• facebook
  • whatsapp
  • telegram

జపాన్‌తో ద్వైపాక్షిక బంధం

కీలకం కానున్న కిషిద భారత పర్యటన

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా పరిస్థితులు వేడెక్కిన వేళ జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మార్చి 19, 20 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న ఆయన- ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు, చైనా దూకుడు, ఉక్రెయిన్‌ సంక్షోభం, టోక్యో వేదికగా జరగనున్న క్వాడ్‌ తదుపరి సదస్సు వంటివి సమావేశ అజెండాలో ప్రాధాన్యాంశాలుగా మారే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలయ్యాక భారత్‌లో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ స్థాయి నేత ఆయనే. కిషిద పర్యటనతో భారత్‌కు పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయన్న అంచనాలున్నాయి.

సుదీర్ఘ సహకారం

ఇండియా, జపాన్‌ ద్వైపాక్షిక సంబంధాలకు ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తవనున్నాయి. 2005 నుంచి ఇరు దేశాల ప్రధానులు వార్షిక శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొంటూ వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తున్నారు. మూడేళ్లుగా ఈ భేటీలకు బ్రేకులు పడ్డాయి. 2018లో వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ జపాన్‌ వెళ్ళారు. మరుసటి ఏడాది గువాహటిలో జరగాల్సిన సమావేశం- పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనల కారణంగా రద్దయింది. ఆ తరవాత కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ప్రత్యక్ష భేటీలు రద్దవుతూ వచ్చాయి. 2020లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబె, మోదీ ఫోన్‌లో చర్చలు జరిపారు. అబె తరవాత ప్రధాని పీఠమెక్కిన సుగా- గత ఏడాది మోదీతో వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. ఎట్టకేలకు కిషిద పర్యటనతో మళ్ళీ ఇండియా-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సులు పూర్తిస్థాయిలో పట్టాలకు ఎక్కబోతున్నాయి. గత ఏడాది అక్టోబరులో ప్రధాని పీఠం అధిరోహించిన కిషిద గతంలో సుదీర్ఘకాలం విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో   ఇండియాతో సన్నిహితంగా మెలిగారు. ఈశాన్య భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి 2015లో జపాన్‌ భారీ ప్రాజెక్టును ప్రకటించడం వెనక కిషిద కృషి ఉంది. ప్రస్తుతం ఆయన ప్రధాని హోదాలో పర్యటనకు రానుండటంతో కీలక ప్రాజెక్టులకు ఊపు వస్తుందని, కొన్ని కొత్త ఒప్పందాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా) రుణసాయంతో చేపట్టిన అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో పురోగతిని సమీక్షించనున్నారు. ఇండియా 75 వసంతాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొనే 2022 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలన్నది లక్ష్యం. కానీ భూ సేకరణ వివాదాలు, కొవిడ్‌ విజృంభణ వంటి పరిణామాలతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఇతర మార్గాల్లో ప్రాజెక్టు విస్తరణపైనా ఇరు దేశాలు చర్చించే   ఆస్కారముంది. జల విద్యుత్తు, అటవీ నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, నీటి సరఫరా, మురుగు శుద్ధి వంటి రంగాల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టే దిశగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంపై చర్చించే అవకాశముంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చినా ఇరు దేశాల మధ్య సరఫరా గొలుసులు దెబ్బతినకుండా చూసుకోవడంపై సమాలోచనలు జరగనున్నాయి. ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని ఇండియా, జపాన్‌ బలంగా కోరుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో చైనా దూకుడు ఇరు దేశాలకు ఒకింత ఆందోళన కలిగిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో, జపాన్‌ సెంకాకు దీవుల సమీపంలో డ్రాగన్‌ బలగాల కదలికలు మోదీ-కిషిద చర్చల్లో ప్రస్తావనకు వచ్చే ఆస్కారం ఉంది. ఇతర ప్రాంతాల్లో చైనా కవ్వింపు ధోరణులు, అఫ్గాన్‌, పాకిస్థాన్‌ పరిణామాలపైనా సమాలోచనలు జరగవచ్చు.

ఉక్రెయిన్‌ సంక్షోభంపైనా...

ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో ఇండియా, జపాన్‌ దాదాపు భిన్న ధ్రువాలుగా వ్యవహరిస్తున్నాయి. రష్యా వైఖరిని జపాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు పశ్చిమ దేశాలతో కలిసి కిషిద సర్కారు మాస్కోపై కఠిన ఆంక్షలు ప్రకటించింది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడంపై ఇతర దేశాలతో చర్చలు జరుపుతోంది. వివాదాన్ని దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్‌లకు సూచిస్తున్న ఇండియా- మాస్కో వైఖరిని నిరసించడం లేదు. క్వాడ్‌ సభ్య దేశాల్లో భారత్‌ మినహా మిగతా మూడు దేశాలూ (జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా) మాస్కోపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా వైఖరి కారణంగా క్వాడ్‌లో విభేదాలు పొడచూపాయని, ఆ కూటమి నిర్వీర్యమవడం ఖాయమని తొలుత విశ్లేషణలు వచ్చాయి. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు. ఇటీవలే అమెరికా నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో క్వాడ్‌ సమావేశం సాఫీగా సాగింది. మోదీ, కిషిద తాజా భేటీలో ఉక్రెయిన్‌ సంక్షోభం చర్చకు వస్తుందనడంలో సందేహం లేదు. యుద్ధం విషయంలో ఇరువురు నేతలూ తమ  అభిప్రాయాలను పంచుకొనే అవకాశముంది. ఈ ఏడాది మే/జూన్‌లో జపాన్‌లో జరగనున్న క్వాడ్‌ తదుపరి సమావేశం అజెండా గురించీ మోదీతో కిషిద చర్చిస్తారని అంచనా.

 

- శ్రీయాన్‌

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని