ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీనిలో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపులు:
‣ వ్యవసాయ రంగానికి రూ.11,387కోట్లు
‣ బీసీ సంక్షేమానికి రూ.20,962 కోట్లు
‣ ఉన్నత విద్యకు రూ.2,014కోట్లు
‣ పశుసంవర్థకశాఖకు రూ.1,568కోట్లు
‣ పర్యావరణ-అటవీశాఖకు రూ.685 కోట్లు
‣ విద్యుత్ రంగానికి రూ.10,281 కోట్లు
‣ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201 కోట్లు
‣ పౌరసరఫరాల శాఖకు రూ.3,719 కోట్లు
‣ వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖకు రూ.11,387కోట్లు
‣ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి రూ.685 కోట్లు
‣ రవాణా రంగానికి రూ.9,617 కోట్లు
‣ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.18,518 కోట్లు
‣ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,145 కోట్లు
‣ బీసీ సబ్ ప్లాన్‌కు రూ. 29,143 కోట్లు
‣ ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు
‣ విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.236కోట్లు
‣ ఎస్సీ పారిశ్రామిక వేత్తల ఇన్సెంటివ్‌లకు రూ.175 కోట్లు
‣ గ్రామీణాభివృద్ధికి రూ.17,109 కోట్లు
‣ కొత్త వైద్యకళాశాలలు, ఆస్పత్రులకు రూ.320 కోట్లు
‣ వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
‣ 104 సర్వీసులకు రూ.140కోట్లు, 108 సర్వీసులకు రూ.133 కోట్లు
‣ ఆస్పత్రుల్లో నాడు-నేడుకు రూ.500 కోట్లు
‣ ఆశా వర్కర్ల గౌరవ వేతనాలకు రూ.343 కోట్లు
‣ రేషన్ బియ్యం కోసం రూ.3,100 కోట్లు.. బియ్యం డోర్ డెలివరీకి రూ.200 కోట్లు
‣ అంగన్వాడీ కోసం రూ.1,517 కోట్లు.. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారానికి రూ.1200 కోట్లు.
‣ గ్రామీణ తాగునీటి సరఫరాకు 1,149 కోట్లు
‣ నియోజకవర్గాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి రూ.350 కోట్లు
ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టేశారు. హైకోర్టు ఆదేశాల్నీ పెడచెవిన పెట్టి, అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపించారు. మద్య నిషేధం హామీపై మళ్లీ మడమ తిప్పారు. 2022 - 23లో స్టేట్ ఎక్సైజ్ ఆదాయాన్ని ఏకంగా రూ.16,500 కోట్లుగా అంచనా వేశారు. అంటే మద్యం నుంచి మరింత ఆదాయం పిండుకోవడమే తమ సర్కారు లక్ష్యమని చెప్పకనే చెప్పేశారు. కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు నేతిబీరలో నెయ్యి చందమే అని మరోసారి నిరూపించారు. పెండింగ్ బిల్లులు ఎలా చెల్లిస్తారో చెప్పకుండా నే పద్దు చుట్టేశారు.
‣ వాస్తవ రాబడిని అంచనాల్లో పేర్కొనకుండా, కేంద్రం నుంచి, ఇతర రూపాల్లో వచ్చే నిధుల్నీ భారీగా ఊహిస్తూ... భారీ అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే చేసింది. ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు, చేస్తున్న ఖర్చుకూ పొంతన ఉండటం లేదు. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2020 - 21 బడ్జెట్ అంచనాల్లో 83 శాతమే ఖర్చు చేయగా, 2021 - 22 బడ్జెట్ అంచనాల్నీ ప్రభుత్వం కుదించింది. రూ.2.29 లక్షల కోట్ల అంచనాల్ని రూ.2.09 లక్షల కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ ఏకంగా రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. మూలధన వ్యయం అంచనాల్లోనూ ఎక్కడా తగ్గలేదు.
అప్పులు
‣ ఏకంగా రూ.30,679 కోట్లను మూలధన వ్యయంగా ప్రతిపాదించారు. 2021 - 22 బడ్జెట్‌లోనూ మూలధన వ్యయాన్ని రూ.31,198 కోట్లుగా అంచనా వేశారు. సవరించిన అంచనా ప్రకారం చేసిన ఖర్చు రూ.18,529 కోట్లు మాత్రమే. ఆదాయం అంచనాలకు, వాస్తవ రాబడికీ పొంతన లేకపోయినా.. అంకెల విన్యాసాలు మాత్రం మానడం లేదు. 2020 - 21లో రెవెన్యూ ఆదాయం రూ.1,61,958 కోట్లు వస్తుందనుకుంటే రూ.1,17,136.18 కోట్లే వచ్చింది. 2021 - 22లో రూ.1,77,196 కోట్లు వస్తుందనుకుంటే జనవరి వరకు వచ్చింది రూ.1.11 లక్షల కోట్లే. అయినా తగ్గకుండా 2022 - 23 బడ్జెట్‌లో మళ్లీ రెవెన్యూ ఆదాయాన్ని రూ.1,91,225 కోట్లుగా చూపించారు.
‣ ఇప్పటికే చేసిన రుణాలు కొండలా పేరుకుపోతున్నా కొత్త అప్పులకూ వైకాపా ప్రభుత్వం ఎక్కడా జంకడం లేదు. ప్రజా రుణంతో పాటు, కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇవ్వడం ద్వారానూ భారీగా అప్పులు చేస్తోంది. 2022 - 23లో రూ.55 వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలతో కలిపి, రాష్ట్ర ఆదాయాన్ని రూ.1,91,225 కోట్లుగా పేర్కొంది. రెవెన్యూ లోటును రూ.17,036 కోట్లుగా పేర్కొంది. గత అనుభవాల్ని బట్టి చూస్తే, ప్రభుత్వం రెవెన్యూలోటు నియంత్రణకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం వల్ల ఇది అనేక రెట్లు పెరుగుతోంది. 2021 - 22 బడ్జెట్ అంచనాల్లో వివిధ నగదు బదిలీ పథకాలకు రూ.48,083 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం రూ.39,615.98 కోట్లుగా చూపించింది. అంటే రూ.8,217 కోట్ల వరకు కోత వేసింది. హాజరుతో ముడిపెట్టి ఈ సంవత్సరం అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టి సుమారు రూ.6,500 కోట్లు మిగుల్చుకుంది. వసతి దీవెనలో రూ.1,134 కోట్లు, విద్యా దీవెనలో రూ.449.13 కోట్లు, సామాజిక భద్రతా పింఛన్లలో రూ.247.55 కోట్లు, రైతులకు సున్నా వడ్డీ పథకంలో 124.13 కోట్లు మిగిలింది.
సున్నకు సున్న.. హళ్లికి హళ్లి!
‣ నవరత్నాలు, ఉచిత పథకాలకు తప్ప వ్యవసాయం, సాగునీరు వంటి ప్రాధాన్య రంగాలకు అంతంత మాత్రం కేటాయింపులతోనే సరిపెట్టారు. 2022 - 23 బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.11,482 కోట్లు కేటాయించారు. దీనిలో జీతాలు, రెవెన్యూ వ్యయాలు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులు పోగా, నికరంగా ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించేది అతి స్వల్పం. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రూ.43,052 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
‣ మద్యనిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం, మూడేళ్లయినా దాన్ని అమలు చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ నుంచి ఏకంగా రూ.16,500 కోట్లు ఆదాయం పిండుకోవాలని నిర్ణయించడంతో.. నాలుగో ఏడాదీ మద్యనిషేధం అమలు కొండెక్కినట్లే కనిపిస్తోంది. మనబడి, నాడు-నేడు పథకం నిధుల్లోనూ కోత పెట్టింది. రూ.4,535 కోట్లు ఇస్తామని చెప్పి, బడ్జెట్‌లో రూ.3,500 కోట్లే ప్రతిపాదించారు.వర్సిటీల కేటాయింపుల్లోనూ కోతపెట్టారు.
‣ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు పేరుతో మళ్లీ మాయాజాలం చేశారు. వివిధ కార్పొరేషన్లకు ఈసారీ నిధుల పుష్కలంగానే కేటాయించినట్టు చూపించారు. కానీ నవరత్నాల్లో భాగంగా అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులనే.. కార్పొరేషన్ల ఖాతాలో వేసి అక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారు. కార్పొరేషన్లు ఆ నిధులు సొంతంగా వాడుకోవడానికి లేదు. దీనివల్ల స్వయం ఉపాధి కల్పన లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.
‣ వైఎస్సార్ పెళ్లికానుక పథకానికి 2022 - 23 బడ్జెట్‌లోనూ ఒక్క రూపాయికూడా కేటాయించలేదు. డ్వాక్రా మహిళలకు వడ్డీ చెల్లింపునకు ఉద్దేశించిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి నిధుల్లోనూ కోత పెట్టారు. వసతి దీవెన, వాహన మిత్ర నిధుల్లోనూ కోత పడింది.
‣ కీలకమైన రైల్వే ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర వాటా కింద రూ.1,998 కోట్లు ఇవ్వాలని రైల్వే శాఖ కోరితే రూ.200 కోట్లతో సరిపెట్టారు. బడ్జెట్‌లో సివిల్ పనులకు రూ.50 కోట్లు, భూసేకరణకు రూ.150 కోట్లు మాత్రం ప్రతిపాదించారు.
‣ భారీ, మెగా పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లయితే, బడ్జెట్‌లో ప్రతిపాదించింది రూ.411.62 కోట్లు మాత్రమే.
వ్యవసాయ బడ్జెట్ రూ.43,053 కోట్లు
2022 - 23 ఆర్థిక సంవత్సరానికి రూ.43,052.78 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ‘ఉపాధి హామీతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయడానికి రూ.8,329 కోట్లు ప్రతిపాదించాం. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలకు దశలవారీగా 10 వేల డ్రోన్లను రాయితీపై సరఫరా చేస్తాం. వాటి నిర్వహణకు 20 వేల మంది గ్రామీణ యువతకు శిక్షణనిస్తాం. ఆర్గానిక్, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లు వెచ్చిస్తాం. 41,304 యూనిట్ల గొర్రెలు, మేకల కొనుగోలుకు రూ.309.78 కోట్లు ప్రతిపాదించాం. రూ.26.25 కోట్లతో 5,000 మినీ గోకులం షెడ్లను నిర్మిస్తాం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేయనున్న మత్స్య విశ్వవిద్యాలయలో 2022-23 నుంచి బోధన ప్రారంభిస్తాం. కొత్తగా 334 సహకార బ్యాంకు శాఖలు ప్రారంభిస్తాం’ అని ప్రకటించారు.
‣ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి 2019లో పునరుద్ధరించారని బుగ్గన పేర్కొన్నారు. ఆ పథకం ఎక్కడా ఆగిపోలేదు. కాంగ్రెస్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో అమలు చేసిన పథకాన్ని, తెదేపా ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ పేరుతో అమలు చేసింది. జగన్ వచ్చాక ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ అని పేరు మార్చారు.
‣ ‘జగనన్న పల్లె వెలుగు పథకం ద్వారా 25.23 లక్షల ఎల్‌ఈడీ వీధి లైట్లను సంప్రదాయ వీధి లైట్ల స్థానంలో తిరిగి అమర్చడంతో 10,912 గ్రామ పంచాయతీల్లో ఉన్న వీధి దీపాలు... స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్‌కు మార్చబడ్డాయి’ అని బుగ్గన పేర్కొన్నారు.
మండలిలో ముందే ముగిసింది
శాసనమండలిలో బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టారు. బుగ్గన కంటే 10 నిమిషాల ముందే మండలిలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు బుగ్గన ప్రసంగం నుంచి కాస్త పక్కకు వెళుతూ ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇస్తూ, మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించడంతో కొంత ఆలస్యమైంది. బుగ్గన ప్రసంగం కొనసాగుతుండగానే పుష్పశ్రీవాణి మండలిలో ప్రసంగం ముగించుకుని అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నాం
- బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన
రాష్ట్ర అభివృద్ధికి 4 మూల స్తంభాల విధానాన్ని స్వీకరించినట్లు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రతాంశాలే ప్రాతిపదికగా పాలిస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వికేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) ప్రభుత్వం సాధిస్తోందని ఆయన వివరించారు. ఇందులో భాగంగానే నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. నీతి ఆయోగ్, ఎస్‌డీజీ ఇండియా 2020 - 21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య మెరుగు, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం, సముద్ర, జలజీవుల పరిరక్షణ వంటి లక్ష్యాల్లో రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఉందని పేర్కొన్నారు.
సంక్షేమ కార్యక్రమాలతో భరోసా
రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్‌ఆర్ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాములు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీవంటి వివిధ పథకాల ద్వారా 62% జనాభా ఆధారపడుతున్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. జగనన్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, వైఎస్సార్ ఆసరా, చేయూత, చేదోడు, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్ వైద్యశాలలు, వైద్య కళాశాలలు
4 స్తంభాల సుపరిపాలన
ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా నీతిఆయోగ్ బహుళ పేదరిక నివేదిక (ఎంపీఐ)లో రాష్ట్రం ఉన్నత స్థానంలో నిలిచిందని తెలిపారు. ‘పేదరికం తగ్గింపులో రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది. వైఎస్సార్ పింఛను కానుక కింద 61.74 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది’ అని వివరించారు.
జాతీయ స్థాయిలో మెరుగు
‘గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల నెట్‌వర్క్, రైతు భరోసా కేంద్రాలవంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్య, ఆరోగ్య వ్యవస్థల ఆధునికీకరణ, మహిళా స్వయం సహాయ సంఘాలను గతంలో కంటే బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. రాష్ట్రంలో శిశు, కౌమార దశలోని పిల్లల మరణాలు 2 శాతంకంటే తక్కువగా ఉన్నాయి. బాలింతల ఆరోగ్య రక్షణలో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. పాఠశాలలకు విద్యార్థుల హాజరులో 98%కంటే ఎక్కువ వృద్ధి సాధించాం. స్థూల నమోదు నిష్పత్తిలో షెడ్యూలు కులాలు, తెగలు, బాలికల విషయంలో జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రం మెరుగ్గా ఉంది. కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 298 మంది పిల్లలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేశాం. కేంద్ర మద్దతుతో రహదారులు, గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం భారీ కార్యక్రమాలను ప్రారంభించింది’ అని బుగ్గన వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్‌సీవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేసినట్లు బుగ్గన తెలిపారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
నిధులున్నా ‘ఇంటి’కి కష్టాలే!
పేదల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నా పనులు ఆశించిన విధంగా జరగడం లేదు. ప్రభుత్వ రాయితీ (రూ.1.80 లక్షలు) తక్కువ కావడం, నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో లబ్ధిదారులు వెనకంజ వేస్తున్నారు. ప్రభుత్వమే నిర్మిస్తామని ప్రకటించినందున వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. ఇంకొందరు వడ్డీలకు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు. దీంతో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణానికి మూడేళ్లుగా కేటాయిస్తున్న బడ్జెట్ పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ.4,791.69 కోట్లు కేటాయించింది. ఇందులో పట్టణ గృహ నిర్మాణానికి రూ.3,700 కోట్లు అందుబాటులోకి రానున్నాయి.
పల్లె ఇళ్లకు హళ్లే!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్సార్ గ్రామీణ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి మూడేళ్లు గడిచినా మోక్షం లభించలేదు. గ్రామీణ నియోజకవర్గాల్లో 50 వేల ఇళ్లను మంజూరు చేస్తూ గతేడాది మార్చిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.80 లక్షలు రాయితీగా అందనుంది. ఇందులో కేంద్రం వాటా రూ.72 వేలు, రాష్ట్ర వాటా రూ.78 వేలు. ఉపాధి హామీ పథకం కింద రూ.30 వేలు ఇస్తారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఏటా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు. కానీ ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. 2022 - 23 బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.300 కోట్లు కేటాయించారు.
పెళ్లి కానుకకు మరో‘సారీ’!
వైఎస్సార్ పెళ్లి కానుక పథకానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపింది. గత ప్రభుత్వ నుంచి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు చేదోడుగా నిలుస్తున్న పథకానికి వైకాపా అధికారం చేపట్టగానే సాయం పెంచినట్లు ప్రకటించి.. అమల్లోకి తీసుకురాలేదు. 2019 - 20 బడ్జెట్‌లో రూ.716 కోట్లు కేటాయించినా ఒక్కరికీ అందించలేదు. 2020 ఏప్రిల్ 2 నుంచి పెంచిన మొత్తం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులిచ్చినా అతీగతీ లేదు. ఆ తర్వాతి రెండు బడ్జెట్లలో ప్రస్తావనే లేదు. 2022-23 నుంచి పథకాన్ని అమలు చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు. కానీ ఈసారీ నిధులు కేటాయించలేదు.
‘సున్నా వడ్డీ’కి కన్నం!
సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూనే కొన్ని పథకాల్లో కొంత మేర కోత విధించింది.
‣ డ్వాక్రా మహిళల వడ్డీ చెల్లింపులకు ఉద్దేశించిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి గతేడాది గ్రామీణ ప్రాంతాలకు రూ.865 కోట్లు కేటాయించగా దాన్ని ఈసారి రూ.600 కోట్లకు తగ్గించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.247 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పరిమితం చేసింది.
‣ గతేడాది వసతి దీవెనకు రూ.2,223.15 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.2,083 కోట్లకు తగ్గాయి.
‣ వాహన మిత్రకు రూ.285 కోట్ల నుంచి రూ.260 కోట్లు తగ్గించేసింది.
విద్యుత్ సబ్సి‘డీలా’!
గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ సబ్సిడీలకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం పెంచలేదు. ప్రభుత్వం వ్యవసాయం, వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది. వాటికి సరఫరా చేసే విద్యుత్‌కు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు సర్దుబాటు చేయాలి. విద్యుత్ వినియోగం ఏటా 8% పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన గత బడ్జెట్ కంటే సబ్సిడీ మొత్తం కనీసం 8% పెరగాలి. కానీ, గత బడ్జెట్‌లాగే రూ.5వేల కోట్లే సబ్సిడీల చెల్లింపు కోసం కేటాయించారు. కొత్త కనెక్షన్లవల్ల పెరిగే విద్యుత్ వినియోగం, విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదన అమలైతే పడే అదనపు భారం గురించి పట్టించుకోలేదు. విద్యుత్ ఛార్జీలను పెంపుపై నిర్ణయాన్ని ఏపీఈఆర్‌సీ ఈ నెలలోనే ప్రకటిస్తుంది. మార్చిన టారిఫ్ ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. ఛార్జీలు పెంచితే.. ఆ భారం ప్రజలపై పడకుండా సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాలి. బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపులు పెంచలేదు.
రైల్వే ప్రాజెక్టులకు ‘ఎర్రలైటే’!
కొత్త ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర వాటా కింద రూ.1,998 కోట్లు ఇవ్వాలని రైల్వేశాఖ కోరితే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50 కోట్లే కేటాయించారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా కింద రూ.200 కోట్లు కేటాయించినా.. ఇందులో భూసేకరణకు రూ.150 కోట్లుగా పేర్కొన్నారు. అంటే.. సివిల్ పనులకు మిగిలింది రూ.50 కోట్లే. ఈ నిధులతో నడికుడి - శ్రీకాళహస్తి లైన్, కోటిపల్లి - నరసాపురం, కడప - బెంగళూరు మార్గాల పనులు ముందుకెళ్లడం సాధ్యం కాదు. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే గత బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల భూసేకరణకు రూ.50 కోట్లు కేటాయించగా ఈసారి రూ.150 కోట్లు కేటాయించారు. ఈ నిధులు విడుదలైతే భూసేకరణకు మార్గం సుగమం కానుంది.
మైనారిటీలకు ప్రత్యేక ఉప ప్రణాళిక
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి తొలిసారిగా ఉప ప్రణాళికను ప్రవేశపెట్టింది. గతేడాది బడ్జెట్‌లోనే రూ.3,077 కోట్లతో దీన్ని పొందుపరిచినా తీసుకురాలేదు. తాజాగా రూ.3,532 కోట్ల నిధులు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం మైనారిటీల జనాభా 43.46 లక్షలు (8.8%) ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ప్రత్యేక ఉప ప్రణాళిక ప్రవేశపెట్టిన నేపథ్యంలో వీరి అభ్యున్నతికి ప్రతి శాఖ ఆ మేరకు నిధులు వెచ్చించాలి. మైనారిటీల జనాభాలో ముస్లింలు 36.18 లక్షలు (7.32%), క్రైస్తవులు 6.83 లక్షలు (1.38%), సిక్కులు 0.10 లక్షలు, బౌద్ధులు 0.04 లక్షలు, జైనులు 0.27 లక్షలు, పార్శీలు 0.04 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఉపప్రణాళికను యాక్షన్ ప్లాన్‌గా పేర్కొనడం కొసమెరుపు.

పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ?
భారీ, మెగా పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు సుమారు రూ.2వేల కోట్లు ఉండగా ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది రూ.411.62 కోట్లే. భారీ పరిశ్రమలను కొంత నిర్లక్ష్యం చేసినా.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహక బకాయిలను పూర్తిగా చెల్లించడానికి బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించింది. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో 7,107 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు ద్వారా రూ.2,099 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది జనవరి నాటికి రూ.2,048 కోట్ల పెట్టుబడులతో 11 భారీ, మెగా ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. వాటికి ప్రోత్సాహకాలను విడుదల చేయడానికి వీలుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.
‣ మచిలీపట్నం ఓడరేవుకు రూ.150 కోట్లు భావనపాడు, రామాయపట్నం ఓడరేవులకు ఒక్కోదానికి రూ.100 కోట్లు వంతున కొత్త బడ్జెట్‌లో కేటాయించారు. ఇంతే మొత్తాలను 2021 - 22 బడ్జెట్‌లో కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు.
‣ విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు భూ వివాదాల పరిష్కారానికి రూ.45 కోట్లు, తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి రూ.2 కోట్లు, ప్రాంతీయ విమానాశ్రయాల - అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు, వాటిల్లో భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి రూ.50 కోట్ల చొప్పున కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
రైతుకు కేటా‘యింపు’లే.. ఖర్చులేవీ?
- రెండేళ్లుగా నెరవేరని వివిధ పథకాల లక్ష్యాలు
వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి. ఖర్చు దగ్గరకు వచ్చే సరికి నిరాశే ఎదురవుతోంది. రైతులకు అధిక లబ్ధి చేకూర్చే సూక్ష్మ సేద్యం, వ్యక్తిగత యంత్ర పరికరాలు, బోర్ల తవ్వకాలు తదితర కీలక కార్యక్రమాలు నిరాదరణకు గురవుతున్నాయి. భూసార పరీక్షలూ జరగడం లేదు. గతంలో లక్షల సంఖ్యలో నమూనాలు తీసి కార్డులు ఇచ్చేవారు. ఏడాదిగా ఇదీ పక్కనబడింది.
లెక్కల్లోనే ‘సూక్ష్మ సేద్యం’
సూక్ష్మసేద్యం అమలులో ఒకప్పుడు దేశానికే దారి చూపిన ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా ఈ పథకం ఊసేలేద]ు. నిరుటి బడ్జెట్‌లో రూ.300 కోట్లు ప్రకటించినా ఒక్క ఎకరాలోనైనా పరికరాలు అమర్చలేదు. 2018 - 19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న పది జిల్లాల్లో 1 నుంచి 5 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. 2018 - 19 సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో అమలైన పథకం 2019 - 20లో 3.05 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. 2020 - 21, 2021 - 22 సంవత్సరాల్లో అమలే కాలేదు. ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తామని ఈ బడ్జెట్‌లోనూ వ్యవసాయ మంత్రి ప్రకటించారు. ఎంత ఖర్చు చేస్తారో మాత్రం చెప్పలేదు. సరఫరాదారులకు మూడేళ్లుగా రూ.930 కోట్ల పాత బకాయిలు ఇవ్వడంలేదు.
వ్యవసాయ యాంత్రీక‘రణమే’
రైతులకు టార్పాలిన్లు, పిచికారీ యంత్రాలు రాయితీపై ఇచ్చే కార్యక్రమాన్నీ అటకెక్కించేశారు. వర్షాకాలంలో రైతులు రూ.వేలు ఖర్చు చేసి టార్పాలిన్లు కొంటున్నారు. స్ప్రేయర్లకూ అధికంగానే వ్యయం చేస్తున్నారు. ఈ ఏడాది వ్యక్తిగత యంత్ర పరికరాలను పంపిణీ చేస్తామంటూ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తంతో, ఎంతమందికి అనేది చెప్పలేదు.
బోరుమంటున్న బోర్లు
జలకళ పథకం కింద అయిదేళ్లలో రూ.2,340 కోట్ల వ్యయంతో రెండు లక్షల బోర్లను తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 11 వేలైనా పూర్తవలేదు. 2021 - 22 సంవత్సరంలో 6,555 బోర్లు తవ్వించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. దరఖాస్తులు లక్షల్లో ఉండగా... వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50 వేల బోర్లను లక్ష్యంగా నిర్ణయించారు.
పీఎం కిసాన్ కాకుండా.. రైతు భరోసా ఎంత?
రైతు భరోసా కింద రూ.7,020 కోట్లను ప్రతిపాదించినట్లు వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు. ఇందులో రైతు భరోసా కేటాయింపులు రూ.3,900 కోట్లు. అంటే మిగిలింది కేంద్రం నుంచి వచ్చేదే. కేంద్ర బడ్జెట్‌లో ఈ లెక్కను కలిపే చెప్పారు. రాష్ట్రమూ అదే లెక్కను మరోసారి వ్యవసాయ బడ్జెట్‌లో కలిపేయడం గమనార్హం.
ఉపాధి హామీ, పీఎం కిసాన్ పథకాలకు 35.65%
వ్యవసాయ బడ్జెట్‌ను రూ.43వేల కోట్లతో ఘనంగా రూపొందించారు. అందులో రైతులకొచ్చే వాటా ఎంత? ఇందులో రాష్ట్రం ఇచ్చేదెంత? అని పరిశీలిస్తే.. లెక్కల్లో కిటుకు ఇట్టే అర్థమవుతుంది. ఉపాధి హామీ అనుసంధానికి రూ.8,329 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకానికి రూ.7,020 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ రెండు పథకాల వాటా 35.65%. ఇందులో అధిక భాగం కేంద్రం నుంచే వస్తుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌లోనే చూపడం గమనార్హం. పైగా 10,315 వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాలు, 2,535 పాలశీతలీకరణ కేంద్రాల నిర్మాణాన్నీ ఉపాధి హామీ కిందనే చేస్తున్నారు. వీటన్నిటినీ వ్యవసాయ బడ్జెట్‌లోనే చూపించారు.
జలయజ్ఞం
రాష్ట్రంలో జలయజ్ఞానికి నిధుల విఘ్నం ఏర్పడింది. నిధుల్లేక.. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టులు అడుగు ముందుకు పడటం లేదు. 2020 - 21లో రూ.1,078 కోట్లు ఖర్చు చేస్తే కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని అంచనా వేశారు. నెల్లూరు, సంగం బ్యారేజి, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార రెండో దశ పనులకు రూ.405 కోట్లు ఖర్చుచేస్తే చాలన్నారు. మరో రూ.600 కోట్లు ఖర్చుచేస్తే అవుకు రెండో టన్నెల్ నుంచి నీటిని మళ్లించడం, వెలిగొండలో కొంత పని పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం చేయవచ్చని నిర్ణయించారు. ఆ పనులేవీ పూర్తికాలేదు. 2022 - 23 బడ్జెట్‌లో జల వనరులశాఖకు రూ.11,482 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుల అవసరాలతో పోలిస్తే ఈ నిధులు చాలవు. ఇందులో జీతాలు, ఇతర రెవెన్యూ వ్యయాలు మినహాయిస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి చేసే ఖర్చు అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్థకమే. 2019 - 20లో రూ.4,337.12 కోట్లు, 2020 - 21లో రూ.4023.65 కోట్లు, 2021 - 22లో రూ.6,832.63 కోట్లే మూలధన వ్యయం చేశారు. అందులోనూ 2021 - 22 లెక్కలను కేటాయింపులతో పోలిస్తే తగ్గిపోయింది. వాస్తవ లెక్కలు తేలేసరికి ఇంకా తగ్గుతుందని సమాచారం.
‣ ప్రస్తుత బడ్జెట్‌లో ఆయా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అనేక చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ప్రభుత్వం పోలవరం మినహా మిగిలిన నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రూ.24,092 కోట్లు అవసరమని లెక్కించింది. మరో రూ.72,458 కోట్లతో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని ప్రణాళిక రచించింది. ఇదే తరహాలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అంచనా వ్యయమూ భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది.
‣ పోలవరం ప్రాజెక్టును 2023 జూన్ నాటికి పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులో +41.15 స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన పనులకే రూ.10 వేల కోట్లు అవసరం. ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించింది రూ.4,163 కోట్లే. కేంద్రం ఏటా రూ.1,500 కోట్లే ఇస్తోంది. ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తికి అవసరమైన దాదాపు రూ.30 వేల కోట్లు ఎప్పటికి ఖర్చుచేస్తారు, పోలవరం పూర్తయ్యేది ఎప్పటికన్నది ప్రశ్నార్థకమే. మిగిలిన చాలా ప్రాజెక్టులకు కేటాయింపులు అంతంతమాత్రంగా ఉన్నాయి.
అమ్మ ఒడికి అందని నిధి!
విద్యార్థుల హాజరు పేరుతో ‘అమ్మఒడి’ పథకం డబ్బులను ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం లేదు. సవరించిన (2021 - 22) బడ్జెట్‌లో ఈ పథకానికి నిధుల కేటాయింపును సున్నాగా చూపించింది. వెరసి ఈసారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పేలా లేదు. అమ్మఒడి కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు రూ.15వేలు అందించే పథకాన్ని ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు కుటుంబంలో ఎందరున్నా ఒక్కరికే ప్రయోజనం అందుతుంది. ఈ మొత్తాన్ని తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొదటి ఏడాది 2020 జనవరి 9న 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,456 కోట్లు జమ చేశారు. తర్వాత ఏడాది 2021 జనవరి 11న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు వేశారు. 2021 - 22లో ఇవ్వకపోవడంతో ఐదేళ్లలో నాలుగు పర్యాయాలే అమ్మఒడి సొమ్ము లబ్ధిదారులకు అందనుంది. 2022, 2023 సంవత్సరాల్లో జూన్‌లో పథకం అమలు చేస్తే 2024 జూన్ నాటికి ఈ పథకం అందకుండానే సాధారణ ఎన్నికలు వచ్చేస్తాయి. తొలి రెండేళ్లు జనవరిలో అమలు చేసిన పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. విద్యార్థుల 75 శాతం హాజరును పరిగణనలోకి తీసుకుని, పాఠశాలలు పునఃప్రారంభించే సమయంలో అమ్మఒడి ఇస్తామని ప్రకటించింది. ఈ నిబంధన కారణంగా 2021 - 22 ఆర్థిక, విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల తల్లులకు ఎలాంటి ప్రయోజనం అందదు. ఈసారి జూన్‌లో ఇవ్వనున్న రూ.6,500 కోట్ల నిధి 2022 - 23 విద్యా, ఆర్థిక సంవత్సరాల కిందకు వస్తుంది. అది 2022 - 23 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజులకు సరిపోతుంది. ప్రస్తుత ఏడాది ఫీజుల భారానికి ఉపశమనం లభించదు. ఫిబ్రవరి వరకు విద్యార్థుల హాజరును పరిశీలించి మార్చిలో డబ్బులు ఇచ్చే అవకాశమున్నా పట్టించుకోలేదు.
రాజధాని నిర్మాణానికి కేటాయింపులు సున్నా
అమరావతి మెట్రోకు రూ.2 కోట్లే!
అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.2 కోట్లే కేటాయించింది. 2021 - 22లో రూ.3.60 కోట్లు కేటాయించినట్లు చూపినా సవరించిన బడ్జెట్‌లో రూ.2.70 కోట్లుగా పేర్కొంది. తొలి దశలో చేపట్టే 38.74 కి.మీ. పనులకు సంబంధించిన అమరావతి మెట్రో రైలు డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ నిపుణుల పరిశీలనలోనే ఉంది. దీనికి ఒక్క రూపాయీ కేటాయించలేదు.
కేటాయింపులు ఇవే..
‣ 2022 - 23 బడ్జెట్ కేటాయింపుల్లో ‘ఏపీసీఆర్‌డీఏ’కి సాయం పేరుతో రూ.200 కోట్లు కేటాయించింది. అది గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. 2021 - 22 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఏడాదికి రూ.550 కోట్లు కావాలి. ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లే చూపించారు.
‣ ‘రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి’ పేరుతో మరో రూ.121.11 కోట్లు కేటాయించారు. అవి రాజధాని గ్రామాల్లోని భూమిలేని పేదలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు చేసిన కేటాయింపులు.
‣ ‘కొత్త రాజధాని కోసం భూసమీకరణ’ పేరుతో రూ.208.10 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం ఇది.
‣ ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాల్సినవి కాబట్టి ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
‣ ‘కొత్త రాజధాని నగరంలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధి’ పేరుతో రూ.800 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం వచ్చే హెడ్ కింద చూపింది. ఇదే పద్దు కింద 2021 - 22 బడ్జెట్‌లోనూ రూ.500 కోట్లు ప్రతిపాదించింది. కానీ 2021 - 22 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం చూస్తే దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.
‘పట్ట(ణ) ం’ కట్టలేదు!
- మూడో శ్రేణి మున్సిపాలిటీలకు సున్నా
బడ్జెట్‌లో గ్రేడ్-3 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపాయి కూడా కేటాయించలేదు. 2021 - 22లో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.60 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన బడ్జెట్‌లో దీన్ని రూ.14.30 కోట్లుగా చూపారు. పట్టణాల్లో రహదారులు, మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నందున తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉంది. కేంద్రం ద్వారా వచ్చే 14, 15వ ఆర్థిక సంఘాల నిధుల్లో నుంచి రూ.294 కోట్లు విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద మళ్లించడంతో మున్సిపాలిటీలకు పనులు చేయడానికి సొమ్ముల్లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో మౌలిక సదుపాయాల కల్పన ప్రశ్నార్థకమైంది. అయితే, గుంటూరు జిల్లా మంగళగిరిలో అభివృద్ధి పనులకు రూ.20 కోట్లు, కడప జిల్లా పులివెందులకు రూ.10 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
‘నాడు-నేడు’కు రూ.వెయ్యి కోట్ల కోత
విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించే మన బడి, ‘నాడు-నేడు’ పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కోత విధించింది. రాష్ట్రంలో 16,368 విద్యా సంస్థల్లో 10 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.4,535 కోట్లు వెచ్చించనున్నట్లు గతేడాది ఆగస్టు 16న ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో మాత్రం రూ.3,500 కోట్లే కేటాయించింది. ఇటీవల సిమెంటు, ఇనుము ధరలు పెరిగినందున ఈ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉండగా.. ఇందుకు భిన్నంగా రూ.1,035 కోట్లు తగ్గించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం కోత పెట్టింది. సవరించిన బడ్జెట్‌లో రూ.980.07 కోట్ల కేటాయింపులు ఉండగా, తాజా బడ్జెట్‌లో వీటిని రూ.923.89 కోట్లకు తగ్గించింది.
ఉపాధిలో ఉత్త కార్పొరేషన్లే!
అవన్నీ వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు.. కానీ వాటికి ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించదు.. వివిధ సంక్షేమశాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులనే ఆయా కార్పొరేషన్ల వారీగా విభజించి వాటికి నిధులిస్తున్నట్లు మాయ చేస్తుంది. చూస్తుండగానే నిధులు కరిగిపోతుంటాయిగానీ ఆయా వర్గాలకు స్వయం ఉపాధి కల్పన జరగటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల నుంచి అగ్రవర్ణాల కార్పొరేషన్ల వరకు అన్నింటా అదే తీరు. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించి ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టినా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేకపోవడం ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం నవరత్న పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుంది. పథకాల అమలు సమయంలో సంక్షేమశాఖల నుంచి నిధులు కార్పొరేషన్ల ఖాతాల్లోకి బదిలీ చేసి అక్కడి నుంచి తరలిస్తారు. అంతే తప్ప సొంతంగా ఆయా సామాజికవర్గాలకు రాయితీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు కార్పొరేషన్లకు ప్రత్యేక కేటాయింపులు లేవు. గత మూడేళ్లుగా ఇదే మాయ కొనసాగుతోంది. పింఛన్ల ఆర్థిక సహకారం, ఉపకార వేతనాలు, కళాశాలల ఫీజుల చెల్లింపు, వడ్డీ రాయితీ మంజూరునూ కార్పొరేషన్ నిధులుగానే పేర్కొనడం గమనార్హం. కొద్దో గొప్పో కేంద్ర ప్రభుత్వ రాయితీ రుణ పథకాల సహకారంతో గతేడాది వివిధ వర్గాల వారి ఉపాధి కల్పనకు కొంతమేర ప్రయత్నించినా అది మధ్యలోనే ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీకి ఉద్దేశించిన వాహనాలను మాత్రం రాయితీ రుణాల కింద అందజేసింది.
ఇదీ అసలు లెక్క
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రైస్తవ, బ్రాహ్మణ, కాపు, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపును ప్రస్తావించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌కు కేటాయించిన నిధుల్ని మళ్లీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఈబీసీ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లుగా విభజించి వాటిలోనూ పొందుపరిచింది. ప్రతి కార్పొరేషన్ కేటాయింపులోనూ నవరత్న పథకాల నిధుల్ని ప్రస్తావించింది. ఉదాహరణకు వైఎస్సార్ పింఛను కానుక పథకానికి రూ.18,000 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ లెక్కల్లో చూపింది. ఈ నిధుల్నే సామాజికవర్గాల వారీగా విభజించి పైన వెల్లడించిన ప్రతి కార్పొరేషన్‌లోనూ ప్రస్తావించింది. ఈ వైఖరితో కార్పొరేషన్లు ఆయా సామాజికవర్గాల వారికి స్వయం ఉపాధికి సాయం చేయలేక నామమాత్రంగానే మిగులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘నిషేధం’పై నిషేధం?
మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్ హామీలన్నీ నీటిమూటలవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి భిన్నంగా అధికారం చేపట్టాక వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దశలవారీ మద్య నిషేధాన్ని పక్కనపెట్టేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరం (2022 - 23లో) స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద రూ.16,500 కోట్ల మేర ఆదాయం ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద రూ.14,500 కోట్లు రాబడి వస్తుందని.. సవరించిన అంచనాల్లో పేర్కొంది. దాంతో పోలిస్తే 2022-23లో స్టేట్ ఎక్సైజ్ పద్దు ద్వారా అదనంగా రూ.2,500 కోట్ల మేర రాబడి లభిస్తుందని అంచనా. మరి ఆ మేరకు లక్ష్యానికి చేరుకోవాలంటే మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచాల్సిందేనని బడ్జెట్‌లో పరోక్షంగా ప్రభుత్వమే చెప్పింది.
2019 - 20లో రూ.20,871 కోట్లు, 2020 - 21లో రూ.20,189 కోట్లు విలువైన మద్యం అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021 - 22లో) ఇప్పటివరకూ రూ.22వేల కోట్లకు పైగానే విక్రయాలు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద రూ.14,500 కోట్ల మేర రాబడి ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొంది
‣ 2022 - 23లో స్టేట్ ఎక్సైజ్ పద్దు కింద రూ.16,500 కోట్ల ఆదాయం ఆర్జించాలని భావిస్తున్న ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ.28 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిపితేనే లక్ష్యాన్ని సాధించటం సాధ్యపడుతుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. మద్యం విక్రయాల విలువలో స్టేట్ ఎక్సైజ్ కాకుండా అదనంగా వ్యాట్, స్పెషల్ మార్జిన్, ఏపీఎస్‌బీసీఎల్ కమీషన్, ఆర్‌ఈటీ, ఏఆర్‌ఈటీ వంటివన్నీ కలిసి ఉంటాయి. అంటే లక్ష్యాల్ని విధించి మరీ మద్యం అమ్మాల్సి ఉంటుంది.
ఎక్సైజ్ ఆదాయం 255 శాతం పెరుగుదల
‣ మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే మద్య నిషేధం అనే తరహాలో ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. మద్యాన్ని ఆదాయ మార్గంగానే పరిగణిస్తున్నారు. అందుకే దాని ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
‣ 2016 - 17లో మద్యంపై ప్రభుత్వానికి స్టేట్ ఎక్సైజ్ ద్వారా రూ.4,644.66 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనాల ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16,500 కోట్లు వస్తుందని అంచనా. అంటే ఆరేళ్లలో మద్యం విక్రయాల ద్వారా స్టేట్ ఎక్సైజ్ రూపేణా వచ్చిన ఆదాయం 255.263 శాతం పెరిగింది.
ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు
నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే పథకం మళ్లీ మొదలుకానుంది. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల చొప్పున.. 175 నియోజకవర్గాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ వీటిని కేటాయిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపు పథకం ఎప్పటి నుంచో ఉంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జ్‌ట్ 2022-23 ప్రసంగం