఫ్రాన్స్‌ నిర్ణయించాయి. యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి గోధుమల ఎగుమతులు స్తంభించినందువల్ల- భారత్‌ నుంచి ఆ లోటును పూడ్చుకోవాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. రక్షణ, అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, చైనా, రష్యాలతో పోటీగా ఎదిగిన ఫ్రాన్స్‌ 60 ఏళ్లుగా దిల్లీకి బాసటగా నిలిచింది. ఈ అనుబంధానికి కొత్త చిగుళ్లు తొడగాలన్న ఆకాంక్ష ఇరుదేశాల అధినేతల ప్రకటనల్లో ప్రస్ఫుటమైంది. ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడి అంతర్జాతీయ యవనికపై కొత్త సమీకరణలకు పురికొల్పుతోంది. ముఖ్యంగా ఐరోపా, ఆసియా ఖండాల్లోని ప్రభావశీల దేశాల వ్యూహాల్లో వేగం పెరిగింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ ఇటీవల విడివిడిగా భారత్‌లో పర్యటించి పశ్చిమ దేశాల అనుకూల వైఖరికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. మోదీ జర్మనీ పర్యటనకు కొద్దిరోజుల ముందే ఒలాఫ్‌ షోల్జ్‌ జపాన్‌లో పర్యటించారు. ఈ నెలలోనే టోక్యోలో జపాన్‌-ఈయూ సదస్సు జరగనుంది. అనంతరం క్వాడ్‌ దేశాధినేతల భేటీకి టోక్యో ఆతిథ్యం ఇవ్వనుంది. జర్మనీ వేదికగా జూన్‌లో జరగబోయే జీ-7 సదస్సుకు రావాల్సిందిగా మోదీని షోల్జ్‌ ఆహ్వానించారు. ఈ సమావేశాలకు విడిగా ఎజెండాలు ఉన్నా, ఉక్రెయిన్‌ సంక్షోభమే అంతస్సూత్రమన్నది వాస్తవం. వెరసి, యుద్ధం విషయంలో దిల్లీది తటస్థ వైఖరే అయినప్పటికీ, దాని పాత్ర విస్మరించలేనిదని అవగతమవుతోంది.

విస్తరించనున్న శాస్త్రీయ అనుబంధం

ఇండియా-నార్డిక్‌ దేశాల రెండో శిఖరాగ్ర సదస్సు ఇండో, పసిఫిక్‌ ప్రాంతంతో అట్లాంటిక్‌-ఆర్కిటిక్‌ తీరాల మధ్య దూరాలను చెరిపేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. ప్రభుత్వాల నడుమ వాణిజ్య ఆర్థిక సంబంధాలే కాదు- ప్రజల మధ్య అనుబంధం కూడా పెరగాలని ఉమ్మడి ప్రకటన ఆకాంక్షించింది. విద్య, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష, మత్స్య పారిశ్రామిక రంగాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోగలమన్న ఆశాభావాన్ని నింపింది. డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్‌ ఆతిథ్యమిచ్చిన ఈ సదస్సుకు భారత్‌ సహా భాగస్వామ్య దేశాలైన ఐస్‌ల్యాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వేల అధినేతలు హాజరయ్యారు. ప్రతి దేశంతోనూ విడివిడిగా ఇంధనం, ఆహార శుద్ధి, పెట్టుబడులు, సమాచార, సాంకేతిక రంగాల్లో నవకల్పనలు, వాతావరణ పరిశోధనల్లో భాగస్వామ్యంపై ఒప్పందాలు కుదిరాయి. అవకాశాల గని అయిన భారతావనికి విరివిగా పెట్టుబడులతో తరలిరావాలని డానిష్‌ వ్యాపార వర్గానికి మోదీ పిలుపిచ్చారు. ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో సంస్కరణలను అభిలషించిన నార్డిక్‌ వేదిక ఇండియాకు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించడం సానుకూలాంశం.

 

- బోండ్ల అశోక్‌

 

 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం