• facebook
  • whatsapp
  • telegram

ఇటు దౌత్యరీతి... అటు ద్వంద్వనీతి!

అఫ్గాన్‌పై అగ్రరాజ్యాల మొసలి కన్నీరు

అఫ్గానిస్థాన్‌లో సంక్షోభాన్ని చల్లార్చే దిశగా దిల్లీ, ఇస్లామాబాద్‌ వేదికలుగా వేర్వేరుగా జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. లక్ష్యం, అజెండా ఒక్కటే అయినప్పటికీ... ప్రాతినిధ్య దేశాలు ఒక్కరోజు తేడాతో విడివిడిగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. నవంబర్‌ 10న దిల్లీలో అయిదు మధ్య ఆసియా దేశాలు కజకిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తుర్కిమెనిస్థాన్‌తో పాటు రష్యా, ఇరాన్‌ దేశాల ప్రతినిధులు హాజరైన సమావేశానికి భారత భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ అధ్యక్షత వహించారు. వాస్తవానికి అఫ్గాన్‌లో    పౌరపాలన కొనసాగుతున్న కాలంలో... 2018లో ఇరాన్‌ చొరవతో తొలి భేటీ జరిగింది. గత ఆగస్టులో పౌరపాలన కూలిపోయి, తాలిబన్ల శకం పునరావృతమయ్యాక- తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది.

ఉగ్రమూకల అడ్డా కారాదు...

తాలిబన్లతో ఉగ్రవాద మూకలు అంటకాగితే దాని పర్యవసానాలు ప్రపంచానికే ముప్పుగా పరిణమించే ప్రమాదమున్నదంటూ ఈ సదస్సుకు దిల్లీ పూనుకొంది. సమావేశం ప్రధానంగా ఆ దేశ ప్రజల్లో చోటుచేసుకొన్న అభద్రతాభావంపై చర్చించింది. కుందుజ్‌, కాందహార్‌, కాబూల్‌లలో ఇటీవలి ఉగ్రదాడులను ఖండించింది. అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదంటూనే... సార్వభౌమత్వం, ఐక్యత, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని సూచించింది. అఫ్గాన్‌ నేల ఉగ్రమూకల శిక్షణకు, కార్యకలాపాలకు, ఆర్థిక సహకారానికి ఆలవాలం కాకూడదని ఆశించింది. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని స్థితికి దిగజారిన అఫ్గాన్‌కు ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాల పునరుద్ధరణ జరూరుగా జరగాలని గుర్తుచేసింది. ఈ సంక్షుభిత తరుణంలో గత సెప్టెంబర్‌ నాటి తీర్మానం మేరకు ఐరాస తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలని కర్తవ్యబోధ చేసింది. ప్రపంచ దేశాల సాయం నిరాటంకంగా, దుర్విచక్షణకు తావులేకుండా అందరికీ అందాలని పేర్కొంది. అధికార, రాజకీయ వ్యవస్థల్లో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం దక్కినప్పుడే అంతర్గత సయోధ్య సాధ్యమని పాలకులకు హితవు పలికింది. తాలిబన్ల తిరుగుబాటుపై తొలుత ఆచితూచి స్పందించిన దిల్లీ... చివరికి అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించక తప్పని అనివార్యతను ఎదుర్కొంది. 20 ఏళ్లుగా ఇండియా సుమారు రూ.22 వేల కోట్లు వెచ్చించి అక్కడ ఎన్నో పునరుద్ధరణ ప్రాజెక్టులు చేపట్టింది. పార్లమెంటు సౌధాన్ని నిర్మించింది. ఈ వ్యయప్రయాసలు వృథా కాకూడదని సంకల్పించింది. ఇరుగుపొరుగు దేశాలను ఆహ్వానించి, చర్చించి దిల్లీ ప్రకటనను వెలువరించింది. ఈ చర్చలను, తీర్మానాలను స్వాగతించిన తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ సాహీన్‌ దీన్ని ఓ సానుకూల ముందడుగుగా అభివర్ణించారు.  దిల్లీ సదస్సుకు ఆహ్వానాన్ని తిరస్కరించిన చైనా, పాకిస్థాన్‌లు నవంబర్‌ 11న రష్యా, అమెరికా భద్రతాధికారులతో కలిసి ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యాయి. గతంలోనూ భారత్‌ ప్రమేయం లేకుండా దోహా, మాస్కో వేదికలపై త్రైపాక్షిక చర్చలు జరిపిన చైనా, పాక్‌, రష్యాలు... తాజా భేటీకి అమెరికానూ ఆహ్వానించి ‘ట్రొయికా ప్లస్‌’ పేరిట సందేశాన్ని పంపించాయి. ఆ రోజు ఇస్లామాబాద్‌లోనే ఉన్న తాలిబన్‌ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీ ఆ సమావేశానికి హాజరు కాలేదు. దిల్లీ భేటీకి ‘షెడ్యూలింగ్‌ ప్రాబ్లమ్‌’ అని ప్రకటించి గైర్హాజరైన చైనా విదేశాంగ శాఖకు- ఇస్లామాబాద్‌ వెళ్లడానికి అది కారణం కాకపోవడం గమనార్హం. దిల్లీ ఆహ్వానాన్ని తిరస్కరించిన పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసఫ్‌- ‘ఓ విధ్వంసకారి ఎప్పటికీ శాంతి కాముకురాలు కాలేదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. వాస్తవానికి పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిరంగమే. చైనా, పాక్‌ పాలకుల్లో తాలిబన్ల పట్ల మృదు వైఖరి మూడునెలలుగా బయటపడుతూనే ఉంది. కశ్మీర్‌లో కల్లోలానికి తాలిబన్లను పావుగా వాడుకోవాలన్నది పాక్‌ పన్నాగమైతే- ఆ అస్థిరతను అనేక మార్గాల్లో సొమ్ము చేసుకోవాలన్న చైనా కుత్సిత బుద్ధిపై ఎవరికీ అనుమానం లేదు. వ్యూహాత్మకంగా రెండు సదస్సుల్లోనూ పాల్గొన్న రష్యా- ఉగ్రవాదంపై పోరులో తాలిబన్ల వైఖరిపై సంతృప్తిని ప్రకటించింది.

నెత్తుటి నెగళ్లలో చలిమంటలు

రాజకీయ అవసరాలు, ఆయుధ వ్యాపారాలకు గల్ఫ్‌, మధ్య ప్రాచ్య దేశాల్లో నెత్తుటి నెగళ్లు రాజేసి చలికాచుకోవడం అగ్రరాజ్యాలకు మూణ్నాలుగు దశాబ్దాలుగా అలవాటైన విద్యే. అయినా మొక్కుబడిగా అఫ్గానిస్థాన్‌లో పిల్లలు, మహిళలు, మైనారిటీల హక్కులను పరిరక్షించాలని, అంతర్జాతీయ ఉగ్రముఠాలతో అఫ్గాన్‌ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను తెగ తెంచాలని, డ్రగ్స్‌ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తీర్మానాలు చేశాయి. తదుపరి భేటీలో తాలిబన్‌ ప్రతినిధులూ పాల్గొంటారని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించారు. తాలిబన్ల అమానవీయ చర్యలను ఏనాడూ ఖండించని చైనా, పాక్‌లు- ఇప్పుడు హితోక్తులు చెప్పడాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. తాలిబన్ల నుంచి అఫ్గాన్‌కు విముక్తి కల్పిస్తామంటూ రెండు దశాబ్దాల కిందట ఆ నేలపై అడుగిడిన అమెరికా, ఆ పని చేయకుండానే వెనుదిరిగింది. శాంతి పునఃస్థాపన దిశగా సరైన కార్యాచరణ చేపట్టలేదు. వెరసి ఇస్లామాబాద్‌ భేటీ వెనక చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.‘అభివృద్ధి దృక్కోణంతో వేసే ముందడుగే... ఉగ్రచర్యలకు విరుగుడు కాగలదు. అఫ్గాన్‌ భూభాగంపై నెలకొనే శాంతి ప్రాంతీయ సమగ్రతకు దోహదం చేస్తుంది. భారత్‌లోనూ అంతర్గత భద్రతకు మేలుచేస్తుంది’ అని దిల్లీ ప్రకటనలో అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం తాత్కాలిక వీటో అధికారం కలిగిన ఇండియా గత ఆగస్టు నుంచి అఫ్గాన్‌లో నెలకొన్న పరిణామాలపై సున్నితంగానే స్పందిస్తోంది. ఆ పరంపరలో తాజా డిక్లరేషన్‌ దిల్లీ దౌత్యనీతిని ప్రస్ఫుటీకరించింది. పైగా పశ్చిమాసియా దేశాలతో వ్యాపార, వాణిజ్య అవసరాలకు నైసర్గికంగా అఫ్గాన్‌ కీలకం. అక్కడి అంతర్గత, పాలనా వ్యవహారాల్లో కల్పించుకోకుండా పరస్పర ప్రయోజనాలు కాపాడుకోవడం భారత్‌ ముందున్న కర్తవ్యం. పొరుగున ఉన్న చైనా, పాక్‌లతో బంధాన్ని పెనవేసుకున్న తాలిబన్లు మున్ముందు ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్న!

మానవీయ స్పందనే మందు

అఫ్గాన్‌ భూభాగంలో శాంతి, సామరస్యం విరాజిల్లడం అక్కడి ప్రజలకే కాదు, ప్రపంచానికీ అవసరం. రానున్న చలికాలంలో గూడు, కూడు కరవై    2.30 కోట్ల మంది ఆకలితో అలమటించనున్నారని హెచ్చరికలు వస్తున్నాయి. లక్షల మంది శరణార్థులుగా మారిపోతున్నారు. ఇస్లామేతర విశ్వాసాలను వ్యతిరేకించే తాలిబన్లు... ఇప్పటికీ పాత ప్రవృత్తిని చాటుకుంటున్నారు. సినిమా హాళ్లు, బాలికల మదార్సాలను మూసివేశారు. మహిళా ఉద్యోగులపై ఆంక్షలు, బహిరంగ శిక్షలు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాటి దేశాల మానవీయ స్పందనే గాయపడ్డ మనసులకు సాంత్వననిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలను తెరిచి వస్తురవాణాను శీఘ్రతరం చేయాలి. విదేశాల నుంచి    ఆగిపోయిన 900 కోట్ల డాలర్ల సహాయాన్ని పునరుద్ధరించాలి. ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు ఎత్తివేయాలి.

- బోండ్ల అశోక్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేలిమి విద్యే దేశానికి పెన్నిధి

‣ ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం

Posted Date: 16-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం