• facebook
  • whatsapp
  • telegram

మధ్యంతరం ముంగిట రాజకీయ కాక

అమెరికాలో మితవాద, ఉదారవాద శక్తుల సంఘర్షణ

 

 

ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే సంభవించిన రెండు పరిణామాలు అమెరికా రాజకీయాలు ఎటు పోతున్నాయనే చర్చను లేవనెత్తాయి. ఆ పరిణామాల్లో ఒకటి తుపాకుల నియంత్రణ బిల్లు, రెండోది- మహిళలకు గర్భస్రావ హక్కును నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. నవంబరులో అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) మధ్యంతర ఎన్నికలకు పాలక డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారని సూచించే పరిణామాలు ఇవి. తుపాకులు ధరించడం రాజ్యాంగ హక్కు అని భావించే రిపబ్లికన్లు- ఇటీవలి రెండు సామూహిక కాల్పుల ఘటనలపై జనాగ్రహాన్ని చూసి కాస్త పట్టు సడలించారు. తుపాకుల నిషేధం బదులు నియంత్రణకు తలూపారు. 18 నుంచి 20 ఏళ్ల వయోవర్గంలోని వారు తుపాకులు కొనదలచుకుంటే వారిపై కట్టుదిట్టంగా తనిఖీలు జరపాలని ప్రతిపాదించిన తుపాకుల నియంత్రణ బిల్లు రిపబ్లికన్‌ ఎంపీల మద్దతు వల్ల కాంగ్రెస్‌ ఆమోదం పొందింది. అధ్యక్షుడు జో బైడెన్‌ దానిపై సంతకం చేసి చట్టరూపమిచ్చారు. తుపాకీ హింసపై పెల్లుబికిన ప్రజా నిరసన నవంబరు మధ్యంతర ఎన్నికల్లో తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అంచనాతో రిపబ్లికన్లు కాస్త పట్టు సడలించారు. ఆ వెంటనే బహిరంగంగా తుపాకులు ధరించి తిరగడాన్ని నిషేధిస్తూ న్యూయార్క్‌ రాష్ట్రం 1913లో చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో తుపాకీ ధారణ రాజ్యాంగ హక్కనే రిపబ్లికన్‌ పార్టీ వాదానికి బలం వచ్చింది.

 

పార్టీల మధ్య సమరం

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా నేడు సుప్రీం న్యాయమూర్తుల్లో అత్యధికులు రిపబ్లికన్‌ అనుకూల మితవాదులే. ఆరుగురు మితవాద న్యాయమూర్తులు తుపాకీ ధారణకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, ముగ్గురు ఉదారవాద జడ్జీలు వ్యతిరేకించారు. మితవాద న్యాయమూర్తులు అంతటితో ఆగలేదు. చట్టసమ్మత కారణాలతో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకు హక్కు ఉందని 1973లో రో వెర్సస్‌ వేడ్‌ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును మార్చేశారు. గర్భస్రావ హక్కును సుప్రీంకోర్టు మళ్ళీ 6-3 తేడాతో కొట్టివేసింది. దీనిపై దేశవ్యాప్తంగా అమెరికన్‌ మహిళలు నిరసనలకు దిగారు. వారి ఓట్లు వచ్చే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లవైపు మళ్లుతాయనే అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద అమెరికాలో రాజకీయ శక్తుల పునరేకీకరణ క్రమంగా ఉద్ధృతమవుతోంది. భారత్‌లో మాదిరిగా అమెరికాలో న్యాయమూర్తుల పదవీ కాలంపై పరిమితి ఉండదు. వారు జీవిత కాలం పదవిలో కొనసాగవచ్చు. అందువల్ల డెమోక్రాట్‌ ప్రభుత్వ ఉదారవాద నిర్ణయాలకు మితవాద సుప్రీం న్యాయమూర్తులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల మధ్య నడుస్తున్న రాజీలేని సైద్ధాంతిక సమరం వల్ల అమెరికా ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయి. మితవాద, ఉదారవాద శక్తుల సంఘర్షణ రేపు కట్టుతప్పి అంతర్యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓడిపోవడంతో ఆయన అనుయాయులు 2021 జనవరిలో కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌పై విరుచుకుపడటం ప్రమాద సంకేతమే. ట్రంప్‌ మద్దతుదారులైన అతిమితవాద శక్తులు శ్వేతజాతి ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి అంతర్యుద్ధానికి దిగాల్సిందేనని రేడియో ఛానళ్లలో, వెబ్‌సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో ఊదరగొడుతుంటాయి. ఆ శక్తులే క్యాపిటల్‌ హిల్‌పై దాడికి ప్రేరేపించాయి. గతంలో కాంగ్రెస్‌ దిగువ సభలో రిపబ్లికన్‌ సభ్యుడిగా ఉన్న స్టీవ్‌ కింగ్‌ 2018లోనే- అమెరికా అంతర్యుద్ధం అంచున ఉందని ట్వీట్‌ చేశారు. అమెరికా సమాజంలో శ్వేతజాతీయుల సంఖ్య నానాటికీ తగ్గిపోతూ మైనారిటీగా మారిపోతారనే భయం నుంచి ఈ హింసా ప్రేలాపనలు పుట్టుకొస్తున్నాయి. ఆ భయమే శ్వేతజాతి ఓటర్లు, మత ఛాందసవాదులను రిపబ్లికన్‌ పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా నిలుపుతోంది. మరోవైపు తెల్లజాతివారిలో విద్యావంతులైన యువతరం, సాంకేతిక నిపుణులు, మహిళలు, మైనారిటీలు ఈ పెడధోరణులను తీవ్రంగా ప్రతిఘటిస్తూ డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. 2040కల్లా అమెరికాలోని 30 శాతం భూభాగం నుంచి ఎన్నికయ్యేవారు కాంగ్రెస్‌ ఎగువ సభ అయిన సెనేట్‌లో 70 శాతం సీట్లను చేజిక్కించుకుంటారని రాజకీయ పండితుల అంచనా. వారిలో అత్యధికులు రిపబ్లికన్‌ సెనేటర్లు అయితే, డెమోక్రాట్లకు పంటి కింద రాయిలా పరిణమిస్తారు.

 

కీలకంగా ఎన్నికలు

పార్లమెంటులో తమకు మెజారిటీ లేదు కాబట్టి నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు డెమోక్రటిక్‌ పార్టీని బలపరచి మహిళలకు గర్భస్రావ హక్కును పునరుద్ధరించడానికి అవకాశమివ్వాలని బైడెన్‌ పిలుపిచ్చారు. తుపాకుల నియంత్రణ బిల్లును ఉభయ సభలూ ఆమోదించడం బైడెన్‌కు ఊతమిచ్చే అంశమే. వాతావరణ మార్పుల నిరోధానికి బైడెన్‌ తీసుకుంటున్న చర్యలకు జనామోదం లభిస్తోంది. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తుపాకీ హింస అని 49 శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు మే నెలలో యూగవ్‌ సర్వే తేల్చింది. గర్భస్రావ హక్కును తొలగించడానికి 70 శాతం అమెరికన్లు వ్యతిరేకమని అదే సర్వే తెలిపింది. మధ్యంతర ఎన్నికల్లో తుపాకీ హింస, గర్భస్రావ హక్కు ప్రధాన సమస్యలుగా నిలిస్తే ఓటర్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ, ఇతర అంశాల్లో బైడెన్‌ పనితీరు మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకమానదు. బైడెన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలను ఆదరాబాదరా ఉపసంహరించడం విమర్శలకు లోనైంది. కొవిడ్‌ మరణాలను అరికట్టడంలో ఆయన విఫలమయ్యారనే వాదనా ఉంది. అమెరికాలో 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో 8.6 శాతం ద్రవ్యోల్బణం నమోదవడమూ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అమెరికాలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం అమెరికన్ల జేబులకు చిల్లులుపెడుతోంది. ఆర్థిక నిర్వహణలో డెమోక్రాట్లకన్నా రిపబ్లికన్లే మెరుగని అత్యధిక ఓటర్లు భావించడం బైడెన్‌కు ప్రమాద సంకేతం. ఉక్రెయిన్‌లో రష్యాతో వెనకడుగు వేయించడంలో బైడెన్‌ సఫలమవుతారని చెప్పలేని స్థితి నెలకొని ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం అనేక సంవత్సరాలు సాగేలా ఉందని నాటో వర్గాలే ఒప్పుకొంటున్నాయి. ఈ అంశాలన్నీ నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తాయి.

 

తుపాకీ హింస

ఇటీవలి వరకు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుల్లో సగంమంది వద్ద తుపాకులు ఉంటే, 21 శాతం డెమోక్రాట్‌ ఓటర్ల వద్ద మాత్రమే తుపాకులున్నాయని సర్వేలు తెలిపాయి. అయితే, పెరుగుతున్న తుపాకీ హింసను చూసి డెమోక్రాట్‌ మద్దతుదారులు-ముఖ్యంగా మహిళలు, నల్లజాతివారు కూడా తుపాకులు కొనడం మొదలుపెట్టారు. దీంతో అతిమితవాదులు కలగనే అంతర్యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా అనే సందేహం వస్తోంది. ప్రస్తుతానికి సమరం రాజ్యాంగ చట్రంలోనే నడుస్తోంది.

 

 

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 30-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం